బడి బస్సు.. సామర్థ్యం లేకపోతే కేసు

వేసవి సెలవులు ముగియనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరచుకోనున్నాయి. అయినా ఇంకా చాలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

Updated : 12 Jun 2024 05:00 IST

ఫిట్‌నెస్‌కు దూరంగా 2873 వాహనాలు
ఈనాడు, హైదరాబాద్‌

తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారులు

వేసవి సెలవులు ముగియనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరచుకోనున్నాయి. అయినా ఇంకా చాలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. వేలాది రూపాయల రుసుములు వసూలు చేసే పాఠశాలలు పిల్లల భద్రత విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నాయి. 

బస్సులో బడికి వెళ్లిరావడానికి ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.వేయి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ బస్సులు, వ్యానులు పిల్లలను తరలించడంలో ఎంతవరకు భద్రంగా ఉన్నాయనేది కీలకం. ఇందుకు ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందు రవాణాశాఖ ఫిట్‌నెస్‌ పరీక్షలను నిర్వహిస్తుంది. వివిధ కోణాల్లో బస్సులు లేదా మినీ వ్యానులను పరిశీలించి భద్రత అంశాలను బేరీజు వేసి సంతృప్తి చెందితేనే ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 12,631 స్కూల్‌ బస్సులు ఉండగా ఇంకా 2,873 బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే ధ్రువీకరణ తీసుకోవాలని, లేదంటే బస్సులు సీజ్‌ చేయడంతో పాటు పాఠశాలల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జేటీసీ రమేష్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ హెచ్చరించారు. బస్సుల్లో టైర్ల నుంచి సీటింగ్, స్టీరింగ్, ఇంజన్‌.. అన్ని పకడ్బందీగా ఉండాలన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను పాఠశాలల పిల్లలను తరలించడానికి వినియోగించరాదని అన్నారు. 60 ఏళ్లలోపు వయస్సు వారినే డ్రైవర్లుగా పెట్టుకోవాలని, డ్రైవర్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. 

వ్యాన్లే ఎక్కువ... గ్రేటర్‌లో పిల్లలను తరలించడంలో బస్సుల కంటే మినీ వ్యాన్లే ఎక్కువ శాతం ఉన్నాయి. ఇందులో చాలా వరకు 15 ఏళ్లు దాటినా సరే... రవాణాశాఖ దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో వ్యానులో పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక మాఫియా తరహాలో ఈ దందా నడుస్తోంది. బస్సులపై దృష్టి పెడుతున్న అధికారులు ఈ వ్యాన్లను అసలు పట్టించుకోవడం లేదు. 

నిబంధనలు ఇలా..

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: పర్మిట్, బీమా, పొల్యూషన్‌ పత్రాలు, డ్రైవర్‌కు సంబంధించి లైసెన్స్‌ను సమర్పించి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్‌తో పాటు బస్సులో ఉండే అటెండెంట్‌ వివరాలను కార్మిక శాఖ కార్యాలయంలో నివేదించి వారు ధ్రువీకరించిన పత్రం రవాణాశాఖ కార్యాలయంలో సమర్పించాలి.

  • డ్రైవర్‌ వయసు 60 ఏళ్ల లోపు, అయిదేళ్ల హెవీ వాహనం నడిపిన అనుభవం కలిగి ఉండాలి.
  • బస్సులో  ఫైర్‌ ప్రొటెక్షన్‌ సిలిండర్‌తో పాటు ప్రథమ చికిత్స బాక్సు, అత్యవసర ద్వారాలు ఉండాలి.
  • విద్యార్థులు తల బయటకు పెట్టి తొంగి చూసేందుకు వీలు లేకుండా కిటికీలకు నాలుగు వరుసల పైపు లైను అమర్చాలి.  పార్కింగ్‌ లైట్లు, బ్రేకులు, టైర్లు, అద్దాలు, లైట్లు, వైపర్ల పనితీరు గమనించాలి.
  • డ్రైవరు బస్సును వేగంగా నడిపినా, చరవాణిలో మాట్లాడుతూ, మద్యం తాగి వాహనం నడిపినట్లయితే అతడిపై చర్యలు తీసుకునేందుకు ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి.
  • బస్సుకు పసుపు రంగు  వేయాలి. ఆర్టీఏ అధికారులు జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాలను బస్సులో ప్రదర్శించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని