ఫోన్‌ ట్యాపింగ్‌ బాధ్యులకు కటకటాలే

ఫోన్‌ ట్యాపింగ్‌కు కారణమైన మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులు, రాజకీయ నేతలు కటకటాల్లోకి వెళ్లక తప్పదని పర్యాటక, ఆబ్కారీ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Updated : 13 Jun 2024 05:56 IST

ఆబ్కారీ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు

విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు 

అచ్చంపేట న్యూటౌన్, న్యూస్‌టుడే : ఫోన్‌ ట్యాపింగ్‌కు కారణమైన మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులు, రాజకీయ నేతలు కటకటాల్లోకి వెళ్లక తప్పదని పర్యాటక, ఆబ్కారీ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో డా.మల్లురవి విజయం సాధించడంతో బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే ప్రజా భవన్‌ నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రికి ఐఎన్‌టియుసి విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన భారాస నేతలు తెలంగాణకు రూ.8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.60 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి, కెఎల్‌ఐ, అచ్చంపేట ఎత్తి పోతల పథకాలను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తామన్నారు. ఆగస్టు 15 లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసానిచ్చారు. ఆరు గ్యారంటీలను ప్రణాళిక ప్రకారం పారదర్శకంగా అమలు చేస్తామని,  వృద్ధాప్య, దివ్యాంగుల పింఛను అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. పార్లమెంట్‌ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు చొరవ తీసుకుంటానని తెలిపారు. అచ్చంపేట, కొల్లాపూర్, గద్వాలకు జాతీయ రహదారులు, మద్దిమడుగు వద్ద వంతెన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాననారు.  నేతలు మోపతయ్య, రాజేందర్, శ్రీనువాసులు, మధుకర్‌రెడ్డి, శారదమ్మ పాల్గొన్నారు. 

నాణ్యమైన విద్యను అందించాలి 

కందనూలు, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఎంపీ డా. మల్లురవి సూచించారు. ఆచార్య జయశంకర్‌ బడి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం గగ్గలపల్లిలోని ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తాడూరు జడ్పీటీసీ రోహిణి, తెల్కపల్లి జడ్పీటీసీ సుమిత్ర, నాయకులు నాగేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని