దర్శన్‌పై రౌడీషీట్‌?

తనతో సహజీవనం చేస్తున్న పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపించాడని చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి (28)ని హత్య చేసిన కేసులో కథానాయకుడు దర్శన్‌పై రౌడీషీటు తెరిచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Updated : 13 Jun 2024 06:24 IST

నిజజీవితంలో ప్రతి‘నాయక’ పాత్ర

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : తనతో సహజీవనం చేస్తున్న పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపించాడని చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి (28)ని హత్య చేసిన కేసులో కథానాయకుడు దర్శన్‌పై రౌడీషీటు తెరిచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నేరానికి అనుగుణంగా పోలీసులే దీనిపై చర్యలు తీసుకుంటారని హోం శాఖ మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ స్పష్టం చేశారు. దర్శన్, పవిత్రా గౌడ, ఇతర పదకొండు మంది నిందితుల విచారణకు న్యాయస్థానం అనుమతించింది. వచ్చే సోమవారం వరకు వారిని విచారించడానికి న్యాయమూర్తి అనుమతించారు. స్వామి మృతదేహం లభించిన చోటుకు, హత్య జరిగిన పట్టణగెరె షెడ్డుకు కొందరు నిందితులను తీసుకువెళ్లి పోలీసులు బుధవారం మహజరు నిర్వహించారు. దర్శన్‌ను చలన చిత్ర వాణిజ్య మండలి బహిష్కరించాలని సర్వ సంఘాల సమాఖ్య డిమాండు చేసింది. మండలి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాన్ని అందించింది. రేణుకా స్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని లోక్‌సభ సభ్యుడు గోవింద కారజోళ డిమాండు చేశారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ తన భర్తను అన్‌ఫ్రెండ్, అన్‌ఫాలో చేశారు. తన అభిమాననటుడు దర్శన్, అతని భార్య విజయలక్ష్మి సంసారం బాగుండాలని రేణుకాస్వామి కోరుకునేవాడు. పవిత్ర గౌడ దర్శన్‌ జీవితంలోకి వచ్చి, వారి సంసారాన్ని విచ్ఛిన్నం చేసిందని స్నేహితుల వద్ద వాపోయేవాడు. పవిత్రపై కోపంతో ఫిబ్రవరి 27 నుంచి ఆమెకు అశ్లీల సందేశాలు, దర్శన్‌ను విడిచి పెట్టాలని హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. అదే అతని ప్రాణాలకు ముప్పు తీసుకువచ్చింది.


నిద్రపోని దర్శన్‌..

పోలీసు కస్టడీకి నిందితులను అప్పగించిన అనంతరం వారందరినీ కామాక్షిపాళ్య ఠాణాకు తరలించారు. అక్కడి సెల్‌లలో వారిని ఉంచి, ఇడ్లీ, జ్యూస్‌ ఇచ్చారు. రాత్రి పొద్దు పోయాక నిందితులకు ఒక హోటల్‌ నుంచి బిర్యానీ తెచ్చి ఇవ్వడం వివాదానికి కారణమైంది. దర్శన్‌కు మాత్రం కార్పెట్, దిండు దుప్పటి ఇచ్చారు. అయితే పొద్దుపోయే వరకు నిద్రపోలేదు. పవిత్రా గౌడను సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉంచారు. తనకు సిగరెట్టు ఇవ్వాలని పోలీసులను దర్శన్‌ పలుసార్లు వేడుకున్నాడు. హత్య సమయంలో ఉపయోగించిన కారు.. మృతదేహాన్ని తరలించేందుకూ వినియోగించారు. రేణుకాస్వామి మర్మావయవంపై తన్నడంతోనే అతను మరణించాడని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అక్కడే మద్యం సీసాలు, మహిళలు వినియోగించే వ్యానిటీ బ్యాగ్‌ను పోలీసులు జప్తు చేసుకున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్‌ తమకు ఆఫర్‌ ఇచ్చాడని ముగ్గురు నిందితులు నోరు విప్పారు. హత్యకు సహకరించిన మరో నలుగురిని బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేయగా, ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 17కు చేరుకుంది. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని గుర్తించారు. 


కట్టుదిట్టమైన భద్రత 

ర్శన్‌ నివాసంతో పాటు, ఆయనను విచారిస్తున్న స్టేషన్‌ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అన్నపూర్ణేశ్వరి నగర ఠాణా, పట్టణగెరెలోని షెడ్డు, మృతదేహం లభించిన ప్రాంతాలను నగర కొత్వాలు దయానంద్‌ బుధవారం పరిశీలించారు. దర్శన్‌పై అపహరణ, హత్య, సాక్ష్యాలను నాశనం చేసిన కేసులు నమోదయ్యాయి. హత్యను తమపై వేసుకునేందుకు దీపక్, నిఖిల్‌ నాయక్, కేశవమూర్తి, కార్తిక్, రాఘవేంద్రలకు తలా రూ.5 లక్షలు ఇచ్చారని గుర్తించారు. మొదట వారే గిరినగర ఠాణాకు వెళ్లి లొంగిపోయారు. నగదు లావాదేవీల విషయంలో హత్య చేశామని చెప్పారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా దర్శన్, పవిత్రా గౌడ పాత్రను వారు చెప్పినట్లు సమాచారం.


నా బిడ్డకు దిక్కెవరు?

చిత్రదుర్గం : చలన చిత్రనటుడు దర్శన్, అతని అనుచరుల చేతిలో కడతేరిన చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి భార్య సహనా గర్భిణి. ఆయన చనిపోయిన విషయం కుటుంబ సభ్యులు నిగూఢంగా ఉంచారు. మృతదేహం మరో గంటలో ఇక్కడికి చేరుకునే సమయానికి ఆమెకు వాస్తవం చెప్పక తప్పిందికాదు. సోమవారం ఆయన మరణాన్ని పోలీసులు వెల్లడించారు. మంగళవారం శవపంచనామా అనంతరం సాయంత్రానికి బెంగళూరు నుంచి ఇక్కడికి తరలించారు. మరో గంటలో ఇంటికి చేరే సమయలో సహనాకు- రాత్రి ఎనిమిది గంటలకు ఆ విషయం చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయారు. భర్త మృతదేహంపై పడి వెక్కివెక్కి ఏడ్చింది. కడుపులోని బిడ్డ పుట్టాక.. చూడటానికైనా రావాలంటూ పొర్లిపొర్లి మొక్కింది. అక్కడి వారికి ఈ ఘట్టం కంట తడి పెట్టించింది. 

మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వీరశైవ లింగాయత సంప్రదాయం ప్రకారం రేణుకాస్వామి అంత్యక్రియలు పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దర్శన్‌ నా భర్తను చంపారు. ఆ కేసులో దర్శన్‌ను కాపాడటానికి చాలా మందే ఉన్నారు. నాకు పెళ్లై ఏడాదైంది. కడుపులో బిడ్డ కదులుతోంది. ఆ బిడ్డకు.. నాకు రక్షణ ఎవరు?’ అంటూ సహనా బుధవారం విలేకరుల వద్ద కన్నీరు మున్నీరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని