గ్రానైట్ పరిశ్రమపై సర్కారు బండ!
ఉమ్మడి అనంతలో తాడిపత్రి నియోజకవర్గం గ్రానైట్ పరిశ్రమలకు పెట్టింది పేరు. 300కు పైగా గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు.
యంత్రాలను తుక్కుకు అమ్ముకుంటున్న వైనం
ఉపాధి కోల్పోతున్న వేలాది కూలీ కుటుంబాలు
ఇదీ తాడిపత్రిలో దుస్థితి
మూడు నెలల కిందట మూతపడిన పరిశ్రమ
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్‌టుడే, తాడిపత్రి: ఉమ్మడి అనంతలో తాడిపత్రి నియోజకవర్గం గ్రానైట్ పరిశ్రమలకు పెట్టింది పేరు. 300కు పైగా గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు.. సుమారు 10 వేల మందికి పైగా కూలీలు వాటిపైనే ఆధారపడి జీవించేవారు. కర్నూలు, ఒంగోలు నుంచి ముడి రాయిని తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేసేవారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసేవారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిశ్రమలను నడపలేక చాలా మంది నిర్వాహకులు బండల తయారీని నిలిపివేశారు. కొన్ని యూనిట్లలో కూలీలను తగ్గించి ఆర్డర్లు వచ్చిన సమయంలోనే నడుపుతున్నారు. దీనికి ప్రధాన కారణం వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే. తాడిపత్రిలో 2019కు ముందు కళకళలాడిన పరిశ్రమలకు సర్కారు నిర్ణయాలు శరాఘాతంగా మారాయి. రాయల్టీ పెంపు, విద్యుత్తు ఛార్జీల బాదుడు, ఎండీఎల్‌లు రద్దుతోపాటు సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించడం.. తదితర కారణాలతో 200కు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. మరో వంద వరకు ఉన్నా సక్రమంగా నడపలేని దుస్థితి. కరెంటు బిల్లులు కట్టలేక కొందరు యూనిట్లను మూసేసుకుంటే.. మరికొందరు యంత్రాలను తుక్కుకు అమ్మేసుకుంటున్నారు. ఫలితంగా వేలాది మంది కూలీల కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతోంది.
రవాణా భారం...
ఉమ్మడి అనంతలో ముడిరాయి లభ్యత తక్కువ. కర్నూలు, ఒంగోలులోని క్వారీల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రవాణా భారం తప్పడం లేదు. ఒక్కో లోడుకు రూ.50 వేలు వెచ్చించాల్సి వస్తోందని యజమానులు వాపోతున్నారు. దీనికితోడు ఎండీఎల్ (మినరల్ డీలర్ లైసెన్స్)లను బ్లాక్‌లో పెట్టడంతో ముడిసరుకు దిగుమతి కష్టంగా మారింది. పరిశ్రమ పేరిట బిల్లులు తీసుకుని ముడిసరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రాసెసింగ్ తర్వాత ఫినిషింగ్ బండలను అమ్ముకోవడానికి కష్టంగా మారిందంటున్నారు. స్లాబ్ విధానం అమలుకు ప్రభుత్వం కొన్ని నెలల కిందట జీవో ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోటీ పడలేక..
మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో రాయల్టీ, రవాణా, విద్యుత్తు ఖర్చులు తక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రాసెసింగ్ చేసిన గ్రానైట్ బండలను ఏపీకి దిగుమతి చేసి ఇక్కడి వ్యాపారుల కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. రాజస్థాన్ నుంచి గ్రానైట్‌ను తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ రాయల్టీ, రవాణా, విద్యుత్తు బిల్లు అధికంగా ఉండటంతో తక్కువ ధరకు విక్రయించలేకపోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
రాయల్టీ, విద్యుత్తు ఛార్జీల పెంపుతో..
గత తెదేపా పాలనలో 2019 దాకా మీటరు గ్రానైట్‌కు రూ.2,000 వరకు రాయల్టీ వసూలు చేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2,300కు పెంచారు. కన్సిడరేషన్ రుసుం కింద రాయల్టీలో 50 శాతం అదనంగా చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. మీటరు గ్రానైట్‌కు రూ.1,150 కన్సిడరేషన్ రుసుంతో కలిపి రూ.3,450 వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. గతంతో పోలిస్తే ప్రతి మీటరుకు రూ.1,450 భారం పెరిగింది. ఒక్కో పరిశ్రమపై నెలకు కనీసం రూ.60 వేలు అదనపు భారమైంది. గతంలో విద్యుత్తు ఒక్కో యూనిట్‌కు సగటున రూ.1.30 లక్షలు వచ్చేది. రాష్ట్రప్రభుత్వం ఛార్జీలు పెంచడంతో రూ.1.80 లక్షల వరకు వస్తోందని యజమానులు వాపోతున్నారు. విద్యుత్తు వినియోగించకపోయినా మినిమమ్ ఛార్జీ పేరిట యూనిట్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. నెలలో ఒక రాయిని ప్రాసెసింగ్ చేయకపోయినా విద్యుత్తు బిల్లు కట్టాల్సిందే.
తెలంగాణకు తరలిపోయే ప్రమాదం
రాష్ట్ర ప్రభుత్వం స్లాబ్ విధానం అమలు చేయకుంటే ఇక్కడి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కార్మికులు రోడ్డున పడతారు. ఇప్పటికే కొందరు యంత్రాలను తుక్కుకు అమ్మేసుకుని, భవనాలను ఇతరులకు లీజుకు ఇస్తున్నారు. రాయల్టీ వసూలు ప్రక్రియను ప్రైవేటీకరణ చేయడం తీవ్ర ప్రభావం చూపుతోంది.
జగదీశ్వరరెడ్డి, పరిశ్రమ యజమాని
మరో ఏడాదిలో అన్నీ మూతే..
కర్నూలు, ఒంగోలు నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం 150 కిలోమీటర్లు రవాణా చేయాలి. ఇంధన ధరలు పెరగడంతో అదనపు భారం పడుతోంది. నష్టాలు భరించలేక ఆర్డర్లు వచ్చినప్పుడు మాత్రమే పరిశ్రమ నడుపుతున్నాం. విద్యుత్తు ఛార్జీల్లో రాయితీ కల్పించాలి. లేదంటే ఏడాదిలో ఇక్కడ మిగిలిన పరిశ్రమలు మూతపడతాయి.
బాబునాయుడు, పరిశ్రమ యజమాని
ఎలాంటి ప్రోత్సాహం లేదు
ప్రస్తుతం 30 శాతం కూలీలతోనే పరిశ్రమ నడిపిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. మూడు నెలల వ్యవధిలోనే 70 పరిశ్రమల యజమానులు సామగ్రిని తుక్కుకు అమ్ముకున్నారు. స్లాబ్ విధానంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి.
మహేశ్, పరిశ్రమ లీజుదారు, తాడిపత్రి
పూట గడవటమే కష్టంగా మారింది
గతంలో ఒక్కో పరిశ్రమలో 15 మందికి పైగా కూలీలకు ఉపాధి ఉండేది. ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. రోజూ పని ఉండటం లేదు. పూట గడవటం కష్టంగా మారింది. కొన్నిరోజులు కట్టెలు అమ్మి కుటుంబాన్ని పోషించుకున్నాం. బిహార్ నుంచి వచ్చిన వారంతా వెళ్లిపోయారు. ఆర్డర్లు వచ్చినప్పుడే యజమాని పనికి పిలుస్తున్నారు.
శివయ్య, కూలీ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి