పల్లె పాలన పట్టుతప్పుతోందని...

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను విద్యుత్తు బిల్లుల రూపంలో దారి మళ్లించి, గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు నిర్వహించలేని స్థితికి తీసుకొచ్చి, గ్రామాల్లో తమను ఉత్సవ విగ్రహాల్లా మార్చివేశారని సర్పంచులు వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 03 Oct 2023 06:43 IST

ప్రభుత్వం మళ్లించిన నిధులు విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద నిరసనలో సర్పంచులు

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను విద్యుత్తు బిల్లుల రూపంలో దారి మళ్లించి, గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు నిర్వహించలేని స్థితికి తీసుకొచ్చి, గ్రామాల్లో తమను ఉత్సవ విగ్రహాల్లా మార్చివేశారని సర్పంచులు వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంచాయతీలకు రావాల్సిన నిధులను తక్షణం విడుదల చేయాలని, సచివాలయాలను పంచాయతీల అధీనంలోకి తీసుకురావాలని రెండున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు.

నిధుల మళ్లింపుపై పోరాటం

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రెండున్నర సంవత్సరాలుగా విద్యుత్తు బిల్లుల బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. నిధులులేక పంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని ఎన్నికైన తొలినాళ్ల నుంచే సర్పంచులు వాపోతున్నారు. ప్రజల కష్టాలు తీరుద్దామనే ఉత్సాహంతో గ్రామ సర్పంచులుగా పోటీ చేసి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎన్నికయ్యామని, బాధ్యతలు చేపట్టినప్పట్నుంచే వైకాపా ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పాలన అందిస్తామని అట్టహాసంగా ప్రారంభించిన సచివాలయాల వల్ల తమకు కనీస గౌరవం దక్కకుండా పోతోందని సర్పంచులు వాపోతున్నారు. పైగా వాటి నిర్వహణ భారాన్నీ తమపైనే వేసి, ప్రభుత్వం గొప్పగా ప్రచారం నిర్వహించుకోవడం దుర్మార్గమని వారు ఆరోపిస్తున్నారు.

కేంద్ర బృందం విస్మయం..

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బిల్లులకు మళ్లించుకోవడంపై సర్పంచులు రెండేళ్లుగా గ్రామస్థాయి నుంచి దిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు దిల్లీలో సైతం నిరసన వ్యక్తం చేసి, తమ పంచాయతీల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. బృంద సభ్యులు పలు జిల్లాల్లో పర్యటించారు. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్తు బిల్లులకు బదలాయించడంపై కార్యదర్శులకు నోటీసులు ఇవ్వడం గమనార్హం.

కలెక్టరేట్‌ వద్ద నిరసన..

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సర్పంచులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ పంచాయతీల నుంచి దొంగిలించిన నిధులను తక్షణం విడుదల చేయాలని కలెక్టరేట్‌ ఆవరణలోని గాంధీజీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. సలాది బుచ్చిరాజు, పడాల రమేష్‌, చిక్కం పెదబాబు, జల్లి బాలరాజు, బీర రాజారావు తదితరులు పాల్గొన్నారు.


గ్రామ స్వరాజ్యాన్ని తుంగలో తొక్కారు..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తుంగలో తొక్కింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల నుంచి రూ.8,629 కోట్లను విద్యుత్తు బిల్లుల కింద మళ్లించుకున్న గొప్ప పాలన జగన్‌ సర్కార్‌ది. నిధులు దోచేసి సర్పంచులను రోడ్డుపాలు చేశారు. మా పంచాయతీల నుంచి దొంగిలించిన సొమ్మును తక్షణం తిరిగివ్వాలి.

శాంతకుమారి, సర్పంచుల సమాఖ్య సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు


రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు..

వైకాపా అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రాష్ట్రంలో అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం కాకుండా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలన్న గాంధీజీ ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్‌లో అమలు కావడం లేదు. గ్రామాల్లో అభివృద్ధిచేయాల్సిన నిధులతో పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు.

రంబాల రమేష్‌, సర్పంచుల సమాఖ్య సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి


కనీస వసతులు కల్పించలేకపోతున్నాం..

గ్రామ పంచాయతీల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమచేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలకు మళ్లించడంతో గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేని దుస్థితికి చేరుకున్నాం. తాగునీరు, పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు కూడా సొమ్ములేక పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో గ్రామల్లో సర్పంచులం పేరుకే అన్నట్లు మిగిలిపోతున్నాం. తక్షణం మా విధులు, నిధులు తిరిగివ్వాలి.

కుంపట్ల నాగలక్ష్మి, కె.ముంజవరం


పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసమే..

అట్టహాసంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే అధికారులు పంచాయతీలపై కక్షగట్టి నిధులు మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. వాలంటీరు వ్యవస్థ వల్ల గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు పూర్తి అచేతనంగా మారారు. వీటన్నింటిపైనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మా పోరాటం ఆపేదే లేదు.

కాకర శ్రీనివాస్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని