మంత్రి పదవి కోసం మంత్రాంగం

సార్వత్రిక, శాసనసభ ఎన్నికలు ముగియడంతో రేవంత్‌ సర్కారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ పరిస్థితిని ఆరా తీస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తామనుకున్న ఎంపీ సీటు ఓడిపోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది.

Updated : 13 Jun 2024 05:19 IST

అర్హులపై ఆరా తీస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం
ఈటీవీ - ఆదిలాబాద్‌

సార్వత్రిక, శాసనసభ ఎన్నికలు ముగియడంతో రేవంత్‌ సర్కారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ పరిస్థితిని ఆరా తీస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తామనుకున్న ఎంపీ సీటు ఓడిపోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని శ్రేణులను సమన్వయంతో ఏకతాటిపై నడిపించాలంటే మంత్రి పదవి కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ పదవి ఎవరికి ఇవ్వాలి? ఏ ప్రాతిపదికన ఇవ్వాలనేది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

పీఎస్‌ఆర్‌ వర్సెస్‌ గడ్డం బ్రదర్స్‌

మంత్రి పదవి కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, గడ్డం సోదరుల మధ్య పోటీ నెలకొంది. ఇరువర్గాల మధ్య మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది కీలకంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల్లో ప్రేంసాగర్‌రావు, గడ్డం సోదరుల మధ్యే పోటీ ఉంది. ఒక వేళ మధ్యస్థంగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చినా పార్టీ పెద్దల నుంచి సానుకూలత రానట్లు తెలిసింది. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రేంసాగరావుకు మంత్రి పదవి కోసం  పార్టీలోని ఓ వర్గం పట్టుపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు 23 జిల్లా పరిషత్‌ పాలకవర్గాలను ఆ పార్టే కైవసం చేసుకుంది. అప్పట్లో ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికైన రమేష్‌ రాఠోడ్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి కౌటాల జడ్పీటీసీ సభ్యుడు సిడాం గణపతిని జడ్పీ ఛైర్మన్‌గా చేసి కాంగ్రెస్‌ ఖాతాలో వేయటం కోసం అప్పటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఛైర్మన్‌గా ఉన్న ప్రేంసాగర్‌రావు కృషి చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్‌ను వీడకపోవడం ఆయనకు కలసివస్తోంది.  దిల్లీస్థాయిలో మంత్రాంగం నడుపుతున్న గడ్డం సోదరుల ప్రాధాన్యాన్నిసైతం అధిష్ఠానం దృష్టిలో పెట్టుకుంటోంది. వేరే పార్టీల్లోకి వెళ్లి తిరిగి సొంత గూటికి చేరినా శాసనసభ ఎన్నికల్లో ఒకరికి చెన్నూరు, మరొకరికి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో వివేక్‌ తనయుడు వంశీకృష్ణకు ఎంపీ టికెట్‌ ఇచ్చిన అంశం చర్చకు వస్తోంది. దాంతో వారికి మళ్లీ మంత్రి పదవి ఇవ్వాలనడాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. వివేక్‌ సోదరులిద్దరి ప్రభావం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉంటే, ప్రేంసాగర్‌రావు ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై ఉంటుందనే భావన పార్టీలో ఉంది. ఇటీవల ఉమ్మడి జిల్లా ఎన్నికల బాధ్యతలకు ప్రేంసాగర్‌రావులాంటి వ్యక్తులు దూరంగా ఉండటంతోనే శ్రేణులను ఏకతాటిపై నడిపించటంలో కొంత సమన్వయ లోపం తలెత్తినట్లు పార్టీ అంతర్గత సమీక్షలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ పరిస్థితిపై అభిప్రాయ సేకరణ

ఉమ్మడి జిల్లాలో పార్టీ పట్టు సాధించాలంటే ఏం చేయాలనేదానిపై అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆరా తీస్తోంది. జిల్లా, నియోజకవర్గం, మండలాలస్థాయిల్లో పార్టీ కోసం అంకితభావంతో పని చేసే వారికి వెన్నుదన్నుగా నిలవాలని భావిస్తోంది. అందరిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే నేతలు ఎవరనే దానిపై అంతర్గతంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు