ప్రాణాలు హరిస్తున్న పెయిన్‌ కిల్లర్స్‌

నేటి ఆధునిక ప్రపంచంలో 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ప్రతిరోజూ ఒకింత భయంతోనే గడపాల్సి వస్తోంది.

Updated : 18 Jun 2024 06:43 IST

మత్తు కోసం నొప్పి నివారణ మాత్రల వాడకం
బానిసలవుతున్న యువత
అధికమవుతున్న అత్యాచార ఘటనలు

న్యూస్‌టుడే, సైదాపేట: నేటి ఆధునిక ప్రపంచంలో 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ప్రతిరోజూ ఒకింత భయంతోనే గడపాల్సి వస్తోంది. అంతలా బాలబాలికలపై నేర ఘటనలు పెరుగుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాల,  ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగొచ్చే వరకు ఒకరకమైన భయంతోనే తల్లిదండ్రులు ఉండే పరిస్థితి నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో తెలియని వ్యక్తులతో చాటింగ్‌ చేయడం, వారికి ఫొటోలు షేర్‌ చేయడం వంటివి హెచ్చుమీరుతున్నాయి. దీంతో పలు సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.  

 కొత్త రకం పైత్యం

ఇదిలా ఉండగా ప్రస్తుతం చిన్న వయసులోనే యువత మత్తుపదార్థాలకు బానిసలవుతున్నారు. మొదట బీరుతో ప్రారంభించి తర్వాత ఆల్కహాల్, గంజాయి, మత్తు మాత్రలు తదితర వ్యసనాలను అలవరుచుకుంటున్నారు. ఇటీవలి కాలంగా నొప్పి నివారణ మాత్రలు (పెయిన్‌ కిల్లర్‌) టాబ్లెట్స్‌ నీటిలో కలుపుకుని శరీరంలోకి ఎక్కించుకునే కొత్త రకం వ్యసనానికి యువత అలవాటుపడ్డారు. ఈ మాత్రలు రూ.50 నుంచి రూ.200 లోపు లభిస్తుండటంతో మద్యం కంటే వీటికి ఎక్కువ బానిసలవుతున్నట్లు సమాచారం. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు తర్వాత వ్యసనంగా మారి చివరికి ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది. ఉత్తర చెన్నైలో ఇంతవరకు నొప్పి నివారణ మాత్రలు ఉపయోగించిన 11 మంది మృతి చెందారు. వీరంతా 16 నుంచి 22 ఏళ్లలోపు వారు కావటం గమనార్హం. ఈ సమస్య పెద్దదవడంతో ఈ మాత్రలు విక్రయించేవారిపై పోలీసులు నిఘా ఉంచారు. దొరికిన వారిని అరెస్టు చేసి జైలులో పెడుతున్నారు. మాత్రలు తీసుకుని ఎవరైనా మృతి చెందితే అందుకు మాత్రలు అమ్మినవారే బాధ్యులని హెచ్చరిస్తున్నారు. 

బందీలవుతున్న బాలికలు

చెన్నైలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఇప్పటివరకు యుక్త వయసు యువకులు ఎక్కువగా మత్తు మాత్రలు ఉపయోగించగా ప్రస్తుతం అమ్మాయిలూ వాడటం ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల 10వ తేదీ పుళల్‌ ఆల్‌ ఉమెన్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ కేసులో.. ఏడాది క్రితం ఓ బాలిక అదృశ్యమైంది. ఆమెను పోలీసులు కనిపెట్టగా ఆమె నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా ఉపయోగించి ఏడాది కాలంగా పలువురు మగ స్నేహితులతో సన్నిహితంగా ఉండి గర్భం దాల్చినట్లు తెలిసింది. దీంతో ఇంటి నుంచి తల్లిదండ్రులు తరిమేసినట్లు తేలింది. గర్భానికి కారణం ఎవరనేది కూడా మత్తులో బాధితురాలికి తెలియకపోవడం విచారకరం. అలాగే గత నెల 9న తండయార్‌పేటకు చెందిన 16 ఏళ్ల బాలిక ఓ ఫిర్యాదు చేసింది. అందులో.. తన ముగ్గురు స్నేహితురాళ్లు ఒక మాత్ర ఇచ్చారని, దాన్ని వేసుకుని మైకం కమ్మిన తర్వాత ఓ వ్యక్తితో తప్పు చేసేలా చేశారని తెలిపింది. నెల రోజులు మాత్రలు వేసుకుని అతనితో గడిపినట్లు, తన తండ్రి ఫిర్యాదుతో పోలీసులు తనను కాపాడినట్లు పేర్కొంది. తన స్నేహితురాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే కొన్ని రోజుల క్రితం 16 ఏళ్ల బాలిక కీళ్‌పాక్కం ఆస్పత్రిలో ప్రసవించింది. గర్భానికి కారణమెవరని ప్రశ్నించగా ఏమో తెలియదని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా యువకుడిని పోలీసులు గుర్తించారు. అతను ఇచ్చిన మత్తు ఇంజక్షన్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన కేసులో ప్రస్తుతం పుళల్‌ జైలులో ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల నిఘా

చెన్నై వంటి మెట్రో నగరాల్లో బాలికలు డ్రగ్స్‌ తీసుకోవడం కొత్త కాకపోయినా ఈ మూడు కేసులు కాస్త ప్రత్యేకం. ఈ కేసుల్లో లైంగిక వేధింపులు ఉండటంతో పోలీసులు నిఘా పెట్టారు. ఇలాంటి కేసులు అధికమవకుండా ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని