విత్తన మాయగాళ్లొస్తున్నారు..!

మృగశిర కార్తె ప్రారంభమైంది. మరోవైపు దేశాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికీ చేరనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Updated : 10 Jun 2023 06:32 IST

రైతన్నా జర జాగ్రత్త

మదనాపురంలో ఎరువుల, విత్తనాల దుకాణంలో అధికారుల తనిఖీలు

మదనాపురం, న్యూస్‌టుడే: మృగశిర కార్తె ప్రారంభమైంది. మరోవైపు దేశాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికీ చేరనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు ఇప్పటికే ఖరీఫ్‌ పనులు ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రధానంగా సాగుచేసే వరి, పత్తి, మిర్చి విత్తనాల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ వ్యాపారులు రంగంలోకి దిగుతుంటారు. కంపెనీ పేరు, చిరునామా లేకుండా మంచి కంపెనీకి చెందినవంటూ, అధిక దిగుబడి ఇచ్చే రకాలంటూ విక్రయించేస్తుంటారు. వాటిని సాగుచేస్తే తర్వాత విషయం మనకు తెలిసిందే.
తనిఖీలు జరుగుతున్నా..: ఓవైపు టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీలు జరుగుతున్నా నకిలీ విత్తనాల వ్యాపారం సాగిపోతూనే ఉంది. ఇటీవల పట్టుబడుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. నకిలీ విత్తనాలను విక్రయించిన, తయారు చేసిన వారిపై కఠిన చర్యలు ఉండేలా పటిష్టమైన చట్టాన్ని తీసుకరావాలని రైతులు కోరుతున్నారు. ఈ కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను అందుబాటులో తీసుకురావాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో విత్తనాల కొనుగోలు విషయంలో అన్నదాత పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.
టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటు..: జిల్లాలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో పాటు ప్రతి మండలానికి, సబ్‌ డివిజన్‌ పరిధిలోనూ తనిఖీలు నిర్వహించేందుకు బృందాలున్నాయి. మండల పరిధిలో ఎస్సై, మండల వ్యవసాయాధికారి, సబ్‌ డివిజన్‌ పరిధిలో డీఎస్పీ, ఏడీఏ స్థాయి అధికారి, జిల్లా స్థాయిలో ఎస్పీ, జిల్లా వ్యవసాయాధికారి తనిఖీలు చేస్తున్నారు.


వ్యాపారులు ఇవి పాటించాల్సిందే..

*వ్యవసాయశాఖ ఇచ్చిన లైసెన్స్‌ పరిధిలోనే అమ్మకాలు చేపట్టాలి.
*ఏ కంపెనీకి సంబంధించినవి అమ్ముతున్నారో దానికి సంబంధించిన ప్రిన్సిపుల్‌ సర్టిఫికెట్‌ (పీసీ) అందుబాటులో ఉండాలి.
*రోజు వారీగా స్టాక్‌ వివరాలను బోర్డుపై నమోదు చేస్తూ రైతులకు కనిపించేలా దుకాణాల్లో ఏర్పాటు చేయాలి.
* లేబుల్‌ ఉన్నవి మాత్రమే రైతులకు విక్రయించాలి.
* విక్రయించిన విత్తన ప్యాకెట్లు, ఎరువులు, మందులకు తప్పనిసరిగా రైతులకు రసీదు ఇవ్వాలి. అందులో లాట్‌ నంబరు రాసి ఉండాలి.


కొనేముందు ఇవి చూడండి..

* అధీకృత దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయండి.
* విత్తన ప్యాకెట్లు, బస్తాలపై లాట్‌ నంబరు, కంపెనీ పేరు, ప్యాకింగ్‌ తేదీ, లేబుల్‌, తదితర అంశాలను పరిశీలించాలి.
* విత్తన మొలక శాతం సరిగా ఉందో.. లేదో చూసుకోవాలి.
* రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. నష్టపోయినప్పుడు పరిహారం పొందడానికి దీని అవసరం ఉంటుంది.
* విత్తన ప్యాకెట్లు, బస్తాలపై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దానిని మొబైల్‌తో స్కాన్‌ చేస్తే విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.


కఠిన చర్యలు తప్పవు..

గ్రామాల్లో తిరిగే బయటి వ్యాపారుల నుంచి ఎలాంటి విత్తనాలను కొనుగోలు చేయరాదు. వాటిని సాగు చేసి నష్టపోతే ఎలాంటి పరిహారమూ పొందలేరు. లైసెన్స్‌ కలిగిన వ్యాపారుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. తనిఖీలు చేపట్టి రైతులను మోసగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కల్తీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై ఈసీ చట్టం 7, విత్తన చట్టం 19 సెక్షన్‌ కింద నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తాం.

- షేక్‌ మున్నా, మండల వ్యవసాయాధికారి, మదనాపురం

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు