తడబాటులో.. మనబడి

కొత్త పుస్తకాలు..దుస్తులు.. కొత్త జోష్‌తో పాఠశాలలకు వెళ్లనున్న చిన్నారులతో రాజధాని నగరంలో బుధవారం సందడి ప్రారంభం కానుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య..

Updated : 12 Jun 2024 04:56 IST

అరకొర సౌకర్యాలతోనే ప్రభుత్వ పాఠశాలలు
తాత్కాలిక మరమ్మతులతో సిద్ధం

కంటోన్మెంట్‌ మడ్‌ఫోర్ట్‌ ప్రభుత్వ పాఠశాలలో బెంచీలు శుభ్రం చేస్తున్న సిబ్బంది

కొత్త పుస్తకాలు..దుస్తులు.. కొత్త జోష్‌తో పాఠశాలలకు వెళ్లనున్న చిన్నారులతో రాజధాని నగరంలో బుధవారం సందడి ప్రారంభం కానుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య.. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు లేకపోయినా తాత్కాలిక మరమ్మతులతో అరకొర సౌకర్యాలతో అధికారులు విద్యార్థులకు స్వాగతం చెబుతున్నారు. ఆరుబయలు లేని బడుల్లో, పాతబెంచీలతోనే విద్యార్థులు సర్దుకోవాలి. రంగులు వేసేందుకు, శౌచాలయాలు శుభ్రంగా ఉంచేందుకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు రూ.40వేలు కేటాయించారు. రాజధాని నగరం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 2,550 ప్రభుత్వ పాఠశాల్లో 3.50 లక్షల మంది విద్యారులు చదువుకుంటున్నారు. గతంలో ‘మన బస్తీ..మన బడి’ పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడడంతో వాటిని పక్కనపెట్టేశారు. 

కొంచెం ఇష్టం..   కొంచెం కష్టం 

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు, విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేందుకు ప్రభుత్వం 14 అంశాలను గుర్తించింది. ఇందులో ప్రధానమైనవి ధారాళమైన గాలి, వెలుతురు వచ్చే తరగతి గదులు, సైన్స్‌ల్యాబ్, డ్యూయల్‌ డెస్క్‌లు, విద్యారుల సంఖ్యకు సరిపడా శౌచాలయాలు, తాగునీటి సౌకర్యం, భద్రత కోసం ప్రహరీలు ఉండాలి.. ఇలాంటి పాఠశాలలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఉండాలన్న తలంపుతో రాజ్‌భవన్‌ పాఠశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

రెజిమెంటల్‌బజార్‌ ప్రభుత్వ పాఠశాలలో సిద్ధంగా పాఠ్యపుస్తకాలు 

  • ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని 40శాతం బడుల్లో సరైన బల్లలు లేవు. హైదరాబాద్‌ జిల్లాలో 159 పాఠశాలలకు సొంత భవనాలు లేవు. కొన్నింటికి తాగునీటి సౌకర్యం లేకపోతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు.

  • ప్రభుత్వ పాఠశాలలకు చేయూత అందించే లక్ష్యంతో కొందరు పూర్వ విద్యార్థులు, కొన్ని ఐటీ సంస్థలు మూడు జిల్లాల్లోని పలు బడుల్లో వసతుల కల్పనలో సహరిస్తున్నాయి. డిజిటల్‌ క్లాసులు, ప్రయోగశాలలకు అవసరమైన సహకారం అందిస్తున్నాయి.

విద్యాహక్కు చట్టం.. కాగితాలకే పరిమితం 

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. మూడు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. పాతబస్తీ, సికింద్రాబాద్, ముషీరాబాద్, శేరిలింగంపల్లి, గోల్కొండ, రాజేంద్రనగర్, చేవెళ్ల, కీసర, ఘట్‌కేసర్, మేడ్చల్, శామీర్‌పేట మండలాల్లో ఒక్క ఉపాధ్యాయుడే బోధిస్తున్నారు. వాలంటీర్లను నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా జీతాలు సక్రమంగా రావడం లేదని కొందరే చేరుతున్నారు.


శిథిలావస్థలో పాఠశాల గోడ.. ఏదీ మరమ్మతుల జాడ ?

రెజిమెంటల్‌ బజార్‌ నెంబర్‌వన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల ప్రహరీ, పైకప్పు భాగం శిథిలావస్థకు చేరింది. గోడల నుంచి చెట్ల ఊడలు బయటికొస్తున్నాయి. అయినా మరమ్మతులు చేపట్టలేదు. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో  తడిసి ఎప్పుడు కూలుతుందో అని  తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని