పెద్దల అండ ఉన్నవారికే బిల్లులు

కంకిపాడు మండలం తెన్నేరు సాగునీటి పంపిణీ కాలువ (డీసీ) కింద 2017-18లో జలవనరుల శాఖలో పూడికతీత పనులకు రూ.23 లక్షలు వెచ్చించారు. ఒక గ్రామ పెద్ద కమిటీ తరఫున ఈ పనులు చేశారు.

Updated : 27 Mar 2023 05:25 IST

నిర్వహణ పనులకు నిధుల కొరత
జలవనరుల శాఖలో పేరుకుపోతున్న బకాయిలు
నీరు-చెట్టుకూ మోక్షం లేదు..!
ఈనాడు, అమరావతి

* కంకిపాడు మండలం తెన్నేరు సాగునీటి పంపిణీ కాలువ (డీసీ) కింద 2017-18లో జలవనరుల శాఖలో పూడికతీత పనులకు రూ.23 లక్షలు వెచ్చించారు. ఒక గ్రామ పెద్ద కమిటీ తరఫున ఈ పనులు చేశారు. ఇంతవరకు ఒక్క రూపాయి బిల్లు రాలేదు. కమిటీ తరఫున చేయడంతో ఆయన వ్యక్తిగతంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేక బిల్లులు రాక అప్పుల పాలయ్యారు. ఇదే మండలం ఉప్పులూరు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో ఒక చిన్న రైతు నీరు-చెట్టు కింద రూ.12 లక్షల విలువైన పనులు చేశారు. ఆయన పరిస్థితి కూడా అంతే. కంకిపాడు డీసీ పరిధిలో ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో మొత్తం రూ.కోటి విలువైన పనులు చేశారు. వీటికి కూడా బిల్లులు రాలేదు.  

* పెనమలూరు మండలంలో కాలువల పూడికతీత పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టరు తమకు బిల్లులు చెల్లించడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దాదాపు రూ.2.50కోట్లు బిల్లులు మంజూరయ్యాయి. అంతకు ముందు చేసిన గుత్తేదారులకు మాత్రం చెల్లించలేదు. ఇదే నియోజకవర్గంలో ఓ గుత్తేదారు రూ.7.50 కోట్లతో బందరు కాలువ పనులను 2021-22 ఏడాదిలో పూర్తిచేయగా ఇంకా బిల్లులు రాలేదు.

జిల్లాలో జలవనరుల శాఖలో రూ.కోట్లలో గుత్తేదారులకు బిల్లులు పేరుకుపోయాయి. నిధుల కొరతే ఇందుకు కారణం. మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి వెంటనే మంజూరవుతున్నాయి. గుత్తేదారులకు జలవనరుల శాఖ అధికారులు సైతం కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెస్తే.. వెంటనే ఇస్తామంటూ ఉచిత సలహాలిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్న వారికి మాత్రం వెంటనే అందుతున్నాయి.

కొత్త ప్రభుత్వంలోనూ..!

ప్రస్తుత ప్రభుత్వంలో నిర్వహణ పనులు చేసిన గుత్తేదారులకు చిన్నపాటి కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు. సీరియల్‌ ప్రకారం అని చెబుతున్నా.. పెద్దల ఆశీస్సులు ఉన్నవారికే వస్తున్నాయి. ఎమ్మెల్యేల సిఫార్సులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో కోర్టుకు వెళ్లి తెచ్చుకుంటున్నారు.  గత ఏడాది జగ్గయ్యపేట మండలంలో కృష్ణా నదిపై వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మాణం ప్రారంభించారు. బడా గుత్త సంస్థ చేపట్టింది. కొన్ని పనులు చేసిన తర్వాత బిల్లులు సమర్పించగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో కాంట్రాక్టు వదిలేసుకుంది. ఇదే సమయంలో విజయవాడ నగరంలో వరద రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. కడప జిల్లాకు చెందిన ఓ సంస్థ నిర్మాణం చేపట్టింది. రెండో పార్టు నిర్మాణం పూర్తి చేసింది. బిల్లులు అందాయి. మూడో పార్టు కూడా ఆ సంస్థకే వచ్చింది. అధికారులు మాత్రం బిల్లులు చేసినందుకు ముందే కమీషన్లు తీసుకుంటున్నారని ఓ గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి నిర్వహణ (ఓఅండ్‌ఎం) పనులు చేసిన తాము వడ్డీలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని చిన్న సన్నకారు రైతులు వాపోతున్నారు.

విచారణ పూర్తయినా..

గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన నీరు- చెట్టు కింద చేపట్టిన వాటికి ప్రస్తుత ప్రభుత్వం మొత్తం బిల్లులు నిలిపివేసింది. జలవనరుల శాఖలోనే కాకుండా చిన్న నీటిపారుదల శాఖలోనూ చెరువుల పూడిక తీత పనులను నిర్వహించారు. ఇవన్నీ చిన్న సన్నకారు రైతులు నిర్వహించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ బిల్లులకు కొర్రీలు వేసింది. అన్నింటినీ నిలిపివేసింది. వీటిపై విజిలెన్సు విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయినా.. బిల్లులు మంజూరు చేయకుండా నిలిపివేశారు. దీనిపై తెదేపా నేతలు న్యాయపోరాటం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం రూ.62 కోట్లు చిన్న రైతులకు అందాల్సి ఉంది. కొంతమంది కోర్టుకు వెళ్లగా 70శాతం బిల్లులు అందించాలని ఆదేశాలు అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని