పెళ్లి తంతులో కొత్త పుంతలు

జీవితంలో కల్యాణం అనేది రెండు మనసుల మాంగల్య బంధం.. నిండు నూరేళ్లు కలిసి చేసే ప్రయాణం.. ఒకప్పుడు వివాహ క్రతువులో జీలకర్ర బెల్లం.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణ.. మాంగల్యధారణ.. ఏడడుగులు.. తలంబ్రాలతో పెళ్లిపుస్తకానికి శుభం కార్డు పడేది.. ఇప్పుడు ఆధునిక హంగులతో పెళ్లితంతు కొత్తపుంతలు తొక్కుతోంది.

Updated : 02 Apr 2023 04:09 IST

అంబరాన్ని తాకేలా వివాహ సంబురాలు
ఖమ్మం బల్లేపల్లి, న్యూస్‌టుడే

జీవితంలో కల్యాణం అనేది రెండు మనసుల మాంగల్య బంధం.. నిండు నూరేళ్లు కలిసి చేసే ప్రయాణం.. ఒకప్పుడు వివాహ క్రతువులో జీలకర్ర బెల్లం.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణ.. మాంగల్యధారణ.. ఏడడుగులు.. తలంబ్రాలతో పెళ్లిపుస్తకానికి శుభం కార్డు పడేది.. ఇప్పుడు ఆధునిక హంగులతో పెళ్లితంతు కొత్తపుంతలు తొక్కుతోంది. శుభలేఖ నుంచి అప్పగింతల వరకూ ఆకర్షణీయమైన ఏర్పాట్లకు శ్రీకారం చుడుతున్నారు. ధనం మనది కాదనుకుంటే దర్జాగా పెళ్లి సంబురాలను అంబరాన్ని తాకేలా చేసేసుకోవచ్చు. కల్యాణ మండపాల నుంచి భోజనాల వరకూ ఒకరిని మించి మరొకరు భిన్నత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. 

తెలుగింటి పెళ్లిళ్లలో ఉత్తరాది సంస్కృతి ఘట్టాలు ఆవిష్కృతమవుతున్నాయి. మంగళస్నానాల క్రతువును హల్దిఫంక్షన్‌ పేరిట శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు పసుపురంగు వస్త్రాలు, అలంకరణతో సందడి చేస్తున్నారు. పూలు, సుగంధ ద్రవ్యాలతో నిండిన ఇత్తడి గంగాళాలు (పాత్రలు), అరటి ఆకులు, బంతిపూల దండలతో వేదికలు ఆకట్టుకుంటున్నాయి. జోష్‌ పాటలతో సందడి చేస్తూ ఫొటోషూట్‌లో బంధించేస్తున్నారు. పెళ్లికూతురుతో పాటు ఇంటిల్లిపాది అలంకరించుకుని మెహందీ వేడుకలు జరుపుకొంటున్నారు. ఇక సంగీత్‌ గురించి చెప్పక్కర్లేదు. రెండువైపులా కుటుంబాలు నెలరోజుల ముందు నుంచే కొరియోగ్రాఫర్లను ఎంపిక చేసుకొని నృత్యాలు నేర్చుకుంటున్నాయి. వెలుగుజిలుగుల మధ్య పాటలకు చక్కని అభినయంతో చేసే నృత్యాలను కెమెరాల్లో నిక్షిప్తపరుస్తున్నారు. స్నేహితులతో చేసే బ్యాచిలర్‌ పార్టీలు దుమ్మురేపుతున్నాయి. పెళ్లి, రిసెప్షన్‌కు వేలాది మంది తరలివస్తుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

రిటర్న్‌ గిఫ్ట్‌లు...

పేరుకే పెళ్లిభోజనం అంటారు కానీ ఎన్నో రకాల టిఫిన్లు, స్నాక్‌ ఐటమ్స్‌, బోలెడన్ని స్వీట్స్‌, పండ్లు, వివిధ వంటకాలకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్‌గిఫ్ట్‌లు ఇస్తూ జ్ఞాపకాలను వీడియోలు, ఫొటోల్లో బంధిస్తున్నారు.

రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని..

పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో అట్టహాసంగా కల్యాణం జరిపించింది. ఇల్లెందుకు చెందిన నాలుగు కుటుంబాలు ఈమధ్య ఖమ్మంలోనే ఘనంగా పెళ్లిళ్లు చేశాయి. ఖమ్మం నగరానికి చెందిన ప్రవాస భారతీయులు హైదరాబాద్‌లోని ఓ పెద్ద హోటల్‌లో వివాహ వేడుకలు నిర్వహించారు. పెళ్లికి హాజరయ్యే రెండు కుటుంబాల బంధువులు, స్నేహితులకు సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పాత కాలం తరహాలో చుట్టాలు పెళ్లింటికి రెండు మూడు రోజులు సమయం కేటాయించట్లేదు.

* రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పెళ్లి వేడుకలకు ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. గ్రామాల్లో నివసించేవారు పట్టణాల్లో, పట్టణంలో నివసించేవారు ఖమ్మం నగరంలో, ఖమ్మం నగరంలో నివసించేవారు హైదరాబాద్‌లో వివాహ మహోత్సవాలు నిర్వహించటం ట్రెండుగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని