కాగితాల్లో పనులు... జేబుల్లో బిల్లులు!

ఈ బందరు కాలువే కాదు.. గత ఏడాది దాదాపు రూ.50కోట్లతో ఓఅండ్‌ఎం పనులు మంజూరు చేశారు. ఇంకా పలుచోట్ల పనులు పూర్తి కాలేదు

Updated : 07 Jun 2023 06:05 IST

నిర్వహణ పనులు చేపట్టకుండానే ఎంబీలు

సాగు నీటి విడుదలతో కొట్టుకుపోనున్న అవినీతి

ఈ చిత్రాన్ని పరిశీలించారా..? ఇది బందరు సాగు నీటి కాలువ. నిర్వహణ పనులు చేసినట్లు కనిపిస్తోందా..? గతేడాది రూ.7.5 కోట్లతో  కాలువ నిర్వహణ పనులు చేశారు. పూడిక మట్టి పెద్దఎత్తున తీశారు. లెక్కలు పూర్తయ్యాయి. బిల్లులు చేశారు. దీనిలో అవినీతి జరిగిందని విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. పూడిక మట్టి పేరుతో రూ.కోట్లు స్వాహా చేశారని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడేప్రసాద్‌ అధికార వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి సెల్ఫీ సవాల్‌ చేశారు. ఇవన్నీ ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఒక ఏడాది గడిచింది. ఇప్పుడు తాజాగా సాగు నీరు విడుదల చేయనున్నారు.

ఈ బందరు కాలువే కాదు.. గత ఏడాది దాదాపు రూ.50కోట్లతో ఓఅండ్‌ఎం పనులు మంజూరు చేశారు. ఇంకా పలుచోట్ల పనులు పూర్తి కాలేదు. వీటిపై ఉయ్యూరు ఆర్డీఓ విచారణ జరిపి ఇంకా పనులే ప్రారంభించలేదని గత ఫిబ్రవరిలో నివేదిక అందించారు. త్వరలో ప్రారంభిస్తారని అంచనా వేశారు. కానీ ఆరు నెలలు గడువు పూర్తయి మరో ఆరు నెలలు గడిచాయి. పలుచోట్ల ఓ అండ్‌ ఎం (ఆపరేషన్‌ మరియు నిర్వహణ) పనులు పూర్తి కాలేదు. మరోవైపు బిల్లులు చేస్తున్నారు. ఇంకోవైపు నీరు విడుదల చేస్తున్నారు. అంతే సాగు నీరు విడుదలతో ఆ ప్రవాహంలో ‘అవినీతి’ కొట్టుకుపోనుంది. బిల్లులు గుత్తేదారుల జేబుల్లోకి వెళ్లనున్నాయి. కమీషన్లు అధికారుల బల్లకిందకు చేరనున్నాయి. ఒకవైపు బిల్లులు రాలేదంటూనే ఎక్సెస్‌ ధరలకు పనులు దక్కించుకున్న గుత్తేదారులు పనులు చేయకుండా బిల్లుల కోసం ప్రయత్నాలు చేయడం గమనార్హం. మంగళవారం జరిగిన రెండు జిల్లాల (ఎన్టీఆర్‌, కృష్ణా) సాగు నీటి సలహా మండలి సమావేశంలో బుధవారం నాడు ప్రకాశం బ్యారేజీ నుంచి సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌ రెండు కాలువలకు నీరు విడుదల చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీల వరకు నీరు ఉందని, ఖరీఫ్‌  ముందస్తు సాగు చేసేందుకు నీటి విడుదలకు తీర్మానించారు. ముందుగా కాలువలకు నీరు విడుదల చేసి చెరువులు నింపితే.. వరి నార్లు పోసేందుకు వీలు ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో పూడిక పనులు చేయకుండా చేసినట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోతాయి.

రెండు మూడు సార్లు టెండర్లను రద్దు చేసి ప్రజాప్రతినిధుల సూచన మేరకు ప్యాకేజీలుగా పిలిచారు. అప్పటికే డ్రైనేజి విభాగంలో కొన్ని విడివిడిగా పనులకు టెండర్లను ఖరారు చేశారు. చాలా వరకు పనులను అతికించి ఐదు ప్యాకేజీలుగా టెండర్లను పిలిచారు. వీటిని బడా గుత్తేదారులు దక్కించుకున్నారు. విడివిడిగా పిలిచిన టెండర్లలో 30 శాతం వరకు తక్కువ ధరకు టెండర్లను గుత్తేదారులు దక్కించుకున్నారు. ప్యాకేజీలు మాత్రం 3, 4శాతం అధిక ధరలకు టెండర్లను దక్కించుకున్నారు. మే నెలలో పిలవాల్సిన టెండర్లను జులైలో పిలిచారు. నిర్వహణ పనులు సాధారణంగా రూ.10లక్షల నుంచి రూ.50లక్షల లోపు ఉంటాయి. గుడివాడ డ్రైనేజీ విభాగంలో పిలిచిన 93 పనులకు మొదట టెండర్లను పిలిచి మళ్లీ రద్దు చేయడం గమనార్హం. వీటిలో కొన్ని చిన్న గుత్తేదారులకు, కొన్ని ప్యాకేజీలుగా మార్చి అప్పగించారు. ఈ విభాగం పరిధిలో బందరు, గుడివాడ, కైకలూరు, చల్లపల్లి స్పెషల్‌ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. అన్నీ పూడిక తీత, తూటికాడ తొలగింపు పనులే. ఈ పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. కేఈ డివిజను పరిధిలో రైవస్‌ కాలువ, ఏలూరు కాలువ ఉంది. రూ.79 పనులకు రూ.10 కోట్లతో టెండర్లను పలిచారు. ఒక్క కేసీ డివిజనులో బందరు సబ్‌ డివిజన్‌ పరిధిలో మొత్తం 67 పనులను మంజూరు చేశారు. ఒక పనిని మాత్రం విడిగా రూ.25.75లక్షలతో అంచనా వ్యయానికి విడిగా అప్పగించారు. మిగిలిన 66 పనులను రూ.1.51కోట్లు, రూ.2.85కోట్లు, రూ.3.87కోట్లు చొప్పున ప్యాకేజీలుగా మార్చి అప్పగించారు. కొన్ని కాలువల్లో తూటికాడ తొలగింపు మాత్రమే చేశారు. మట్టి పనులు, కాంక్రీట్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గుడివాడ డ్రైనేజీ డివిజన్‌ పరిధిలో ఏనుగులచోడు మేజర్‌ డ్రెయిన్‌ పూడికతీత నిర్వహణ పనులకు (ఓఅండ్‌ఎం) రూ.93లక్షలు మంజూరయ్యాయి. మూడు పనుల కింద అప్పగించినా పూర్తి చేయలేదు. విజయవాడ కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ పరిధిలో 9 పనులు రూ.1.51కోట్ల అంచనాలతో ప్యాకేజీగా టెండర్లను అప్పగించారు.

ఈ ఏడాది రబీకి సాగు నీరు ఇవ్వడం లేదు. ఆ సమయంలో కాలువల నిర్వహణ పనులు చేయాల్సి ఉండగా జాప్యం చేశారు. నీటి పారుదల శాఖ అధికారులు సైతం మౌనంగా ఉన్నారు. కనీసం 50 శాతం కూడా పూర్తి కాలేదని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలుస్తోంది. గతేడాది నిర్వహణ పనులకు ఆలస్యంగా టెండర్లను పిలిచారు.

అసంపూర్తిగానే...

నిర్వహణ పనులకు గతేడాది డిసెంబరుతో గడువు పూర్తయింది. కొన్ని కాంక్రీట్‌, షట్టర్ల మరమ్మతులకు మార్చితో గడువు పూర్తయింది. కానీ చాలా వరకు పనులు చేయకుండానే వదిలేశారు. రూ.50కోట్ల నిర్వహణ పనుల్లో 60 శాతం కూడా సక్రమంగా చేయలేదని, మిగిలిన పనులు మమ అనిపించారని గుత్తేదారులే చెబుతున్నారు. కొంత మంది ఇంజినీర్ల సహకారంతో పనులు చేసినట్లు ఎంబీలు రికార్డు చేశారు. నీటి విడుదలలో వీటి ఆనవాలు లేకుండా పోతోంది. అందుకే గతేడాది కంటే ముందే రోహిణి కార్తెలోనే నీటిని విడుదల చేయాలని నిర్ణయించారని కొంత మంది విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంజినీర్లు కుర్చీలు మారడంతో పాతవారితోనే ఎంబీలు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత జనవరిలోనే ఆరోపణలు వస్తే.. ఉయ్యూరు ఆర్డీవో విచారణ జరిపారు. కనీసం పూడిక తీయని విషయాన్ని ఆయన గుర్తించారు. కానీ తమకు గడువు ఉందని బిల్లులు చేయడం లేదని అధికారులు వివరణ ఇవ్వడంతో విచారణ పూర్తి చేశారు. ప్రస్తుతం కాలువల్లో పూడిక, తూటికాడ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది (2023-24)కి రూ.30కోట్లతో నిర్వహణ పనులు చేపడుతున్నట్లు మంత్రి జోగి రమేష్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు