Ambati Rambabu: అంతన్నారు ఇంతన్నారో రాంబాబు...

తూర్పు ప్రకాశానికి జీవనాడి వంటిది గుండ్లకమ్మ జలాశయం. గేట్ల మరమ్మతులు, ఏటా సాధారణ తనిఖీలు, నిర్వహణ వంటి కనీస చర్యలు కూడా లేకపోవడంతో గతేడాది ఆగస్టు 31న జలాశయం మూడో గేటు అడుగుభాగం నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయింది.

Updated : 11 Jun 2023 08:58 IST

10 నెలలైనా పూర్తికాని మరమ్మతులు
వాటా కోసం ఓ ప్రజాప్రతినిధి పట్టు
నిందలే తప్ప నీళ్లు నిలిపే చర్యలేవీ!

గేటు కొట్టుకుపోవడంతో వృథాగా సముద్రం పాలవుతున్న జలాలను పరిశీలిస్తున్న మంత్రి అంబటి రాంబాబు(పాత చిత్రం)

ఈనాడు, ఒంగోలు;- తూర్పు ప్రకాశానికి జీవనాడి వంటిది గుండ్లకమ్మ జలాశయం. గేట్ల మరమ్మతులు, ఏటా సాధారణ తనిఖీలు, నిర్వహణ వంటి కనీస చర్యలు కూడా లేకపోవడంతో గతేడాది ఆగస్టు 31న జలాశయం మూడో గేటు అడుగుభాగం నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత మేల్కొన్న అధికారులు స్టాప్‌లాక్స్‌ అమర్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను జలాశయంలోని నీటి మట్టాన్ని తగ్గించాల్సి ఉంటుందని సాంకేతిక నిపుణులు చెప్పడంతో ఆగమేఘాలపై దిగువకు వదిలారు. ఈ చర్యలతో జలాశయం దాదాపు ఖాళీ అయ్యింది. నాలుగైదు నెలలపాటు మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. రైతులు పంటలు సాగు చేయడాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.

*ఒట్టిపోతున్న నిండుకుండ...: గతేడాది ఆగస్టు నాటికి జలాశయంలో 3.5 టీఎంసీల నీటితో నిండుకుండలా దర్శనమిచ్చింది. అప్పటికీ దాదాపు అయిదు గేట్ల గుండా నీళ్లు లీకేజీ అవుతుండటాన్ని అధికారులు గుర్తించారు. మరమ్మతులకు ప్రతిపాదనలు పంపారు. రూ.80 లక్షలతో 6, 7 గేట్ల మరమ్మతులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. నిధులు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న గుత్తేదారును ఓ ప్రజాప్రతినిధి తనకు పది శాతం వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారనే విమర్శలున్నాయి. దీంతో పనులు ఆలస్యం అయ్యాయి. ఇంతలో మూడో గేటు కూడా కొట్టుకుపోవడంతో జలాశయంలో నీళ్లు తగ్గి ఇప్పుడు ఒట్టిపోయిన కుండలా మారింది.

*భద్రతను విస్మరించి తవ్వకాలు...: జలాశయంలో నీటి నిల్వను పెంచే అవకాశం ఉన్నప్పటికీ 1.7 టీఎంసీలకే పరిమితం చేయడం ఇసుకాసురులకు కలిసొచ్చింది. కట్టడం భద్రతకు ప్రమాదమని నీటి నిల్వ శాతాన్ని తగ్గించిన అధికారులు ఆపై జలాశయంలో ఏకంగా డ్రెజ్జర్‌ను సాయంతో ఇసుక తవ్వకాలకు అనుమతివ్వడం గమనార్హం. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఇసుక వ్యాపారులు జలాశయంలో తవ్వకాలు ఆపలేదు. ఇసుక తవ్వకాల కోసమే నీళ్లు తగ్గించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

31-08-22

నిర్వహణ సక్రమంగా లేకపోవడం.. పర్యవేక్షణ మరిచిన ఫలితంగా మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయానికి సంబంధించిన మూడో గేటు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ప్రాణాధారమైన జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయి.

03-09-22

సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మల్లవరం వచ్చారు. జలాశయాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. గేటు కొట్టుకుపోవడానికి గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పట్టించుకోకపోవడమే కారణమని నిందలు వేశారు. మూడో నెంబర్‌తో పాటు మరో తొమ్మిది గేట్లకు మరమ్మతులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారని చెప్పారు. ఈ పనులు చేసేందుకు గుత్తేదారుడిని కూడా ఖరారు చేశామన్నారు. త్వరలోనే మరమ్మతులు పూర్తిచేసి రబీలో పంటలకు నీళ్లిచ్చేలా, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. అవసరమైతే సాగర్‌ నీటితో జలాశయాన్ని నింపుతామని ప్రకటించారు.

*పేరు: ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం
*నీటి నిల్వ సామర్థ్యం: 3.86 టీఎంసీలు
*ఆయకట్టు: మొత్తం 80 వేల ఎకరాలు
*జీవనం సాగించే మత్స్యకారులు: సుమారు 2 వేల మంది
(దాదాపు వందల సంఖ్యలోని గ్రామాల్లో ఉన్న తాగునీటి పథకాలకు ఇదే ఆధారం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని