ఉవ్వెత్తున జన చైతన్యం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షల్ని ఆదివారమూ రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించారు.

Updated : 18 Sep 2023 05:24 IST

 నినదించిన తెలుగుదండు
చంద్రబాబు అరెస్టుపై ఖండన
 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న దీక్షలు

కొమ్మాది: అయిదోవార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల కాగడాల ప్రదర్శన

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షల్ని ఆదివారమూ రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించారు. వీటికి ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. స్వచ్ఛందంగా పాల్గొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ దీక్షల్లో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో నేతలు ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల ఇన్‌ఛార్జులు వినూత్న తరహాలో ప్రభుత్వ తీరును నిరసించారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నేతలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయన చిత్రంతో ఉన్న బ్యానర్‌ను దిష్టిబొమ్మలా తయారు చేసి సైకో పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దగ్ధం చేశారు.

పెందుర్తి బీఆర్టీఎస్‌లో తెదేపా శ్రేణులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న
మాజీ మంత్రి బండారు, నాయకులు

  • పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. నియంత మీద పోరాటానికి మేము సైతం బాబుతో అంటూ వారంతా నినదించారు.
  • చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయనపై పెట్టిన కేసు కొట్టేయాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ సీబీఎన్‌ మిత్ర మండలి ఆధ్వర్యంలో అగనంపూడి నుంచి సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామిని వేడుకునేందుకు కాలిబాటన వెళ్తున్న వారిని మార్గం మధ్యలో దువ్వాడ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎండ మండినా అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
  • చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పిఠాపురం కాలనీలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బొట్టా ప్రసన్న భార్గవి ఆధ్వర్యంలో పలువురు ఐటీ ఉద్యోగులు ‘నేను సైతం బాబు కోసం’ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయినా ఒక్క ఐటీ కంపెనీను తీసుకురాకపోవడంతో నిరుద్యోగ యువత మంచి ఉద్యోగాలకు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చర్చిలో క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించి చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు.
  • అక్రమ కేసు నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడాలని కోరుతూ ఆనందపురానికి చెందిన కుమార్‌ అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
  • అరెస్టును ఖండిస్తూ గాజువాక 72వ వార్డులో నల్లబ్యానరుతో పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు.
  • ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో గోపాలపట్నంలో వైకాపా ప్రభుత్వ తీరును నిరసిస్తూ అరగుండలతో తెదేపా నాయకులు నిరసన తెలిపారు.
  • గాజువాకలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం చర్చిలో మత ప్రార్థనలు నిర్వహించారు.
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాసం వద్ద ఉత్తర నియోజకవర్గ నాయకులతో చేపడుతున్న దీక్షలో గంటా పాల్గొని నిరసన తెలిపారు. ఇందులో చిరంజీవి అభిమాన సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సంఘీభావం తెలిపారు. ఇందులో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు.


పాతగాజువాక కూడలిలో విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షులు
పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకుల అర్ధనగ్న ప్రదర్శన

తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు వెంటనే విడుదలవ్వాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నేతృత్వంలో పలు చర్చీల్లో ఆదివారం ప్రార్థనలు జరిపారు. ఒమ్మి సన్యాసిరావు, ఒమ్మి అప్పలరాజు, బొట్ట వెంకటరమణ తదితర నాయకులు ఆయనతో పాటు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, ఎం.వి.పి.కాలనీ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని