ఆయకట్టుకు నీరు వెళ్లేదెలా?

మెట ప్రాంతానికి సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజీలో భాగంగా మల్కపేట రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టింది.

Updated : 05 Jun 2023 06:33 IST

కాలువల నిర్మాణంలో వీడని నిర్లక్ష్యం

మల్కపేట రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీరు

న్యూస్‌టుడే, కోనరావుపేట : మెట ప్రాంతానికి సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 9వ ప్యాకేజీలో భాగంగా మల్కపేట రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టింది. ఈ పనులు పూర్తి కావడంతో వారం రోజుల క్రితం వెట్‌రన్‌ కూడా నిర్వహించారు. దీంతో మధ్యమానేరు నుంచి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయడానికి మార్గం సుగమమైంది. అయితే సాగునీటి సరఫరాకు కుడి, ఎడమ కాలువలను నిర్మించాల్సి ఉన్నప్పటికీ నేటికీ పూర్తి కాలేదు. కుడి కాలువ పనులు అసంపూర్తిగా ఉండగా, ఎడమ కాలువకు ఇంకా భూసేకరణ చేపట్టలేదు. దీంతో జలాశయం నిండా నీరున్నా ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 9వ ప్యాకేజీలో జిల్లాలోని కోనరావుపేట మండలం మల్కపేట వద్ద మూడు టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. ఇందులోకి మధ్యమానేరు నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సొరంగం, సర్జిపూల్‌ నిర్మించారు. విద్యుత్తు మోటార్ల ద్వారా రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి ట్రయల్‌ రన్‌ (వెట్‌రన్‌)ను విజయవంతంగా నిర్వహించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. జలాశయం నుంచి ఆయకట్టుకు నీరు తరలించడానికి కుడి, ఎడమ కాలువలు నిర్మించాల్సి ఉంది. కుడి కాలువ పొడవు 12.02 కిలో మీటర్లు కాగా 9.5 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. మల్కపేట, కనగర్తి, ధర్మారం, నాగారం, పల్లిమక్త, సుద్దాల శివారు వరకు పూర్తి చేయగా, మారుపాక శివారులో 2.7 కిలో మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. పలు చోట్ల వాహనాలు, రైతుల రాకపోకలకు వీలుగా వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ కాలువ ద్వారా 2,500 ఎకరాల స్థిరీకరణ, 22,500 ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందనున్నది.

* ఎడమ కాలువ పొడవు 5.6 కిలో మీటర్లు. స్థిరీకరణ 1,300 ఎకరాలు కాగా, కొత్త ఆయకట్టు 4,500 ఎకరాలు. కోనరావుపేట, కొండాపూర్‌, వెంకట్రావుపేట, నిమ్మపల్లి గ్రామాలకు ఉపయోగపడుతుంది. ఎడమ కాలువ నిర్మాణానికి భూసేకరణ నేటికీ పూర్తి కాలేదు. దీంతో కాలువ పనులు ప్రారంభం కాలేదు. ఇదే కాలువ ద్వారా రూ.165 కోట్ల వ్యయంతో చేపట్టిన నిమ్మపల్లి చెరువులోకి నీటి తరలింపునకు పంపుహౌజ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. మల్కపేట రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించినప్పటికీ కాలువల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువల నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వర్షాధార పంటలు సాగు చేస్తున్నాం

మాది పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం. భూగర్భ జలాలు ఆశించిన మేర లేక వర్షాధార పంటలు పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసులు తదితర పంటలు సాగు చేస్తున్నాం. సుద్దాల చెరువుకు వంద ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు ద్వారా మా గ్రామానికి నీరు వస్తోంది. మా గ్రామం వరకు భూసేకరణ పూర్తయి రెండేళ్లు అయింది. కాలువ నిర్మాణం చేపట్టలేదు. రిజర్వాయర్‌లోకి నీటిని తరలించినా కాలువ లేకపోవడం వల్ల సాగునీరు అందని పరిస్థితి. అధికారులు, పాలకులు దృష్టి సారించి కాలువ నిర్మాణం పూర్తి చేసి చివర ఆయకట్టుకు సాగు నీరు అందిస్తే వరి, ఇతర పంటలు సాగు చేసుకోవడానికి వీలుంటుంది.

వెలిశాల రాజిరెడ్డి, రైతు, మంగళ్లపల్లి

ఇంకా భూసేకరణ కాలేదు

రిజర్వాయర్‌లోకి నీటిని తరలించటంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాం. ఈఎన్‌సీ, ఇంజినీర్లు, గుత్తేదారుల సమష్టి కృషితో ట్రయల్‌ రన్‌ విజయవంతం కావటం సంతోషంగా ఉంది. కుడి కాలువపై అక్కడక్కడ చిన్నపాటి వంతెనలు నిర్మించాల్సి ఉండటంతో గుత్తేదారుకు ఆదేశాలు జారీ చేశాం. ఎడమ కాలువ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ అక్కడక్కడ జరిగింది. ఇంకా పూర్తిగా చేపట్టలేదు. దీంతో నిర్మాణం చేపట్టలేదు. భూసేకరణ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ, భూసేకరణ అధికారులను కోరాం. త్వరలోనే ప్రక్రియ పూర్తి చేసి అందజేస్తామన్నారు. వారు అప్పగించిన వెంటనే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

జి.శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, ప్యాకేజీ-9

మల్కపేట పల్లిమక్త శివారులో అసంపూర్తిగా నిలిచిన రెండో కాలువ పనులు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని