రియల్‌గానే అక్రమాలు

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జాగా, ప్రైవేటు స్థలం పక్కపక్కనే ఉన్న ఏరియా అది. సర్కారు భూమి ఖాళీగా ఉంది. దీంతో దానిపై భూ బకాసురుల కన్ను పడింది. బందోబస్తు పట్టా పేరు చెబుతూ ప్రభుత్వ భూమిలో వెంచర్‌ వేసేశారు.

Updated : 27 May 2023 06:27 IST

ప్రభుత్వ స్థలంలో వెంచర్‌ ఏర్పాటుకు రూ.1.50 కోట్ల ఒప్పందం
ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జాగా, ప్రైవేటు స్థలం పక్కపక్కనే ఉన్న ఏరియా అది. సర్కారు భూమి ఖాళీగా ఉంది. దీంతో దానిపై భూ బకాసురుల కన్ను పడింది. బందోబస్తు పట్టా పేరు చెబుతూ ప్రభుత్వ భూమిలో వెంచర్‌ వేసేశారు. ఇందుకు సహకరించిన వారితో రూ.కోటిన్నర ఒప్పందం కుదుర్చుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కొందరు వ్యక్తులు ఈ ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆలస్యంగా అసలు విషయం తెలియడంతో లబోదిబోమంటున్నారు.

అధికారుల అలసత్వం వల్ల జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోతోంది. రికార్డులను పూర్తిస్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకుని భూ క్రయవిక్రయాలకు పాల్పడుతోంది. సర్కారు స్థలాలను చెర పట్టి వెంచర్లు వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని సబ్‌జైలు వెనుక ప్రభుత్వ ఆబాదీ భూములు ఉన్నాయి. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో నేడు అవన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. ఈ ఆబాదీ భూములను ఆనుకుని 147, 145 బందోబస్తు పట్టా భూములున్నాయి. ఈ బందోబస్తు పట్టా సర్వే నంబర్లని చెబుతూ కొందరు వ్యక్తులు ప్రభుత్వ ఆబాదీ భూమిలో గుట్టు చప్పుడు కాకుండా వెంచర్‌ వేసి, ప్లాట్లు విక్రయించేశారు. తెర వెనుక ఈ తతంగానికి రూ.కోటిన్నర చేతులు మారినట్లుగా సమాచారం. అసలు విషయం బయటపడడంతో ప్లాటు కొనుగోలు సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు.

ఇంటి దొంగల పనేనా..!

ఆబాదీ భూములను రక్షించాల్సిన పంచాయతీ అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నారు. జిల్లాలో వందలాది ఎకరాల ఆబాదీ భూములు క్రమంగా అన్యాక్రాంతమవుతూనే ఉన్నాయి. జిల్లా ఆవిర్భావానికి ముందే ఇవి పూర్తిగా చేతులు మారాయి. సమగ్రమైన రికార్డులు ఏవీ లేవని పంచాయతీ, రెవెన్యూ అధికారులు అంటున్నారు. వీటికి కావాలనే ఇంటి దొంగలు మాయం చేశారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కనీసం ఖాళీగా ఉన్న సర్కారు భూములను రక్షించడంలో సైతం సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం ఉపాధిహామీ పీడీకే జిల్లా పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంటే జిల్లాకు డీపీఓనే లేకుండా పోవడంతో అక్రమాలు తారస్థాయికి చేరుతున్నాయి.

చిత్రంలో సర్వే నంబర్‌ 145కి ముందు భాగంలో ఉన్నవన్నీ ఆబాదీ భూములే. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే వెంచరు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని జన్కాపూర్‌ శివారు ప్రాంతంలో సబ్‌జైల్‌ వెనుక ప్రాంతంలో ఆబాదీ భూములున్నాయి. ఇందులో ఇప్పటికే అనేక మంది పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. దీనికి కొద్ది దూరంలో నాలుగు వరుసల రహదారి ఉంటుంది. ఈ నేపథ్యంలో బందోబస్తు పట్టా అని చెబుతూ.. ఆబాదీ భూమిలో వెంచర్‌ వేశారు. జిల్లా కేంద్రంలోనే ఇంత ఘోరం జరుగుతున్నా.. అధికారులు కనీసం స్పందించడం లేదు.

ప్రభుత్వ స్థలంలో వేసిన వెంచరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు