ఆరోగ్యకార్డుల పేరిట అమాయకులకు కుచ్చుటోపీ

కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో మారుమూల ఆదివాసీ, గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకున్నాడు ఓ కేటుగాడు.

Updated : 10 Jun 2023 06:30 IST

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అంటూ అందినకాడికి లూటీ
ఈనాడు, ఆసిఫాబాద్‌

కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో మారుమూల ఆదివాసీ, గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి దండుకున్నాడు ఓ కేటుగాడు. వేలిముద్ర యంత్రంతో ఇంటింటికీ వెళ్లి పింఛను డబ్బులు ఇస్తూనే మోసానికి తెర తీశాడు. వేలిముద్ర సాయంతో బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు కాజేసి పరారయ్యాడు. చివరికి మరో గ్రామంలో సైతం ఇదే విధంగా చేయడంతో కొందరు యువకులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన యువకుడు నాయిని బాపు. నెన్నెల మండల కేంద్రంలో ఆధార్‌కార్డు ద్వారా వేలిముద్ర యంత్రం సాయంతో డబ్బులు ఇచ్చేవాడు. దీంతోపాటు దహెగాం మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీగా విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితమే అతడి దుర్బుద్ధి బయటపడింది. కొందరు వ్యక్తులకు తెలియకుండా వారి ఖాతాల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేయడంతో బాధితులు నిలదీశారు. ఈక్రమంలో మధ్యవర్తులతో రాజీ కుదుర్చుకొని డబ్బులు తిరిగిచ్చాడు. అప్పటి నుంచి గ్రామాల్లోని అమాయకులు, చరవాణి వినియోగించని వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఇప్పటికే రూ.లక్షల్లో కాజేశాడు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బయటకి రానివారు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది.

పని అయ్యే వరకు వచ్చేవాడు..

బాపు ముందుగా తిర్యాణి మండలంలోని ఎదులపాడు, కన్నెపల్లి, సుంగాపూర్‌ గ్రామాలకు వెళ్లాడు. వేలిముద్ర యంత్రంలో ఒక్కరోజుకు కేవలం రూ.పది వేలు మాత్రమే వస్తాయి. దీంతో సదరు నిందితుడు ఈ ప్రాంతంలో నాలుగు రోజుల పాటు తిరిగాడు. వివిధ వ్యాధులకు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తారని, అందుకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు అవసరమని నమ్మించాడు. మారుమూల ప్రాంతాల ప్రజలవద్ద అనేక మందికి మాములు(2జి) చరవాణులే ఉన్నాయి. వీటికి వచ్చే సందేశాలను సైతం వీరు సరిగ్గా చూడకపోవడం, డబ్బులు తీసుకునే సందర్భంలో ఓటీపీ చెప్పడంతో నేరగాడి పని సులువై పోయింది. ఒక్కో రైతు వద్దకు డబ్బులు కాజేయడానికి సదరు వ్యక్తి మూడు, నాలుగు రోజుల పాటు వచ్చిన సందర్భాలున్నాయి.

దొంగ ఇలా దొరికాడు..

తాండూరు మండలం నర్సాపూర్‌లో సైతం 15 మందిని ఇదే విధంగా మోసం చేశాడు. కార్డులు ఇస్తానని చెప్పి వేలిముద్ర సాయంతో డబ్బులు తీసుకున్న విషయం గ్రామస్థులు గ్రహించారు. వెంటనే ఈ వ్యక్తిని పట్టుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పజెప్పారు. తిర్యాణి మండలంలోని బాధితులు రెబ్బెన పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.


రూ.40 వేలు మాయం చేశాడు

పంద్రం సురేష్‌, ఎదులపాడు, తిర్యాణి

పత్తి పంట అమ్మగా వచ్చిన డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉన్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ఇస్తానని నాలుగు రోజుల పాటు ఓ వ్యక్తి వచ్చాడు. వేలిముద్ర పెట్టాను. సరిగా పెట్టలేదని, ఇంకా వివరాలు కావాలని నిత్యం వచ్చేవాడు. కొన్నిరోజులకు బ్యాంకుకు వెళితే విత్తనాలు కొందామని బ్యాంకు ఖాతాలో ఉంచిన రూ.40 వేలు మాయమయ్యాయి.


సందేశాన్ని వెంటనే తొలగించాడు..

-తిరుపతి, కన్నెపల్లి, తిర్యాణి

మా ఇంటికి వచ్చి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ఇస్తానన్నాడు. నా చరవాణి తీసుకున్నాడు. వేలిముద్ర వేయగానే రూ.పది వేలు ఖాతా నుంచి డ్రా అయ్యాయి. సందేశం నా చరవాణికి వచ్చినా., వెంటనే ఆ వ్యక్తి దానిని తొలగించాడు. మూడురోజుల అనంతరం బ్యాంకుకు వెళితే రూ.10 వేలు తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.


ఇలా మోసం..

వేలిముద్ర యంత్రంపై రైతు వేలిని పెట్టగానే బ్యాంకుకు అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ(వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. ఓటీపీ చెప్పగానే ఖాతా నుంచి డబ్బులు మాయం అయ్యేవి. డబ్బులు ఖాతా నుంచి తీసుకున్నారనే వచ్చే సందేశాలను, సదరు వ్యక్తి వెంటనే వారి నుంచి ఫోన్‌లు తీసుకుని తొలగించే(డిలీట్‌)వాడు. దీంతో బ్యాంకుకు వెళ్లి తమ ఖాతాలను సరిచూసుకుంటే తప్ప బాధితులకు డబ్బులు పోయాయనే సంగతే తెలియదు.


విచారణ చేపడుతున్నాం

-నరేందర్‌, సీఐ, రెబ్బెన

తాండూర్‌ మండలం మాదారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వేలిముద్ర యంత్రంలో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశాం. పీటీ వారెంట్ సైతం జారీ చేశాం. నెన్నెల, తాండూరు మండలంలో సైతం ఇలాంటి మోసాలే చేశాడనే ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నాం. బాధితులకు న్యాయం చేస్తాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని