ఉద్యోగోన్నతికి అడ్డదారి
కుప్పం మండలానికి చెందిన ఓ వీఆర్వోపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. రైతులకు పాస్ పుస్తకాల దస్త్రాన్ని కదల్చాలంటే ఆయనకు రూ.20వేలు- రూ.30వేలు ముట్టజెప్పాల్సిందే.
నకిలీ డిగ్రీలతో ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు
వీఆర్వోలకు ఓ ఉద్యోగ సంఘం నేత అభయం
పట్టాల నిగ్గు తేల్చాలని ఉన్నతాధికారి ఆదేశం
- కుప్పం మండలానికి చెందిన ఓ వీఆర్వోపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. రైతులకు పాస్ పుస్తకాల దస్త్రాన్ని కదల్చాలంటే ఆయనకు రూ.20వేలు- రూ.30వేలు ముట్టజెప్పాల్సిందే. అర్హులైన వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి కల్పిస్తామని ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు ఇవ్వగా ఈయనా దరఖాస్తు చేశారు. డిగ్రీ విద్యార్హత తప్పనిసరి కావడంతో తమిళనాడులోని ఓ వర్సిటీలో చదివినట్లు ధ్రువపత్రాలు సమర్పించారు. అది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు లేఖ రాయగా ఇప్పటివరకూ సమాధానం రాలేదు.
- చిత్తూరు నగరానికి చెందిన మరో వీఆర్వో ఈశాన్య రాష్ట్రాల్లోని ఓ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ చదివానని ధ్రువపత్రాలు ఇవ్వడంతో రెవెన్యూ వర్గాలే విస్తుబోయాయి.
ఈనాడు, చిత్తూరు: గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషించే వీఆర్వోలకు ఉద్యోగోన్నతులు ఇచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ ఆదేశాలను అడ్డుపెట్టుకుని అదే శాఖకు చెందిన నాయకుడొకరు డబ్బులు వసూలు చేసిన ఉదంతం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కలెక్టరేట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సదరు అధికారి, మరో ఉద్యోగికి ముడుపులు ముట్టాయనే ఆరోపణలు రావడం కలకలాన్ని రేపుతోంది. విద్యార్హతకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన వ్యక్తులనూ అందలం ఎక్కించేందుకు సదరు నేత విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వీఆర్వోలు ఉన్నతాధికారులకు రాసిన లేఖలతో విషయం బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో యంత్రాంగం అక్రమార్కులను పసిగట్టే పనిలో నిమగ్నమైంది. ఉమ్మడి జిల్లాలోని 25 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు ఉద్యోగోన్నతి ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించి 197 మందితో జాబితా రూపొందించగా సొమ్ము చేసుకునేందుకు వీఆర్వోల సంఘం నాయకుడు పావులు కదిపారు. దాదాపు 50 మంది వీఆర్వోల నుంచి ముక్కుపిండి రూ.50వేలు- రూ.లక్ష తీసుకున్నారు. కొంత మొత్తాన్ని కలెక్టరేట్‌లోని ఓ అధికారి, మరో అధికారికి వాటాగా ఇచ్చారు.
సుదూర ప్రాంతాల్లో చదివామంటూ..: కొసమెరుపేమిటంటే సదరు వీఆర్వోల్లో కొందరు డిగ్రీ కూడా చదవలేదు. ఇటువంటి వ్యక్తులు తమిళనాడు, సిక్కిం, తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైనట్టు విద్యార్హత పత్రాలు ఇచ్చారు. తిరుపతి, కుప్పంలో పూర్తి చేశామని మరికొందరు వెల్లడించారు. ఈ సంవత్సరం కూడా అన్యాయం జరుగుతోందని గ్రహించిన వీఆర్వోలు గతనెలలో తమ ఆవేదనను ఉన్నతాధికారులకు తెలియజేయగా కలెక్టరేట్‌లోని అధికారి మాయం చేశారు. ఈ నెలలో మరోమారు బాధిత గ్రామ రెవెన్యూ అధికారులు రాసిన లేఖ అధికారులకు చేరింది. ఓ ఉన్నతాధికారి స్పందించి సీనియర్ అసిస్టెంట్లుగా చేరేందుకు ఆసక్తి చూపిన 186 మంది డిగ్రీలు చేశారా? చేస్తే వారు సమర్పించిన విశ్వవిద్యాలయాల పట్టాలు నిజమైనవేనా? అని నిర్ధారించాలని వర్సిటీ వర్గాలను ఆదేశించగా.. 105 మంది ఉత్తీర్ణత సాధించారనే సమాచారం వచ్చింది. రోజులు గడుస్తున్నా.. మరో 81 మంది వివరాలు మాత్రం అందలేదు. సీనియారిటీ జాబితాలో వీరే ఎక్కువ మంది ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
గతేడాదీ ఇలాగే..
అర్హులైన వీఆర్వో గ్రేడ్- 1లకు సీనియర్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు వీఆర్వోలు డిగ్రీ ఉత్తీర్ణత సాధించడంతో పాటు పదోన్నతి నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయాలని అందులో స్పష్టం చేశారు. వారికి కంప్యూటర్ పరిజ్ఞానం, రెవెన్యూ సాఫ్ట్‌వేర్లపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. ఉద్యోగోన్నతి ఇచ్చేటప్పుడు రోస్టర్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి. ఈ విధానాన్ని పాటించకుండానే గతేడాది మార్చిలో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా 15 మంది వీఆర్వోలను సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ఇందులో కొందరు డిగ్రీలు చదవలేదని అప్పట్లో అభ్యంతరాలు వచ్చాయి. తమకు అన్యాయం జరిగిందని పలువురు వీఆర్వోలు ఉన్నతాధికారులు, కలెక్టరేట్‌లోని అధికారికి విన్నవించగా ఇది పునరావృతం కాదని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
తేలితే ఉన్న ఉద్యోగమూ ఉండదు
వీఆర్వోల విద్యార్హత వివరాలు సరైనవా? కాదా? అని తెలుసుకునేందుకు వర్సిటీలకు లేఖలు రాశాం. కొన్నింటి నుంచి వివరాలు వచ్చాయి. మరికొన్ని రావాల్సి ఉంది. సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు నకిలీ డిగ్రీ సమర్పిస్తే ఉన్న ఉద్యోగమూ ఉండదు.
పి.శ్రీనివాసులు, జేసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య