మన చేతుల్లోనే.. ఆధార్‌ అప్‌డేట్‌

ప్రస్తుతం దేశంలో ఏ పనికైనా, ఎక్కడికి వెళ్లాలన్నా ఆధార్‌ కార్డును తప్పనిసరి. ఎంతో కీలకంగా మారిన ఈ కార్డును పదేళ్లకోసారి నవీకరణ (అప్‌డేట్‌) చేసుకోవాలని విశిష్ట గుర్తింపు పొందిన ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్దేశించింది.

Updated : 26 Mar 2023 09:53 IST

చరవాణి, కంప్యూటర్లలో సులభంగా చేసుకోవచ్చు
ఉచిత సేవలకు జూన్‌ 14 వరకు అవకాశం
న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

ప్రస్తుతం దేశంలో ఏ పనికైనా, ఎక్కడికి వెళ్లాలన్నా ఆధార్‌ కార్డును తప్పనిసరి. ఎంతో కీలకంగా మారిన ఈ కార్డును పదేళ్లకోసారి నవీకరణ (అప్‌డేట్‌) చేసుకోవాలని విశిష్ట గుర్తింపు పొందిన ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్దేశించింది. ఉచిత సేవలకు జూన్‌ 14 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకునేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినా సేవలు మాత్రం సక్రమంగా అందడం లేదు. సచివాలయాలు, ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాల చుట్టూ పలుమార్లు ప్రదక్షిణలు చేస్తే తప్ప, పని పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెచ్చింది. ఆధార్‌ అప్‌డేషన్‌ను ఎవరికి వారే స్వయంగా, సులభంగా చేసుకునే వెసులుబాటు తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా అటు సమయం, ఇటు డబ్బు ఆదా అవుతుందని భావిస్తున్నారు.

పుట్టిన తేదీ మార్పు ఇలా...

గతంలో పుట్టిన తేదీ మార్పునకు యూఐడీఏఐ నమూనా ఫారం పూరించి గెజిటెడ్‌ అధికారి సంతకం చేస్తే సరిపోయేది. పాన్‌ కార్డులోని పుట్టిన తేదీని అధికారికంగా ధ్రువీకరించుకునే వీలు కలిగేది. ప్రస్తుతం పురపాలక, పంచాయతీలు జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌ మాత్రమే ధ్రువీకరణ పత్రంగా సమర్పించాలి. పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంది. మరోసారి మార్చుకోవాలంటే రాష్ట్ర రాజధాని కార్యాలయానికి వెళ్లి మార్పునకు కారణాలు తెలియజేస్తూ తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

డబ్బు ఆదా, సమయం ఆదా

ఆధార్‌ నవీకరణ చేసుకోవాలంటే ఆయా కేంద్రాల్లో రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సొంతంగా నవీకరణ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ కనీసం రూ.100 డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేసే కష్టాన్ని తప్పించుకోవచ్చు. ఆధార్‌ నవీకరణ చేసుకోవాల్సిన దాదాపు 12 లక్షల మందిలో సగం మంది సొంతంగా నవీకరణ చేసుకున్నా రూ.6 కోట్లు ఆదా చేసుకున్నట్లే.

మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా..

* చరవాణిలో, కంప్యూటర్‌లో ‘మై ఆధార్‌ పోర్టల్‌’ ‘ఎం-ఆధార్‌’ యాప్‌ ద్వారా ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

* మొదట మై ఆధార్‌.యూఐడీఏఐ.జీవోవీ.ఇన్‌ తెరవాలి. ఆధార్‌ సంఖ్యను ఎంటర్‌ చేయాలి.

* ఆధార్‌కు అనుసంధానమైన చరవాణికి వచ్చే ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి.

* మార్పులు చేయాలనుకున్నవారు డాక్యుమెంట్‌ అపడేట్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. చిరునామా రుజువు చూపుతూ మరో ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌ చేయాలి. ధ్రువీకరణ కింద ఓటర్‌ ఐడీ, విద్యార్హత పత్రాలు, బ్యాంకు ఖాతా పుస్తకం... వీటిలో ఏదైనా ఒకటి రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది.

* ఇవన్నీ పూర్తయిన తర్వాత నవీకరణ పూర్తయినట్లు రసీదు జనరేట్‌ అవడంతోపాటు, చరవాణికి సందేశం కూడా వస్తుంది.


నవీకరణ ఎవరికి అవసరం?

2010 నుంచి 2018 వరకు ఆధార్‌ నమోదుదారునికి కార్డుపై పేరుతోపాటు తండ్రి, భర్త అనే విధంగా బంధుత్వం ఉంటుంది. 2018 తర్వాత వాటిని తొలగించి కేవలం కేరాఫ్‌గా పేర్కొంటున్నారు. ఇలా ఉన్నవారు కేరాఫ్‌ లేకుండా నవీకరించుకోవాలి. 2009లో ఆధార్‌ ప్రారంభమైన సమయంలో వ్యక్తిగత వివరాలు నమోదు చేశారు. ప్రస్తుతం వివరాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను పొందుపరుస్తూ నవీకరణ చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని