సీఎం జగన్‌కు రాజధాని రైతుల సెగ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి గురువారం ఉదయం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది.

Updated : 22 Sep 2023 06:12 IST

రైతులు, మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి గురువారం ఉదయం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. శాసనసభ సమావేశాలకు ఆయన వెలగపూడిలోని సచివాలయానికి వెళుతున్న సమయంలో శిబిరం వద్ద అన్నదాతలు జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. ‘రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి’, ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దీక్ష శిబిరం నుంచి ఆందోళనకారులు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు అన్నదాతలు మాట్లాడుతూ 1374 రోజులుగా న్యాయం కోరుతూ నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి కనీసం తమ వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భూములు ఇచ్చిన తమకు కౌలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయటం దారుణమన్నారు. పిల్లలకు స్కూల్‌ ఫీజులు, ఆరోగ్య అవసరాలు, కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాపోయారు. ఎన్నికల ముందు మీ బిడ్డలాంటి వాడిని ఒక్క చాన్స్‌ ఇవ్వండని అడిగిన జగన్‌.. అధికార పీఠం ఎక్కిన తర్వాత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేయటానికి అప్పు దొరుకుతున్నప్పుడు.. కౌలు డబ్బులు ఇచ్చేందుకు దొరకడం లేదా అంటూ ప్రశ్నించారు. అమరావతి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోక పోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

సీఎం కాన్వాయ్‌ వెళ్తుండగా రైతులు, మహిళల నినాదాలు


‘చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర’

విభజన అనంతరం ఏర్పడిన నూతన రాష్ట్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధితో పరుగులు పెట్టించారు. అటువంటి నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులతో వేధించటం దారుణం. విజన్‌ 2020 అంటే అప్పట్లో నాయకులు విమర్శలు చేశారు. దాన్ని ఆచరణలో చంద్రబాబు నిజం చేశారు. ఆయన కృషితోనే హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో అభివృద్ధి చెందింది. ఆయన అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ప్రభుత్వానిదే బాధ్యత.

కామినేని గోవిందమ్మ, రాజధాని మహిళా రైతు, తుళ్లూరు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని