ఆధునిక వైద్యం.. అందనంత దూరం!

పారిశ్రామిక ప్రాంతం పటాన్‌చెరు నియోజకవర్గం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ప్రజలు నివసిస్తుంటారు. ఏ పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తోందో తెలియదు.

Updated : 02 Apr 2023 04:11 IST

గతేడాది రూ.70 కోట్లు మంజూరు
పటాన్‌చెరులో ప్రారంభం కాని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

ప్రాంతీయ దవాఖానా

పారిశ్రామిక ప్రాంతం పటాన్‌చెరు నియోజకవర్గం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ప్రజలు నివసిస్తుంటారు. ఏ పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తోందో తెలియదు. అలాంటి ప్రాంతంలో ఆధునిక ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో.. సమీపంలోని హైదరాబాద్‌కు క్షతగాత్రులను తరలిస్తున్నారు. దూరాభారం, ట్రాఫిక్‌ తదితర సమస్యలతో సకాలంలో వైద్య సేవలందక క్షతగాత్రులు మృతిచెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి ఇక్కట్లకు చెక్‌ పెట్టడానికి ప్రభుత్వం పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంకల్పించింది. గతేడాది రూ.70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో భవన నిర్మాణానికి రూ.45 కోట్లు, వైద్య పరికరాల ఏర్పాటుకు రూ.25 కోట్లు వెచ్చించాలి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు భావించారు. ఏడాదిగా కొలిక్కి రాకపోవడంతో పనుల జాప్యంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కథనం.

200 పడకల ఏర్పాటుకు నిర్ణయం

పటాన్‌చెరులో ఇప్పటికే 100 పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. అందులోనే 200 పడకలతో అన్ని వసతులతో కూడిన దవాఖానాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ స్టేట్‌ పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను సమకూరుస్తోంది. గతేడాది జూన్‌ 16న ఆయా నిధులు కేటాయిస్తూ.. ఆ రెండు విభాగాలు జీవోలు జారీ చేశాయి. భవన నిర్మాణ పనుల టెండర్లను గతేడాది సెప్టెంబరు 22న శ్రీ శివరాం కంపెనీ దక్కించుకోగా.. ఒప్పందం ప్రక్రియ సైతం పూర్తయింది. పనులు చేపట్టడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోతీరుగా ఉండటంపై విమర్శలొస్తున్నాయి.

కల్పించాల్సిన సౌకర్యాలు

పనుల పర్యవేక్షణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కి అప్పగించారు. మంజూరైన నిధులతో సకాలంలో పనులు పూర్తి చేస్తే.. 24 గంటలు ఖరీదైన వైద్యసేవలు అందనున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అన్ని విభాగాల వైద్యాధికారులు, సిబ్బందిని భర్తీ చేయాలి. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే యంత్ర పరికరాలు బిగించాలి. ఆవరణలో సీసీ రహదారులు నిర్మించాలి. ఘన, ధ్రవ వ్యర్థాలకు ప్రత్యేకంగా వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలి. వృథా నీటిని శుద్ధి చేసి మొక్కలకు పారించాలి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే పేదలకు ఖరీదైన వైద్యం అందనుంది.


త్వరలో పనులు ప్రారంభిస్తాం
-కె.సంగారెడ్డి, జిల్లా ఆసుపత్రులు, సేవల సమన్వయకర్త

పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి గతేడాది నిధులు మంజూరయ్యాయి. ఆయా పనులు ప్రారంభించడానికి సీఎం కేసీఆర్‌ను రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. శంకుస్థాపన చేసిన తర్వాత పనులు ప్రారంభించాలని భావిస్తున్నాం. ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయితే పారిశ్రామికవాడలో అన్ని వర్గాలకు ఖరీదైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని