సైబర్‌ నేరగాళ్ల 2000 ఎత్తులు

సైబర్‌ నేరగాళ్లు ఎంత అప్‌డేట్‌గా ఉంటున్నారంటే మొన్న క్రిప్టో కరెన్సీ.. నిన్న జాబ్‌ఫ్రాడ్‌.. నేడు రెండువేల నోటు ఏవైనా తమకు అనుకూలంగా మలచుకుంటూ బురిడీ కొట్టిస్తున్నారు.

Updated : 27 May 2023 03:05 IST

మహానగరంలో మాయగాళ్ల ముఠాలు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
ఈనాడు, హైదరాబాద్‌

సైబర్‌ నేరగాళ్లు ఎంత అప్‌డేట్‌గా ఉంటున్నారంటే మొన్న క్రిప్టో కరెన్సీ.. నిన్న జాబ్‌ఫ్రాడ్‌.. నేడు రెండువేల నోటు ఏవైనా తమకు అనుకూలంగా మలచుకుంటూ బురిడీ కొట్టిస్తున్నారు. పెద్దనోటును బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ ఆర్బీఐ ప్రకటనతో బీరువాల్లో మూలుగుతున్న కట్టలపాములు బయటకు వస్తున్నాయి. గుట్టుగా మార్పిడి చేద్దామనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. అదనుకోసం ఎదురుచూస్తున్న మోసగాళ్లు దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. మంగళవారం వీరిచేతిలో మోసపోయిన ఒకరిద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తెలియని వ్యక్తులు/మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మోసపోయినా మాయగాళ్లను గుర్తించినా డయల్‌ 100, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.


వీళ్లు.. మహాముదుర్లు

త నెల మాయగాళ్ల ముఠా రూ.2000నోట్లకు రూ.500 నోట్లు ఇస్తామంటూ వ్యాపారుల నుంచి రూ.1.50కోట్లు కొట్టేసి పారిపోయారు. ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అప్రమత్తమైన ముఠాను అరెస్ట్‌ చేశారు. ఆర్బీఐ ప్రకటనకు ముందే ఇన్ని ఎత్తులు వేసిన ముఠాలు ప్రస్తుతం మరింతగా చెలరేగే అవకాశం ఉందని నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆర్బీఐ, బ్యాంకుల్లో పనిచేసే అధికారులమంటూ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని వివరించారు. బ్యాంకులు, బంగారుదుకాణాలు, విదేశీ కరెన్సీ మార్చే కేంద్రాల వద్ద పాగా వేస్తున్న ముఠాలు అక్కడకు వస్తున్న వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.2000 నోట్లతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నా...పెద్దమొత్తంలో జరిగే లావాదేవీలపై కొందరు వ్యాపారులు 10-20శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పంజాగుట్టలోని ఓ నగల దుకాణంలో ఇటీవల రూ.30లక్షల(రూ.2000నోట్లు)కు రూ.5 లక్షలు కమీషన్‌ ఇవ్వాలంటూ అడిగినట్లు తెలుస్తోంది.


రంగంలోకి హవాలా గ్యాంగ్స్‌

ప్రస్తుతం బంగారు దుకాణాలు.. బ్యాంకులు.. పెట్రోల్‌బంకులు. బీమా కంపెనీలు రూ.2000 నోట్లతో వచ్చేవారికి రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నాయి.  ఖాతాదారులు ఎటువంటి పత్రాలు అందజేయాల్సిన అవసరం లేదని చెబుతున్నా ఆదాయపన్నుశాఖకు తమ వివరాలు తెలుస్తాయనే ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి సందేహాలతో గ్రేటర్‌లో పలువురు రియల్‌ వ్యాపారులు, సినీ, రాజకీయ ప్రముఖులు నల్లధనం మార్పిడి బాధ్యతను తమ అనుచరులకు అప్పగిస్తున్నారు. వారి ద్వారా బంగారం కొనుగోలు చేయించటం, బ్యాంకుల్లో నగదు మార్పించటం చేస్తున్నారు.  దేశ, విదేశాల్లో ఎక్కడ నుంచైనా.. ఎన్ని కోట్లరూపాయలైనా గమ్యానికి చేర్చగల హవాలా గ్యాంగ్స్‌ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. బేగంబజార్‌, సికింద్రాబాద్‌, ఘాన్సీబజార్‌, అబిడ్స్‌, మాదాపూర్‌ల్లోని హవాలా ముఠాలపై పోలీసులు నిఘా ఉంచారు. నకిలీ నోట్ల తయారీ ముఠాలు రూ.2000 నోట్లకు రూ.500 నకిలీ నోట్లను మార్పిడి చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని