వ్యాపార అనుమతుల్లో అక్రమాలు

జిల్లా కేంద్రంలో నూతన వ్యాపార విధానం అమలులో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి.

Updated : 29 May 2023 04:46 IST

బల్దియా ఆదాయానికి గండి కొట్టేలా ట్రేడ్‌ లైసెన్సుల జారీ

పట్టణంలోని సినిమా రోడ్డు వెడల్పు ప్రకారం మల్టీపుల్‌ లేన్‌ కిందకు వస్తుంది. ఈ రోడ్డులో ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌కు నిబంధనల ప్రకారం కొలతలు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ట్రేడ్‌ ఫీజు రూ.90 వేలు వచ్చే అవకాశముంది. అయితే దాన్ని సింగిల్‌ లేన్‌లో ఉన్నట్లుగా మార్చేసి రూ.54 వేలు మాత్రమే వసూలు చేసి లైసెన్సు ఇచ్చేశారు. దీంతో బల్దియాకు దాదాపు రూ.36 వేల నష్టం వచ్చింది. దాని పక్కనే ఉన్న మరో షాపింగ్‌ మాల్‌ను మల్టీపుల్‌ లేన్‌ కింద నమోదు చేయడం గమనార్హం.


న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలో నూతన వ్యాపార విధానం అమలులో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. పట్టణ రహదారుల వెడల్పును పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఇష్టానుసారంగా ట్రేడ్‌ లైసెన్సులు జారీ చేశారు. కొందరు వ్యాపారులపై మమకారం చూపుతూ తక్కువ ఫీజులు నిర్ణయించారు. జీఓ ఎంఎస్‌ నెం.147లో పేర్కొన్న రోడ్డు లేన్లకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చేశారు. దీంతో బల్దియాకు ట్రేడ్‌ ఫీజుల రూపంలో భారీగా రావాల్సిన ఆదాయానికి గండికొట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం బల్దియా ఆదాయ వనరులను పెంచుకునేందుకు కొత్త ట్రేడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. బల్దియాలో గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి మ్యానువల్‌ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రోడ్డు 20 అడుగుల లోపు ఉంటే సింగిల్‌ లేన్‌గా, 30 అడుగుల లోపు డబుల్‌ లేన్‌గా, 30 అడుగుల కన్నా వెడల్పు ఉంటే మల్టీపుల్‌ లేన్‌గా విభజించారు. సింగిల్‌ లేన్‌లో సాధారణ దుకాణాల కొలతలు తీసుకుని స్క్వేర్‌ఫీట్‌కు రూ.3 చొప్పున ట్రేడ్‌ ఫీజు విధించాలి. అదే డబుల్‌ లేన్‌లో రూ.4 చొప్పున, మల్టీపుల్‌ లేన్‌లో రూ.5 చొప్పున, స్టార్‌ హోటళ్లు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు స్క్వేర్‌ఫీట్‌కు రూ.6 చొప్పున ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి సిబ్బంది కొలతలు తీసుకుని వస్తే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, బల్దియా కమిషనర్‌ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ట్రేడ్‌ లైసెన్సు జారీ చేయాలి.

అవకతవకలు జరిగాయి ఇలా

పట్టణంలో 30 అడుగుల కంటే వెడల్పున్న రహదారికి ఇరువైపులా వెలిసిన దుకాణాలన్నింటిని మల్టీలేన్‌ కింద పరిగణించి ఆ దుకాణాలకు స్క్వేర్‌ ఫీట్‌కు రూ.5 చొప్పున వసూలు చేయాలి. ఉదాహరణకు ఓ షాపు విస్తీర్ణం 2 వేల స్క్వేర్‌ ఫీట్లు ఉంటే రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే దుకాణం రెండో అంతస్తు కలిగి ఉంటే దాని విస్తీర్ణాన్ని కూడా లెక్కించి రెట్టింపు ఫీజు వసూలు చేయాలి. గతంలో ఎక్కడ వ్యాపారం చేసినా యజమానులు రూ.500 నుంచి రూ.3,000 లోపే ఉన్న ఫీజులు కట్టేవారు. కొత్త విధానంలో అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో అధికారులు కొందరు వ్యాపారులకు అనుకూలంగా లేన్లను మార్చారు. మల్టీలేన్‌లోని దుకాణాలను సింగిల్‌ లేన్‌లో ఉన్నట్లుగా నమోదు చేసి స్క్వేర్‌ ఫీట్‌కు రూ.5కు బదులు రూ.3 చొప్పున ఫీజు విధించారు. దీంతో దుకాణానికి వాస్తవ ఫీజు రూ.10 వేలు ఉంటే రూ.6 వేలే తీసుకుని ట్రేడ్‌ లైసెన్సు జారీ చేశారు. ఇలా పట్టణంలో వ్యాపారులు కోరినట్లుగా జోన్లను మార్చేసి బల్దియాకు ఆదాయం రాకుండా చేశారు.


గాంధీచౌక్‌ సమీపంలో ఉన్న రెండు విత్తనాలు, ఎరువుల దుకాణాలు డేంజరస్‌ అండ్‌ అఫెన్సివ్‌ ట్రేడ్‌ కేటగిరీలోకి వస్తాయి. వీటి పక్కనున్న దుకాణాలను మల్టీలేన్‌గా గుర్తించిన బల్దియా అధికారులు ఆ రెండింటిని సింగిల్‌లేన్‌లో ఉన్నట్లు నమోదు చేశారు. దీంతో అతి తక్కువ ఫీజులు తీసుకుని లైసెన్సులు జారీ చేశారు.


వ్యాపారుల నుంచి ఫిర్యాదులొచ్చాయి

- ఎ.శైలజ, కమిషనర్‌, బల్దియా

పట్టణంలోని అంబేడ్కర్‌చౌక్‌ చుట్టుపక్కల ప్రాంతంలో డివైడర్ల నిర్మాణంతో రహదారుల ఇరుకుగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను మల్టీలేన్‌ కింద గుర్తిస్తే ట్రేడ్‌ ఫీజులు భారీగా పెరిగిపోయాయి. వ్యాపారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కొందరు గొడవ చేశారు. కొన్ని షాపులను సింగిల్‌ లేన్‌లోనే నమోదు చేసి లైసెన్సులు ఇచ్చాం. కొందరు మల్టీలేన్‌ కింద ఫీజులు చెల్లించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ లేన్‌గా గుర్తించాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పాత జాతీయ రహదారి పక్కనున్న షాపులు మల్టీ లేన్‌ కిందకే వస్తాయి. డబుల్‌ లేన్‌లో గుర్తించిన విషయం మా దృష్టికి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని