నిధులున్నా.. నిర్లక్ష్యం కమ్మేసింది..!

పాలకుల నిర్లక్ష్యం.. కృష్ణాపురం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా పరిణమించింది. దీని ఆధునికీకరణ నిధులు పుష్కలంగా ఉన్నా.. చేస్తున్న పనులకు బిల్లులు కాకపోవడంతో రెండేళ్లుగా పనులు ఆగిపోయాయి.

Updated : 11 Jun 2023 05:39 IST

కలగా కృష్ణాపురం ప్రాజెక్టు ఆధునికీకరణ
ప్రమాద స్థితిలో జలాశయ గేట్లు
న్యూస్‌టుడే, కార్వేటినగరం 
 

దుస్థితిలో కుడి కాలువ

పాలకుల నిర్లక్ష్యం.. కృష్ణాపురం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా పరిణమించింది. దీని ఆధునికీకరణ నిధులు పుష్కలంగా ఉన్నా.. చేస్తున్న పనులకు బిల్లులు కాకపోవడంతో రెండేళ్లుగా పనులు ఆగిపోయాయి. ఆరు వేల ఎకరాల ఆయకట్టులో రెండు వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఏటా వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వస్తున్నా వృథాగా పోతోంది.

కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం జలాశయం ఆధునికీకరణకు 2018లో తెదేపా ప్రభుత్వ సహకారంతో జైకా నిధులు రూ.26 కోట్లు మంజూరయ్యాయి. కొన్నాళ్లు పనులు బాగానే సాగాయి. తర్వాత ప్రభుత్వం మారింది. దీని బాగోగులను పట్టించుకునే వారు కరవయ్యారు.

ప్రధాన గేట్లు పాడవడంతో ప్రమాదకరంగా ఉన్నాయి. గేట్లకు అమర్చిన రబ్బరుస్టాంపు లీకేజీ అవుతోంది. ప్రధాన గేట్లలో రెండు మూడు చోట్ల లీకేజీలు ఉండటంతో వర్షాకాలంలో ప్రాజెక్టులోకి చేరిన వరద వృథాగా నదిలోకి వెళ్తోంది.

భారీ వర్షాలు కురిస్తే..

ప్రాజెక్టు నిండితే ప్రధాన గేట్లను ఎత్తి వరదను కుశస్థలి నదిలోకి విడుదల చేయాలి. ప్రధాన గేట్లు ఎత్తడానికి అవసరమైన జనరేటర్‌ పాడైంది. బ్యాటరీ సక్రమంగా పనిచేయడం లేదు. తొమ్మిదేళ్లుగా గేట్ల మరమ్మతులకు నిధులు మంజూరుకాకపోవడంతో వర్షాకాలంలో గేట్లు ఎత్తడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు వద్ద 14 మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం జలవనరులశాఖ ఏఈ, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే ఉన్నారు.

కాలువలు కబ్జా పాలు

ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పరిధిలో 16 చెరువులు ఉన్నాయి. ప్రాజెక్టు నిండిన వెంటనే వరద నీటిని విడుదల చేసి చెరువులు నింపుతారు. చెరువులకు నీరు సరఫరా చేసే కాలువలు కబ్జాకు గురికావడంతో కొన్నింటికి నీరు చేరడం లేదు. ఈ నేపథ్యంలో రెండు వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది.

జైకా నిధులు ఏవీ?

కృష్ణాపురం ప్రాజెక్టును జైకా బృందం 2017లో పరిశీలించింది. ఆధునికీకరణ పనులకు రూ.26 కోట్లు జైకా నిధులు మంజూరు చేసింది. గుత్తేదారు రూ.13 కోట్ల మేరకు ప్రాజెక్టులో అభివృద్ధి పనులు చేపట్టారు. దీనికి సంబంధించి రూ.7 కోట్లు మాత్రమే బిల్లులు మంజూరయ్యాయి. దీంతో గుత్తేదారు రెండేళ్లుగా పనులను అసంపూర్తిగా వదిలిపెట్టడంతో ఆధునికీకరణ పనులు ఆగాయి.


పాలకులు ఏం చేస్తున్నట్లో?

2020 ఆగస్టులో ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

స్థానిక శాసనసభ్యుడు కళత్తూరు నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. మూడు నాలుగుసార్లు ప్రాజెక్టును పరిశీలించడం మినహా పనుల పురోభివృద్ధి దిశగా ఆయన దృష్టిసారించకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏమన్నారంటే..

ప్రాజెక్టు పరిధిలోని 16 చెరువులను, కుడి, ఎడమ కాలువలను బాగు చేయి స్తాం. కాల్వల భూములు సర్వే చేయించి ఆక్రమణల నుంచి కాపాడి వినియోగంలోకి తెస్తాం.


ప్రాజెక్టు స్వరూపం..

ప్రమాద స్థితిలో ప్రాజెక్టు గేట్లు

* నిర్మాణం: 1975లో..  
* ఆయకట్టు: 6,125 ఎకరాలు
* ఆధునికీకరణకు కేటాయించిన జైకా నిధులు: రూ.26 కోట్లు
* కేటాయింపు: 2018లో..


చర్యలు తీసుకుంటాం

బిల్లులు మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాం. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం.

విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని