‘అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలు’

లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ కున్వర్‌ దానిష్‌ అలీపై భాజపా ఎంపీ రమేశ్‌ బిధూడీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated : 24 Sep 2023 04:27 IST

మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, చిత్రంలో నాయకులు హర్షద్‌ హుస్సేన్‌, షబ్బీర్‌ హుస్సేన్‌

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ కున్వర్‌ దానిష్‌ అలీపై భాజపా ఎంపీ రమేశ్‌ బిధూడీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎంపీ సత్వరమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని వినయ్‌గార్డెన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రాజ్యాంగ విలువలు, మత సామరస్యం కాపాడటంలో భాజపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. భాజపా ఎంపీ ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు, వాడిన భాష ఒక మతాన్ని కించపర్చేలా ఉందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనప్ప, అధికార పార్టీ నేతలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పక్కా లోకల్‌ అంటూ ప్రగల్భాలు పలికే కోనేరు కోనప్ప కాగజ్‌నగర్‌లో తాను నివాసముండే ప్రాంతానికి గుంటూరు కాలనీ అని ఎందుకు పేరు పెట్టారని ప్రశ్నించారు. సిర్పూర్‌ కాగితం మిల్లులో ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలన్నారు. కాగజ్‌నగర్‌ బస్టాండ్‌ సమీపంలో అధికార పార్టీ నేతలే ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌, భాజపా, భారాసకు చెందిన నాయకులు బీఎస్పీలో చేరారు. సమావేశంలో నాయకులు అర్షద్‌ హుస్సేన్‌, సిడాం గణపతి, సోయం చిన్నయ్య, దుర్గం ప్రవీణ్‌, తిరుపతి, నవీన్‌, మనోహర్‌ తదితరులున్నారు.

డీఈఎడ్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఈ నెల 25 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహించనున్న డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎడ్‌) పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ ఎం.ఉదయ్‌బాబు తెలిపారు. స్థానిక ఉర్దూ మాధ్యమం ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని