ఫోన్‌ పోయిందా.. ఖాతా ఖాళీనే

‘నగరానికి చెందిన చైతన్య ఫోన్‌ పోగొట్టుకున్నాడు. పాత ఫోన్‌ కదా అని పట్టించుకోలేదు. మరుసటిరోజు కొత్త ఫోన్‌ కొని పాత నంబరుతోనే సిమ్‌కార్డు వేశాడు. డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లు యాక్టివేట్‌ చేసి బ్యాంకు ఖాతా తనిఖీ చేశాడు.

Published : 12 Jun 2024 05:33 IST

ఆధార్‌ నంబరూ ఉండొద్దు
డెబిట్, క్రెడిట్‌ కార్డుల పిన్‌ పెట్టొద్దు

ఈనాడు- హైదరాబాద్‌: ‘నగరానికి చెందిన చైతన్య ఫోన్‌ పోగొట్టుకున్నాడు. పాత ఫోన్‌ కదా అని పట్టించుకోలేదు. మరుసటిరోజు కొత్త ఫోన్‌ కొని పాత నంబరుతోనే సిమ్‌కార్డు వేశాడు. డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లు యాక్టివేట్‌ చేసి బ్యాంకు ఖాతా తనిఖీ చేశాడు. ఖాతాలోని రూ.9 వేలు ఓ పెట్రోలు బంకు ఖాతాకు బదిలీ చేసినట్లు లావాదేవీ కనిపించడంతో అవాక్కయ్యాడు. ఆరా తీయగా ఫోన్‌ దొరికిన వ్యక్తి ఈ పనిచేసినట్లు తెలుసుకున్నాడు.’  

చరవాణి పోగొట్టుకుంటున్న బాధితులకు కొత్త తలనొప్పి వచ్చిపడుతోంది. రూ.వేలు పెట్టి కొన్న ఫోన్‌ పోయిందని ఓ వైపు మదనపడుతుంటే ఇంకోవైపు బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్ము క్షణాల్లో మాయమవడం కలవరపెడుతోంది. ఫోన్‌పే, గూగుల్‌ పే, క్రెడిట్, డెబిట్‌కార్డు పిన్‌ నంబర్లు, ఆధార్‌ నంబర్లు, ఇతర డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లు ప్రతి ఫోన్‌లోనూ ఉండటం ఫోన్‌ కొట్టేసిన నేరగాళ్లు యూపీఐ పిన్‌ మార్చేసి తేలిగ్గా డబ్బు బదిలీ చేసుకుంటున్నారు. ఫోన్‌ పోయిన వెంటనే ఎక్కువ మంది యాప్‌ ఐడీలు, బ్యాంకు ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్‌ చేయకపోవడం.. కొత్త ఫోన్‌ తీసుకునేవరకూ పాత సిమ్‌కార్డు బ్లాక్‌ చేయకుండా వేచి చూడటం వంటి చిన్న పొరపాట్లు నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఇటీవలికాలంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. 

యూపీఐతోనే మాయ: రహస్యంగా ఉంచాల్సిన యూపీఐ రహస్య పిన్‌ను కాంటాక్టు జాబితాలో సేవ్‌ చేయడం, ఫోన్‌ పోయిన వెంటనే సిమ్, బ్యాంకు ఖాతాలు బ్లాక్‌ చేయకపోవడంతో బ్యాంకు ఖాతాల్లో డబ్బు పోవడానికి ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఫోన్‌ పోగొట్టుకున్నా, చోరీ అయిన సందర్భాల్లో బాగా ఖరీదైన కొన్ని ఫోన్లు మినహా సాధారణ ఫోన్లు అన్‌లాక్‌ చేయడం తేలికే. జగదీశ్‌ మార్కెట్‌ లాంటి చోట్ల కొందరు సెల్‌ఫోన్‌ దుకాణాదారులు అన్‌లాక్‌ చేసి.. కొత్త సెక్యూరిటీ కోడ్‌లు పెట్టడం వంటివి క్షణాల్లో చేసేస్తారు. ఆ తర్వాత నేరగాళ్లు ఫోన్‌లోని యూపీఐ యాప్‌లను డిలీట్‌ చేస్తారు. సిమ్‌కార్డు ఫోన్‌లోనే ఉండటంతో మళ్లీ యూపీఐ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసి ఈ డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం లేదా.. ఇతరులకు డబ్బు బదిలీ చేసి నగదు తీసుకోవడం వంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్త ఫోన్‌ కొని బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసినప్పుడు ఈ తతంగం ఎక్కువగా బయటపడుతున్నాయి. 


అప్రమత్తత అవసరం 

  • పాత, కొత్త ఫోన్‌ ఏదైనా పోగొట్టుకున్నా,చోరీ అయినా ఆలస్యం చేయకుండా బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా బ్లాక్‌ చేయించాలి.
  • గూగుల్‌ పే, ఫోన్‌పే, ఇతర డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లను బ్లాక్‌ చేయాలి
  • బ్యాంకు ఖాతా రహస్య పిన్‌లు కాంటాక్టు జాబితాలో సేవ్‌ చేసుకోకూడదు. 
  • ఆధార్‌కార్డు నంబర్లు పెట్టడం ప్రమాదకరమే.
  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఈఐఆర్‌    
  • పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని