అదనంగా 6 రకాలుగా బాదుడు

విశాఖ వంటి నగరంలో విలువలు పెంచిన ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండనుంది. కొన్నింటి మీద వెంటనే ప్రభావం చూపగా ఆస్తి పన్ను మీద వచ్చే ఏడాది నాటికి ప్రభావం కనిపిస్తుంది.

Updated : 07 Jun 2023 05:38 IST

భూముల విలువ పెంపుతో భారీ భారం

ఇప్పటికే కుదేలైన స్థిరాస్తి రంగం

ఈనాడు, విశాఖపట్నం

రాష్ట్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచేలా వ్యవహరిస్తోంది.ఇప్పటికే అనేక రకాల పన్నుల భారంతో సతమతమవుతున్న ప్రజలకు తాజాగా పెంచిన భూముల విలువతో మరింత భారం పడనుంది. తద్వారా జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధిలో అదనంగా ఆరు రకాల రుసుములు పెరగనున్నాయి.

విశాఖ వంటి నగరంలో విలువలు పెంచిన ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండనుంది. కొన్నింటి మీద వెంటనే ప్రభావం చూపగా ఆస్తి పన్ను మీద వచ్చే ఏడాది నాటికి ప్రభావం కనిపిస్తుంది. జూన్‌ ఒకటి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భూముల మార్కెట్‌ విలువ ఆధారంగా కొన్ని రుసుములతో పాటు పన్నులు పెరగడంతో కొత్తగా భవన నిర్మాణాలు చేపట్టే వారికి నగర పరిధిలో అదనపు ఖర్చు తప్పదు. ఇది స్థిరాస్తి రంగాన్ని కుదేలు చేస్తుందని నెరెడ్కో, క్రెడాయ్‌ వంటి సంస్థలు వినతులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ప్రభావం చూపేవి..

అదనంగా పన్నులు పెరగనున్న జాబితాలో నాలా, ఖాళీస్థలం (వీఎల్‌టీ), ఓపెన్‌స్పేస్‌, లేబర్‌సెస్సు, ఇంపాక్ట్‌ ఫీజు, ఇంటి పన్ను ఉన్నాయి. పెంపు ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కో రకంగా పడుతుంది. ఆస్తుల విలువ భారీగా పెరిగిన చోట చెల్లించాల్సిన పన్నులు అంతే మొత్తంలో ఉండనున్నాయి. ఈ భారం ఎక్కువగానే ఉంటుందని అంచనా. స్థిరాస్తి రంగం మీద ఈ ప్రభావం కొంత వరకు పడొచ్చని ఆ రంగ నిపుణులు అంటున్నారు.

బాదుడు ఇలా..: నగర పరిధిలో ఎవరైనా విలువలు పెంచిన ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ముందుగా ఆ స్థలానికి ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం 5% నాలా, ఖాళీ స్థలం పన్ను 0.50%, ఓపెన్‌ స్పేస్‌ పన్ను 14%, 150 అడుగుల రోడ్లు ఉన్న చోట ఇళ్లు నిర్మిస్తే ఇంపాక్ట్‌ ఫీజు 2%, 1% శాతం లేబరు సెస్సు చెల్లించాలి.

ఇంటి పన్ను మీద..: ప్రభుత్వం ఇంటి పన్నును భూముల మార్కెట్‌ విలువకు అనుసంధానం చేయడంతో విలువ పెరిగినపుడల్లా ఇంటి పన్ను మీద ఆ ప్రభావం పడుతుంది. తాజాగా ప్రభుత్వం చేపట్టిన స్పెషల్‌ రివిజన్‌లో కొన్ని చోట్ల భూముల విలువతో పాటు ఫ్లాట్ల చదరపు అడుగుల విలువలు అధికంగా పెంచారు. కొన్నిచోట్ల చ.అడుగుకి అదనంగా రూ.5 వేల నుంచి రూ.పది వేలకు చేశారు. విశాఖలోని ఎండాడ ఏరియాలో చ.గజం రూ.25 వేలున్న చోట ఏడాదికి రూ.6 వేలు పన్ను వేస్తే ఇప్పుడు అక్కడ రూ.40 వేలకు పెంచగా అదనంగా మరో వెయ్యి వరకు ఇంటి పన్ను భారం పెరగొచ్చంటున్నారు. సీతంపేట, సీతమ్మధార, అక్కయ్యపాలెం, మాధవధార, మురళీనగర్‌, కప్పరాడ, వన్‌టౌన్‌, మధురవాడ, ఎండాడ, భీమిలి, తగరపువలస, గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లో పెంచడం వల్ల వచ్చే ఏడాది విధించే పన్నులో తప్పక ప్రభావం ఉంటుంది.


స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం..

ప్రత్యేక సవరణ పేరుతో ప్రభుత్వం కొన్నిచోట్ల పెంచిన భూముల విలువ స్థిరాస్తి రంగం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే స్థిరాస్తి వ్యాపారం మందగించింది. క్రయవిక్రయాల జోరు ఆశించినంత జరగడం లేదు. కొవిడ్‌ తరువాత పరిస్థితులు పూర్తిస్థాయిలో మెరుగు పడలేదు. ఈ సమయంలో ధరల పెంపు మరింత దెబ్బతీసేలా ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేవారికి జీవీఎంసీ అనుమతులకు పెట్టుకుంటే ఇప్పుడు గతంలో కన్నా రెండింతలు చెల్లించాలి. నాలా మరికొన్ని ప్రభుత్వ విలువ మీద ఆధారపడడంతో పెరుగుదల కనిపిస్తుంది. చిన్నపాటి నిర్మాణదారులు, మధ్య తరగతులకు ఫీజుల చెల్లింపు కొంత భారమే.

ఎ.రమేష్‌బాబు, అధ్యక్షుడు, నెరెడ్కో ఉత్తర జోన్‌


ఎండాడ ఏరియాలో 500 గజాల స్థలంలో ఇళ్లు నిర్మిస్తే చెల్లించే రుసుములపై అదనంగా పడే భారం ఇలా ఉంటుంది.

గతంలో ఇక్కడ చ.గజం రూ.20 వేలు ఉంటే ఇప్పుడు చ.గజం రూ.40 వేలకు పెంచడంతో అదనపు భారం ఇలా..


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని