అందని బిల్లులు.. అప్పులతో తిప్పలు

ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న నిర్వాహకులకు కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 21 Sep 2023 05:11 IST

మధ్యాహ్న భోజనం నిర్వాహకుల ఇబ్బందులు

జనగామ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు (పాతచిత్రం)

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న నిర్వాహకులకు కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ మహిళలు అప్పులు తెచ్చి పిల్లల ఆకలి తీర్చుతున్నారు.  

పెరిగిన ధరలతో అవస్థలు..

నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో నిర్వాహకులు ఆర్థికభారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే దాని కంటే వెచ్చించే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.97 (గుడ్డుతో కాకుండా), ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్కొక్కరికి రూ.8.17 (గుడ్డు మినహాయించి) చొప్పున, 9, 10 తరగతుల్లో ఒక్కో విద్యార్థికి గుడ్డుతో కలుపుకొని రూ.10.67 వంతున చెల్లిస్తున్నారు. గత రెండేళ్లుగా నిత్యావసరాలు, కూరగాయలు, వంట గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. అప్పులు చేసి వంట చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలతో సతమతం..!

ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావడం లేదు. ఇచ్చే అరకొర వేతనాలు కూడా సమయానికి అందడం లేదు. మరోవైపు నిర్వాహకులు భోజనం తయారీకి దొరికిన చోటల్లా అప్పులు చేశారు. తెచ్చిన అప్పులు, సరుకులపై వ్యాపారులు వడ్డీలు వేస్తున్నారు. దీంతో వాటిని చెల్లించడం పెద్ద సమస్యగా మారింది. రోజూ కూలి పనులకు వెళ్తే రూ.500 వరకు వస్తుంటే.. కేవలం రూ.1000 వేతనానికి పని చేయడం కష్టంగా మారిందని, కిచెన్‌ షెడ్లు లేక ఆరుబయటే కట్టెలపొయ్యి మీద వంట చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నెలలకు సంబంధించి లక్షలాది రూపాయల భోజన బిల్లుల బకాయిలు రావాల్సి ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా పిల్లల కడుపు మాడ్చకుండా భోజనం పెడుతున్న నిర్వాహకులకు బిల్లులు త్వరగా విడుదల చేయాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి

  • జనగామలోని ఓ ఉన్నత పాఠశాలలో 380 మంది విద్యార్థులకు ముగ్గురు నిర్వాహకులు వంట చేస్తున్నారు. ఇందు కోసం నెలకు సుమారు రూ.50వేలకు పైగా ఖర్చవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం నెలకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు బిల్లులు వస్తుండడంతో నిర్వాహకులు నష్టపోతున్నారు.
  • మరో ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు భోజనం వండి పెడుతున్న నిర్వాహకురాలికి రోజుకు సుమారు రూ.200 చొప్పున లెక్కిస్తే ఆమెకు రూ.50 కూడా బిల్లు రావడం లేదు.
  • పాలకుర్తి, రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో వంట భారంగా మారడంతో నిర్వాహకులు వంట చేసేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం.

    అప్పులు తెచ్చి వంట చేస్తున్నాం

ఆదిలక్ష్మి, వంట నిర్వాహకురాలు, జనగామ

మూడు నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లులు ఇవ్వడం లేదు. ఇచ్చే బిల్లులను కూడా సకాలంలో అందించకపోవడంతో అప్పులు తెచ్చి పిల్లలకు భోజనం పెట్టాల్సి వస్తోంది. వంట చేస్తే రోజుకు రూ.50 కూలి పడుతోంది. అదే బయటి పనులకు వెళ్తే రోజుకు రూ.250 పడుతోంది. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు చెల్లించాలి. నిత్యావసర ధరలు పెరిగినందున ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలి.


ఏప్రిల్‌ వరకు  వచ్చాయి

గౌతమ్‌రాజు, ఎండీఎం ఇన్‌ఛార్జి

మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు ఏప్రిల్‌ వరకు బిల్లులు చెల్లించాం. నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే విడుదల కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని