KTR: భాజపా నేతలతో వేదికపై బిల్కిస్‌బానో దోషి.. కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ భాజపాపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతల మెండ్‌సెట్‌ ఇదే నంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Updated : 27 Mar 2023 14:36 IST

హైదరాబాద్‌ :  భాజపా అంటే.. బలాత్కార్‌ జస్టిఫికేషన్‌ పార్టీ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బిల్కిస్‌ బానో కేసు దోషులతో భాజపా నేతలు సన్నిహితంగా ఉండటం ఆ పార్టీ విధానాలను తెలియజేస్తుందని కేటీఆర్‌ ట్విటర్‌లో విమర్శించారు.

బిల్కిస్‌ బానో దోషులు విడుదలైనప్పుడు వారిని భాజపా నేతలు సత్కరించి సంబరాలు చేసుకున్నారని.. ఇప్పుడు వారు భాజపా ప్రజాప్రతినిధులతో వేదికను పంచుకుంటున్నారని ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కేటీఆర్‌.. కాషాయ పార్టీపై ధ్వజమెత్తారు.

గుజరాత్‌లో శనివారం జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో భాజపా ప్రజాప్రతినిధులతో కలిసి బిల్కిస్‌ బానో కేసు దోషుల్లో ఒకరైన శైలేష్‌ చిమన్‌లాల్‌ భట్‌ పాల్గొన్నాడు. దాహోద్‌ జిల్లా కర్మాడి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతడు భాజపా ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి వేదికపై ఉన్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో కూడా అతడు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఎంపీ, ఎమ్మెల్యే సోషల్‌ మీడియాలో పంచుకోగా అవి వైరల్‌గా మారాయి. ఇప్పుడు కేటీఆర్‌ ట్విటర్‌లో ఈ ఫొటోలనే ప్రస్తావించి ఆ పార్టీపై వ్యంగాస్త్రాలు సంధించారు.

బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులను గత ఏడాది ఆగస్టు 15 సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌పై విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. వీరి విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని