డ్రైవర్ల కొరత.. పనిభారంతో కలత

జిల్లాలోని శ్రీకాళహస్తి డిపోలో డ్రైవర్ల కొరత పట్టిపీడిస్తోంది. ఫలితంగా విధుల్లో ఉన్న వారిపై అదనపు పనిభారం మోపుతున్నారు.

Updated : 03 Oct 2023 06:41 IST

అదనపు ట్రిప్పులతో ఒత్తిడి

తిరుపతి (ఆర్టీసీ), న్యూస్‌టుడే: జిల్లాలోని శ్రీకాళహస్తి డిపోలో డ్రైవర్ల కొరత పట్టిపీడిస్తోంది. ఫలితంగా విధుల్లో ఉన్న వారిపై అదనపు పనిభారం మోపుతున్నారు. అదనపు ట్రిప్పులు, టిమ్‌ విధులంటూ ఒత్తిడికి గురిచేస్తున్నారని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు. ప్రశ్నించే వారికి మెమోలు జారీ చేస్తామంటూ డిపో స్థాయి అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆదివారం ఇదే డిపోలో పనిచేస్తున్న డ్రైవర్‌ ధనరాజు.. ఒత్తిడితోనే మృతి చెందారంటూ సహ ఉద్యోగులు, బంధువులు డిపో ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

ఏపీఎస్‌ఆర్టీసీ జిల్లా పరిధిలో మొత్తం 11 డిపోలు ఉండగా, అందులో శ్రీకాళహస్తి ఒకటి. ఇక్కడ 103 బస్సులకు ఘాట్‌రోడ్డు సర్వీసులు (తిరుమల- తిరుపతి)- 25, తిరుపతి- శ్రీకాళహస్తి (నాన్‌- స్టాప్‌ మెట్రో)- 25, మిగిలిన బస్సుల్లో సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు సర్వీసులున్నాయి. అన్ని బస్సులకు 200 మంది డ్రైవర్లు ఉండాలి. 70 మంది కొరత ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఆన్‌కాల్‌ డ్రైవర్ల(రోజువారీ వేతనం)ను నియమించుకుంటున్నారు. వీరు ఒకరోజు వస్తే మరో రోజు రారు. దీంతో రెగ్యులర్‌ డ్రైవర్లపై పనిభారం పడుతోందని, కనీస అవసరాలకు అధికారిక సెలవులు పెట్టుకునే అవకాశం కూడా లేదని వారు వాపోతున్నారు.  

ఒత్తిడి పెంచుతున్నారిలా..

తిరుమల- తిరుపతి, తిరుపతి- శ్రీకాళహస్తి సర్వీసులు నడిపే డ్రైవర్లకు అదనపు విధులతో ఒత్తిడి పెంచుతున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా తిరుమల- తిరుపతి సర్వీసులు డిపో నుంచి తిరుపతికి ఒక ట్రిప్పు వచ్చి తిరుమలకు ఐదు ట్రిప్పులు నడిపి, తిరిగి శ్రీకాళహస్తి డిపోకు చేరుకోవాలి. శని, ఆదివారాలు భక్తుల రద్దీ దృష్ట్యా అదనంగా ఒక ట్రిప్పు కలిపి మొత్తం ఆరు ట్రిప్పులు తిరగాలి. ఇలా పూర్తిచేసి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి డ్రైవర్‌కు ఒకటిన్నర రోజు పడుతుంది. డ్యూటీ దిగిన డ్రైవరు అదేరోజు మిగిలిన సగం రోజు విశ్రాంతి తీసుకొని, తిరిగి మరుసటిరోజు ఉదయాన్నే విధులకు హాజరు కావాలి. అలాగే తిరుపతి- శ్రీకాళహస్తి మధ్య  డ్రైవర్లు మొత్తం ఆరు ట్రిప్పులు నడపాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ మార్గంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం. ఈ లెక్కన ఉదయం 9 గంటలకు విధులకు వచ్చిన డ్రైవరు ఆరు ట్రిప్పులు ముగించుకునే సరికి తిరిగి మరుసటి రోజు ఉదయం 8 గంటలు అవుతుంది. అంటే 24 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి. సంస్థ ఆదాయం చూస్తుందే తప్ప డ్రైవర్ల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.


ప్రశాంత విధులు కేటాయించాలి

డ్రైవర్లకు ప్రశాంతమైన విధులు కేటాయించాల్సిన అవసరం. వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేయడం అధికారులకు సరికాదు. తద్వారా ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఒత్తిడి లేని విధులు కేటాయించాలి.

 బి.ఎస్‌.బాబు, ఎన్‌ఎంయూఏ జిల్లా కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని