సోమశిల భద్రమేనా!

ఈ చిత్రం సోమశిల జలాశయం ఆప్రాన్‌. వరదలకు దెబ్బతినగా కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌ తొలగించారు. కాంక్రీట్‌తో నింపి పైన స్లాబు వేయాల్సిన ప్రాంతమిది. ఈ పనులు ప్రారంభించారు..

Updated : 07 Jun 2023 05:50 IST

ఈ చిత్రం సోమశిల జలాశయం ఆప్రాన్‌. వరదలకు దెబ్బతినగా కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌ తొలగించారు. కాంక్రీట్‌తో నింపి పైన స్లాబు వేయాల్సిన ప్రాంతమిది. ఈ పనులు ప్రారంభించారు.. రూ. 22 కోట్లకు పైగా చేశారు.  బిల్లులు రాలేదు. అంతే గుత్తేదారు నిలిపేశారు. చేసిన పనులన్నీ వృథా అవుతున్నాయి. రాతిపొరలు ఇలా కనిపిస్తున్నాయి.

ఇది కోతకు గురైన ప్రాంతం. ఇక్కడ సోమశిల ప్రాజెక్టు కాలనీ రక్షణకు నిర్మించిన వరద కట్ట ఉండేది. ఇది పూర్తిగా కొట్టుకుపోవడమే కాకుండా పెన్నా నది గట్టు కూడా కోతకు గురైంది. 2020లో వచ్చిన ప్రవాహానికి సగం దెబ్బతినగా 2021 వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయింది. ఒకానొక దశలో ప్రాజెక్టు కార్యాలయ భవనాలు కోతకు గురైతే గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేశారు  

ఆత్మకూరు, న్యూస్‌టుడే : 2020, 2021 సంవత్సరాల్లో వరద నష్టాలు జిల్లాను వణికించిన తీరు ప్రజలు ఇంకా మరువలేదు. వీటిని పరిశీలించేందుకు వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమశిల, ఇతర వరద రక్షణ పనులకు రూ. 120 కోట్లు ఇస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఈమేరకు పనులు జరగలేదు. ప్రవాహం వస్తే తట్టుకొనే శక్తి లేదు. దీంతో ఈసారి భారీ స్థాయిలో వరదలు వస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సమయం గడిచిపోతున్నా..

సీడబ్ల్యూసీ నిపుణుల కమిటీ సూచనల మేరకు పనులు చేపట్టారు. రూ. 22 కోట్లకు చేసినా బిల్లులు రాక గుత్తేదారు ఆపేశారు. సాధారణంగా రక్షణ కట్టడాల పనులు జనవరి నుంచి ఆగస్టు వరకు చేపట్టేందుకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బిల్లులు రాక ఈ ఏడాది విలువైన కాలం వృథా అయింది. కీలకమైన  కాలం  వృథాగా మారింది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో జలాశయానికి ఎప్పుడైనా భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో రక్షణ కట్టడాల సమస్యలు అలాగే ఉన్నాయి. ఈసారి పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.  

వరదల సమయంలో...

జలాశయంలో ప్రస్తుతం 38 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నైరుతి రుతుపవనాల సమయంలో జలాశయంలోకి వరద నీటి రాక మొదలవుతుంది. రక్షణ కట్టడాలు శిథిలమయ్యాయి. వీటికి ప్రభుత్వం మరమ్మతులు చేయాల్సి ఉంది. బిల్లులు చెల్లించి పనులు వేగంగా పూర్తయ్యేలా చేయాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. సీఎం ప్రకటించిన రూ. 120 కోట్లు ఒట్టి మాటలేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల విషయంలో ఇలాగే నిర్లక్ష్యం ప్రదర్శించి వరదలకు భారీ నష్టాలకు కారణమైంది. భారీ వరదలు వస్తే సోమశిల పరిస్థితి ఏ దిశకు దారి తీస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.  

త్వరలో మొదలయ్యే అవకాశం

ప్రాజెక్టును కలెక్టర్‌ ఇటీవల పరిశీలించారు. బిల్లులు త్వరలో వస్తాయని చెబుతున్నారు. అవి వస్తే పనులు మొదలయ్యే అవకాశం ఉంది. కలెక్టర్‌ ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది.

బొమ్మిరెడ్డి దశరథరామిరెడ్డి, ఈఈ, సోమశిల జలాశయం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని