గుట్టల్లో.. భూ పందేరం!

ప్రభుత్వ శివాయిజామా భూముల్లో సాగు చేస్తున్న రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆదేశాలు పక్కదోవ పడుతున్నాయి.

Updated : 28 May 2023 05:24 IST

సాగు చేస్తున్నట్లు అడ్డగోలుగా ధ్రువీకరణ పత్రాలు

గంగినేపల్లి సమీపంలో అనుభవ పత్రాలు ఇచ్చేందుకు గుర్తించిన గుట్ట

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ శివాయిజామా భూముల్లో సాగు చేస్తున్న రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆదేశాలు పక్కదోవ పడుతున్నాయి. కొన్నేళ్ల నుంచి సాగులో ఉన్న రైతులను గుర్తించి వారికి ఆ భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు మంజూరు చేసే విధంగా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఈ నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది అధికార పార్టీ నాయకులు ఆక్రమణలకు తెరలేపారు. వారి అనుయాయులకు భూములు కబెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. కొండ, గుట్టలను చదును చేయడం, వాటిని ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నట్లు అధికారులకు తెలపడం, భూ హక్కు పత్రాలు పొందటం చకచకా జరిగిపోతున్నాయి. సాగులో లేనప్పటికీ అధికార అండతో స్థానిక నేతలు మండల, సచివాలయ సర్వేయర్లను ఒత్తిడికి గురిచేసి అనుభవ పత్రాలు మంజూరు చేయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. తెదేపా, ఇతర పార్టీలకు చెందిన, సానుభూతిపరులు కొన్నేళ్ల నుంచి భూమిపై సాగులో ఉన్నప్పటికీ వారికి అనుభవ పత్రాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల దశాబ్దాలుగా అనుభవంలో ఉన్న రైతులకు తెలియకుండా నాయకుల అనుచరులే అధికారుల ద్వారా అనుభవ పత్రాలు పొందుతున్నట్లు సమాచారం. రాజకీయ ఒత్తిళ్లతో కొందరు, కాసులకు కక్కుర్తిపడి మరికొంత మంది సర్వేయర్లు ఇలా వ్యవహిస్తున్నారనే అపవాదు ఉంది.

వందలకొద్దీ పత్రాలు

* భూమికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, రైతుల వివరాలతో కూడిన దస్త్రాలను మండల తహసీల్దార్‌కు అందిస్తే పరిశీలించి  పట్టాకోసం సిఫార్సు చేస్తారు. వైకాపా శ్రేణులు కొండగుట్టలను సైతం చదును చేస్తూ సాగు పట్టాలు పొందేందుకు ఉద్రిక్తులయ్యారు. వారికి సర్వేయర్లు సహకారం అందిస్తూ హక్కు పత్రాలు అందిస్తున్నారు.

* చెన్నేకొత్తపల్లి మండల వ్యాప్తంగా 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 509 మంది రైతులు 909.29 ఎకరాల్లో సాగులో ఉన్నట్లు ఇప్పటికే మండల రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు దస్త్రాలు పంపించారు. ఆ సర్వే నంబర్లకు సంబంధించిన భూఅనుభవ పత్రాలను సంబంధిత సర్వేయర్లు సిద్ధం చేసినట్లు సమాచారం.

* మండలంలోని వెల్దుర్తి, గంగినేపల్లి సమీపం 182, 24 సర్వే నంబర్లలో గుట్టల్లో  160.18 ఎకరాలకు పైగా పట్టాల పంపిణీకి సాగు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.  ఓబుళంపల్లి సమీపంలోని ఓ కొండలో దాదాపు వంద అనుభవ పత్రాలు ఇచ్చే యోచనలో సర్వేయర్‌ ఉన్నట్లు సమాచారం.

నిబంధనలు పట్టవా?

* నిబంధనల ప్రకారం.. సాగు పత్రం పొందే రైతు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు. ఆ రైతు పేరు మీద, తల్లిదండ్రుల పేరుపై ఎలాంటి భూములు కల్గి ఉండకూడదు. స్థానిక ఎమ్మెల్యే భూ పంపిణీ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కమిటీలో సభ్యులుగా ఉండాలి. అయితే ఈ కమిటీలో ఇతర పార్టీల వారికి ప్రాతినిథ్యం కల్పించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఒక్క ముష్ఠి కోవెల రెవెన్యూ గ్రామంలో 223 మంది రైతులు 474.82 ఎకరాలకు విస్తీర్ణానికి సంబంధించి సాగు పట్టాల పంపిణీ కోసం అనుభవ పత్రాలు పొందారంటే పంపిణీ వ్యవహరం తీరు అర్థం చేసుకోవచ్చు. గంగినేపల్లి రెవెన్యూ పరిధిలో సైతం 82 మంది లబ్ధిదారులకు 160.18 ఎకరాలు అందించేందుకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపారు.

అనర్హులను తొలగిస్తాం: సుబ్బలక్ష్మి, తహసీల్దార్‌

సాగు పట్టాల పంపిణీ కోసం ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపిణీ దరఖాస్తులలో ఏవైనా అనర్హత ఉంటే విచారిస్తాం. అర్హతలేని దరఖాస్తులను జాబితా నుంచి తొలగిస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని