అలుపెరుగని సేవకుడు.. అభివృద్ధి కృషీవలుడు..!

కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన ఆప్యాయత పలకరింపు. ఎంతమందిలో ఉన్నా పేరు పెట్టి పిలిచే వ్యక్తిగా హరీశ్వరుడు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ సుపరిచితుడయ్యారు.

Updated : 24 Sep 2023 04:00 IST

జన మదిలో కొప్పులది చెరగని ముద్ర
న్యూస్‌టుడే, పరిగి

మాజీ ఉప సభాపతి హరీశ్వర్‌రెడ్డి అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న  ప్రజలు, అభిమానులు

కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన ఆప్యాయత పలకరింపు. ఎంతమందిలో ఉన్నా పేరు పెట్టి పిలిచే వ్యక్తిగా హరీశ్వరుడు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ సుపరిచితుడయ్యారు. 1947 మార్చి 18న రైతు కుటుంబంలో జన్మించారు. ఉప సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొప్పుల ఉప సభాపతి వరకు ఇంతింతై అన్నట్లుగా ఎదిగారు. ఐదు పర్యాయాలుగా శాసనసభ సభ్యునిగా పరిగి ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారు. రాష్ట్ర ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో అనేక మందికి రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు. నికార్సయిన నాయకునిగా హరీశ్వర్‌రెడ్డి పేరుగాంచారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఈసందర్భంగా పలువురు పేర్కొన్నారు.

రైతులకు లభిస్తున్న ఫలం

పరిగి ప్రాంత అభివృద్ధిలో హరీశ్వర్‌రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. పాలశీతలీకరణ కేంద్రం, పరిగి బస్టాండు ఏర్పాటులో హరీశ్వర్‌రెడ్డి కృషి ఎంతగానో ఉంది. వ్యవసాయాధారిత ప్రాంతంగా ఉన్న పరిగి నియోజకవర్గ రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. నిత్యం 3400 లీటర్ల పాలను 1500 మంది రైతులు పాలు పోస్తుండగా నెలకు సుమారు రూ.40లక్షలు బిల్లులు రూపేణా అందుతున్నాయి. అనుబంధ పరిశ్రమతో ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. పరిగి డిపో ప్రారంభంతో వందల గ్రామాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడ్డాయి. 81బస్సులు నిత్యం 30వేల కిలోమీటర్ల దూరం తిరుగుతూ రూ.12లక్షల మేరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. గురుకుల విద్యాలయాల ఏర్పాటులోనూ ఆయన కృషి మరువలేనిది. సంక్షేమ వసతి గృహాల ప్రారంభంతో వేలాది మంది చదువుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఓగా బీఈడీ కళాశాల ప్రారంభంలో హరీశ్వర్‌ కృషి ఉంది.

గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసులు

అంగన్‌వాడీల మౌనం

హరీశ్వర్‌రెడ్డి మృతిపట్ల అంగన్‌వాడీ టీచర్లు శనివారం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ సానుకూలంగా స్పందించేవారని అంగన్‌వాడీ టీచర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ అన్నారు. 

నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి 

త్రుటిలో తప్పిన ప్రమాదం

పరిగి, న్యూస్‌టుడే: మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియల్లో త్రుటిలో ప్రమాదం తప్పింది. అధికారిక లాంఛనాలతో శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి కాల్పులు ప్రారంభించారు. అంతకు ముందుగానే ఓ కానిస్టేబుల్‌ తుపాకీ నుంచి తూటా పేలింది. దీంతో ఎవరికీ ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చితి చుట్టూరా వందల మంది అభిమానులు చేరుకుని ఉండడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా 

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి హరీశ్వర్‌రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర మండల పరిషత్తు అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య తెలిపారు.

పాడె మోసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హరీశ్వర్‌రెడ్డి పాడెను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మోశారు. ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రదపటేల్‌, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు తదితరులు హరీశ్వర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో నియోజకవర్గంలోని అన్ని విభాగాల ఛైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, రైతుబంధు అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


ప్రజానేత హరీశ్వర్‌

- హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ

ప్రజానేత హరీశ్వర్‌రెడ్డి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ఎదిగి జనాల మదిలో పదిలంగా ఉన్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని