వైకాపాకు ఒకలా! ప్రజలకు మరోలా!

ఒకే రాజ్యాంగం.. ఒకటే చట్టం. కానీ వైకాపా నేతలు, కార్యకర్తలకు ఒకలా.. మిగిలిన ప్రజలందరికీ మరోలా అమలవుతోంది. చట్టం ఎదుట అందరూ సమానులే అనే మాటలు చెప్పుకొనేందుకే పరిమితం అవుతున్నాయి.

Updated : 27 Sep 2023 06:03 IST

కాలు కదపకుండా కట్టడులు
నోరు మెదపకుండా నొక్కివేతలు

ప్రదర్శనగా వెళ్తున్న తెదేపా నేతలు, శ్రేణులను అనుమతి లేదంటూ త్రోవగుంట వద్ద అడ్డుకుంటున్న పోలీసులు

ఒకే రాజ్యాంగం.. ఒకటే చట్టం. కానీ వైకాపా నేతలు, కార్యకర్తలకు ఒకలా.. మిగిలిన ప్రజలందరికీ మరోలా అమలవుతోంది. చట్టం ఎదుట అందరూ సమానులే అనే మాటలు చెప్పుకొనేందుకే పరిమితం అవుతున్నాయి. చట్టం అధికార పార్టీ చుట్టంలా మారిందనే విమర్శలే ఎల్లెడలా వినిపిస్తున్నాయి. జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటనలు.. పోలీసుల వ్యవహార తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమ సమస్యలివీ పరిష్కరించండి అని నోరు మెదపకుండా నొక్కేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించకుండా అణచి వేస్తున్నారు. పోలీసులు ఏకంగా ‘అధికార’ అనుబంధ విభాగం సేవకుల అవతారమెత్తుతున్నారు. వైకాపా నాయకులు దాడి చేస్తే కిమ్మనకూడదు.  రెచ్చగొట్టినా పట్టించుకోకూడదు. కవ్విస్తే కళ్లు మూసుకోవాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదేమి అరాచకమని ఎవరైనా ప్రశ్నిస్తే.. పైనుంచి ఆదేశాలు., పాటించడంలో మేం నిమిత్త మాత్రులమంటూ తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ పరిణామాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈనాడు, ఒంగోలు

  • ఉద్యోగులు, ప్రజా సంఘాలపై అలా...: చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టిన ఉద్యోగ సంఘాల నాయకులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలపై పోలీసులు ఇటీవల ఉక్కుపాదం మోపారు. వందల సంఖ్యలో నోటీసులు ఇచ్చారు. ఇళ్ల నుంచి బయటికి అడుగు పెట్టకుండా నిఘా ఏర్పాటు చేశారు. కొందరు మహిళలను కూడా స్టేషన్లకు తీసుకెళ్లి నిర్బంధించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు అరెస్టు సందర్భాల్లో జిల్లాలోని ముఖ్య నేతలందరినీ గృహ నిర్బంధం చేశారు. ర్యాలీలు, నిరసనలు తెలపకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. నిరసనల్లో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు.
  • చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెదేపా నాయకులు ఒంగోలులో తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈ నెల 11న నిర్వహించిన బంద్‌లో ఒంగోలులో తెదేపా నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని, అల్లర్లు సృష్టిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించారంటూ 43 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో కొందరిని అరెస్టు చేసి రాత్రికి రాత్రే రిమాండ్‌కు తరలించారు.
  • రాజధాని రైతుల పైనా రుసరుస...: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాల భూములిచ్చిన రైతులు తమకు వాటిల్లిన అన్యాయంపై గళమెత్తుతూ హైకోర్టు అనుమతితో 2021లో పాదయాత్ర చేపట్టారు. నవంబరులో జిల్లాలోకి ప్రవేశించింది. వీరికి అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పాదయాత్రలో పాల్గొనకుండా ప్రజలు, విపక్షాలను అడ్డుకున్నారు. చదలవాడ వద్ద ఏకంగా రైతులపై లాఠీఛార్జీ చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై అధికార పార్టీ ఎమ్మెల్యే సూచనల మేరకు పోలీసులు జులుం ప్రదర్శించారని విమర్శలు వెల్లువెత్తాయి.
  • అధికారమైతే ఇలా...: కొవిడ్‌ సమయంలో కూడా అధికార పార్టీ నాయకులు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వందల మంది పాల్గొన్నప్పటికీ ఆంక్షలు అమలు చేయలేదు. జిల్లాలో 144, 30 పోలీసు యాక్టు అమల్లో ఉన్నప్పటికీ గడప గడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాల్లో వందల మంది పాల్గొంటున్నప్పటికీ పోలీసులు అనుమతిస్తున్నారు. పైగా వారే  బందోబస్తు కల్పిస్తున్నారు.
  • ఇటీవల సంతనూతలపాడు తహసీల్దార్‌పై వైకాపా మండల నాయకుడు కార్యాలయంలోనే దాడి చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒంగోలుకు చెందిన వైకాపా తిరుగుబాటు నేత సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన వారిని పట్టుకోవడంలోనూ తాత్సారం వహించారు.
  • సమీక్షలకు పహారా...: ఈ నెల 9న తెదేపా అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్టు చేసి జిల్లా మీదుగా విజయవాడ తరలించారు. దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కానీ, చంద్రబాబును కలవడానికి కానీ అవకాశం లేకుండా జిల్లాలోని ముఖ్య నేతలందరినీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినా శ్రేణులు రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపాయి. వీరిపై కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించారు. ఈ కారణంగా జిల్లాలో కొందరు నేతలను మూడు రోజులపాటు ఇంటి నుంచి బయటకు రానీయలేదు. బంద్‌ సందర్భంగానూ పలువురు ద్వితీయ శ్రేణి నాయకులను స్టేషన్లలోనే ఉంచారు. ఈ నెల 12న ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా తెదేపా నాయకులను పోలీసులు అనుమతించలేదు. పదేపదే అడ్డుపడ్డారు. అదే సమయంలో అదేరోజు వైకాపా నియోజకవర్గాల సమీక్షా సమావేశానికి వచ్చిన వాహనాలతో ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణాన్ని నింపేసినా, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరించినా పోలీసులు కిమ్మనలేదు. గడప గడపతో పాటు, ఇతర కార్యక్రమాలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

మంత్రిని వదిలి మాజీ ముఖ్యమంత్రిపై...

ఈ ఏడాది ఏప్రిల్‌లో తెదేపా అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు పశ్చిమ ప్రకాశంలో పర్యటించారు. యర్రగొండపాలెంలో ఆయన్ను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో దాదాపు వంద మందికి పైగా వైకాపా నాయకులు, కార్యకర్తలు నల్ల బుడగలు, జెండాలతో ప్రయత్నించారు. విషయం ముందుగానే తెలిసినా పోలీసులు అధికార పార్టీ నాయకులను కట్టడి చేయలేదు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి చోటుచేసుకుంది. ఆయన భద్రతాధికారికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ అనంతరం ప్రాణాలు విడిచారు. అయినప్పటికీ పోలీసులు చంద్రబాబు పైనే కేసులు నమోదు చేశారు. ఉద్రిక్తతలకు కారణమైన మంత్రి సురేష్‌పై తమ ఔదార్యాన్ని ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని