Bhadrachalam: రాములోరి పెళ్లికి ఖమ్మం గోటి తలంబ్రాలు

భద్రాచలం రాములోరి పెళ్లికి ఖమ్మం నగరానికి చెందిన అనంత పద్మనాభ కోలాట భజన భక్తబృందం గోటి తలంబ్రాలను సమర్పించింది

Updated : 30 Mar 2023 07:21 IST

వడ్లను గోళ్లతో వలుస్తున్న మహిళలు

ఖమ్మం బల్లేపల్లి, న్యూస్‌టుడే: భద్రాచలం రాములోరి పెళ్లికి ఖమ్మం నగరానికి చెందిన అనంత పద్మనాభ కోలాట భజన భక్తబృందం గోటి తలంబ్రాలను సమర్పించింది. పతకముడి లక్ష్మి సారథ్యంలో బృంద సభ్యులు ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెంలో వరినాట్లు వేసి పంట పండించారు. 50 కిలోల వడ్లు పండగా రఘునాథపాలెం, వీఆర్‌బంజర, చింతపల్లి, కోయచెలక, రేగులచెలక, గణేశ్వరం, కోటపాడు, భయన్నపాడు, ఆంధ్రప్రదేశ్‌లోని గూడవల్లి, చెరుకుపల్లి గ్రామాలకు ఉచితంగా గోటి తలంబ్రాల కోసం పంచిపెట్టారు. ఈ బృందం గోటితో ఒలిచిన 8 కిలోల తలంబ్రాలను భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో సమర్పించారు. ఈ క్రతువులో బృంద సభ్యులు బి.విజయలక్ష్మి, సీహెచ్‌.రాధిక, టి.కవిత, టి.రజిత, హైమావతి, విజయ, సత్యవతి, వి.జ్యోతి, పి.పద్మ, వి.లక్ష్మి, ఉమ, ఆర్‌.లక్ష్మి, పి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

అంతరాలయ సేవల వినియోగంలో..

ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే: శ్రీరామనవమి రోజున భద్రాచలం వెళ్లలేక ఇంటి నుంచే అంతరాలయ అర్చన భాగ్యం పొందాలనుకునే సాధారణ భక్తుడికి తపాలా శాఖ వారధిగా నిలిచింది. రూ.450 చెల్లించిన వారికి అంతరాలయ అర్చన, రూ.150 చెల్లించిన వారికి ముత్యంతో కూడిన తలంబ్రాలు ఇంటికి అందించేందుకు తపాలా శాఖ ఓ ప్రయత్నం చేసింది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే అత్యధికంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 14,335 మంది పేర్లు నమోదు చేసుకోగా ఇందులో 2,067 మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వారే ఉన్నారు. మార్చి నెల 8నుంచి 29 వరకు తపాలా కార్యాలయాల్లో ఆసక్తి ఉన్న భక్తుల పేర్లు నమోదు చేసి దేవస్థానానికి అందించారు. రూ.450 చెల్లించే అంతరాలయ సేవలను ఈ నెల 29వరకు మాత్రమే అనుమతించారు. రూ.150 చెల్లించి తలంబ్రాలు కోరుకునే వారు ఈ నెల 31వరకు నమోదు చేసుకునే సదుపాయాన్ని తపాలా శాఖ కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని