వెంటాడుతున్న జ్వరాలు.. ఏవీ శిబిరాలు?

జిల్లాలో చిన్నా, పెద్ద తేడా లేకుండా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఒకసారి వచ్చి తగ్గాక.. మళ్లీ జ్వరాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. రెండోసారి వచ్చిన వారిలో చాలా మందికి రక్త కణాల్లో హెచ్చుతగ్గులు అవుతున్నాయి.

Updated : 03 Oct 2023 06:54 IST

పరిస్థితి విషమిస్తున్నా.. పట్టింపు కరవు..

ఆసిఫాబాద్‌, తిర్యాణి, న్యూస్‌టుడే : జిల్లాలో చిన్నా, పెద్ద తేడా లేకుండా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఒకసారి వచ్చి తగ్గాక.. మళ్లీ జ్వరాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. రెండోసారి వచ్చిన వారిలో చాలా మందికి రక్త కణాల్లో హెచ్చుతగ్గులు అవుతున్నాయి.  ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసిన పత్రాలను.. ప్రైవేటుకు తీసుకెళ్లినా.. వాటిని పరిశీలించకుండా.. మళ్లీ చేయాలని చెబుతుండటంతో రూ.వేలకు వేలు ఖర్చవుతోందని బాధితులు వాపోతున్నారు. జ్వరంవస్తే వారంరోజుల పాటు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో మంచానికే పరిమితం కావాల్సి వస్తోంది. జిల్లా అంతటా జ్వరాలు ప్రబలుతున్నా.. 10 మంది వరకు జ్వరంతో మృతిచెందినా.. ఎక్కడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

కలెక్టరేట్‌ ఎదుట సమ్మె చేస్తున్న ఆశా కార్యకర్తలు

డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాల బాధితులతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు క్లినిక్‌లు కిటకిటలాడుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో జ్వర తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్‌ మండలం మోవాడ్‌ పంచాయతీ పరిధిలోని చౌపన్‌గూడకు చెందిన 13 ఏళ్ల బాలుడు జంగు గతనెల 29న జ్వరంతో మృతి చెందాడు. అత్యధికంగా తిర్యాణి మండలంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ జ్వరాలు సైతం ఈ మండలంలోనే ఎక్కువగా నమోదైనట్లు సమాచారం.

వేధిస్తున్న వైద్యుల కొరత..

జిల్లాలో 20 ప్రాథమిక, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు సామాజిక ఆసుపత్రులున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 46 మంది వైద్యులకు గాను 22 మందే పనిచేస్తున్నారు. రెండురోజుల క్రితం కొత్తగా ఒప్పంద విధానంలో నలుగురు నియామకం కావడంతో సంఖ్య 26కు పెరిగింది. ఇంకా 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండురోజుల క్రితం పిడుగుపాటుతో లింగాపూర్‌ మండలం వంజరిగూడకు చెందిన అయిదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే జైనూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కడ ఒకే వైద్యుడు ఉండటంతో అయిదుగురికి ఏకకాలంలో చికిత్స చేయడం వీలుకాలేదు. దీంతో ప్రాథమిక చికిత్స చేసి ఉట్నూరు, ఆదిలాబాద్‌ రిమ్స్‌కు రెఫర్‌ చేయాల్సి వచ్చింది.

ఉన్నతీకరించినా..

లింగాపూర్‌, సిర్పూర్‌(యు) మండలాల ప్రజలకు జైనూర్‌ ఆసుపత్రే పెద్ద దిక్కు. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆసుపత్రిగా ఉన్నతీకరించినా.. అవసరమైన వైద్యులను నియమించలేదు. ఓ వైపు వైద్యుల కొరత వేధిస్తుంటే.. క్షేత్ర స్థాయిలో అన్నిరకాల సర్వేల్లో ముఖ్య భూమిక పోషించే ఆశా కార్యకర్తల సమ్మె మరింత ప్రభావాన్ని చూపుతోంది. సుమారు 850 మందికి పైగా కార్యకర్తలు సమ్మెబాట పట్టారు.

చిత్రంలో కనిపిస్తున్నది తిర్యాణికి చెందిన వెంకన్న, 15 రోజుల క్రితం జ్వరం రావడంతో మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. రూ.నాలుగు వేలు ఖర్చయ్యింది. జ్వరం తగ్గి కొంత కోలుకోగానే మరోసారి మంచాన పడ్డాడు. రక్త పరీక్ష చేయిస్తే రక్తకణాలు తగ్గినట్లు తేలింది. మళ్లీ రూ.మూడు వేల వరకు ఖర్చయ్యింది. ఈ గ్రామంలో రెండోసారి జ్వరం బారినపడ్డవారు పదుల సంఖ్యలో రక్తకణాల ఎక్కువ, తక్కువై బాధపడుతున్నారు.

సామాన్యులకు ఆర్థికభారం..: రమేశ్‌

మొదట జ్వరం వచ్చినప్పుడు తిర్యాణిలోని సీహెచ్‌సీలో రక్త పరీక్ష చేయించాను. మూడు రోజులైనా ఫలితాలు రాలేదు. రోజురోజుకు జ్వరం ఎక్కువ కావడంతో మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. రక్త పరీక్షలు, మందులకు రూ.5 వేలు ఖర్చయ్యాయి. వారం క్రితం మళ్లీ జ్వరం వచ్చింది. మరోసారి మంచిర్యాలలో పరీక్ష చేయించగా.. రక్త కణాల్లో హెచ్చుతగ్గులున్నట్లు చెప్పారు. మళ్లీ రూ.మూడు వేల వరకు ఖర్చయ్యింది. క్షౌరవృత్తి చేస్తేనే పూట గడిచే నాకు వైద్యఖర్చులు తలకుమించిన భారం అయ్యాయి.

పరిస్థితి విషమించి.. ప్రాణం పోయింది

దహెగాం: మండలంలోని కొత్మీర్‌ గ్రామానికి చెందిన యువకుడు మిట్టె నాగరాజు(24) ఆదివారం రాత్రి జ్వరంతో మృతిచెందాడు. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు, మూడు రోజులు ఇంటి వద్దే వైద్యం చేయించారు. తర్వాత ఈజ్‌గాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అనంతరం వైద్యుల సూచన మేరకు వరంగల్‌ తీసుకెళ్లడానికి అంబులెన్సు ఎక్కిస్తుండగా మృతిచెందాడు. ఈ సీజన్‌లో జ్వరంతో సుమారు 10 మంది చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని