రేణుకాస్వామి కేసులో కొత్త మలుపులెన్నెన్నో

చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈకేసులో సినీనటుడు దర్శన్‌ ఇప్పటికే పోలీస్‌ కస్టడీలో విచారణ ఎదుర్కొంటుండగా.. నటి పవిత్రాగౌడ మేనేజరు దేవరాజ్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు

Updated : 18 Jun 2024 08:33 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈకేసులో సినీనటుడు దర్శన్‌ ఇప్పటికే పోలీస్‌ కస్టడీలో విచారణ ఎదుర్కొంటుండగా.. నటి పవిత్రాగౌడ మేనేజరు దేవరాజ్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు ముందే రేణుకాస్వామి మెడలో ఉన్న బంగారు గొలుసును దుండగులు దోచుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని అరెస్టు చేయగా.. దేవరాజ్‌ను ఆదివారం రాత్రి అన్నపూణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. స్వామిని ఓ షెడ్డులో హత్య చేయగా.. పవిత్రాతో కలసి దేవరాజ్‌ అక్కడికి వెళ్లాడని గుర్తించారు. ఆ కారణంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్శన్‌ ఆప్తుడు- సినీనటుడు చిక్కణ్ణకూ తాఖీదులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌నగరలో పవిత్రాగౌడ ఇంటిలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. పోలీసులు అందించిన తాజా సమాచారం ప్రకారం.. చిత్రదుర్గం నుంచి స్వామిని బెంగళూరులోని షెడ్డుకు తరలించిన వెంటనే పవిత్ర ఆ ప్రాంతానికి చేరుకుంది. ఆ వ్యక్తిపై కోపంతో దాడికి దిగింది. క్షమించాలని కాళ్లపై పడి ప్రాధేయపడినా కనికరించకపోగా పాదరక్షతో మళ్లీ దాడిచేసింది. ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తులు, పాదరక్షలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు. నిందితులకు చెందిన పది సెల్‌ఫోన్లలో వివరాలు పరిశీలిస్తున్నారు. దాడి సమయంలో స్వామి మెడలోని బంగారు గొలుసును ఓ నిందితుడు చేజిక్కించుకున్నాడని మరో నిందితుడు రవి చెప్పినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీస్‌ బృందంలోని సీఐ గిరీశ్‌నాయక్‌ తొలుత ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లినా.. ప్రభుత్వం మళ్లీ ఇదే బృందంలో సభ్యుడిగా చేర్చడం సోమవారం నాటి పరిణామం. దర్యాప్తు బృందానికి విజయనగర ఏసీపీ చందన్‌ నేతృత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం గిరీశ్‌నాయక్‌ కీలక భూమిక పోషించనున్నారు.

హోటల్లో మహజరు 

బెంగళూరు (యలహంక) : రేణుకాస్వామి హత్యకు ముందు రాజరాజేశ్వరీనగరలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో దర్శన్, అతడి అనుచరులు విందు పార్టీ చేసుకున్నట్లు గుర్తించి సోమవారం అక్కడ తనిఖీ చేశారు. దర్శన్‌తో పాటు చిక్కణ్ణను ఆ రెస్టారెంట్‌కు తీసుకొచ్చి మహజరు నిర్వహించారు. విచారణ నోటీసులు అందుకున్న చిక్కణ్ణ ఆగమేఘాలపై ఠాణాకు చేరుకుని అధికారులకు సహకరించాడు. రెస్టారెంట్లో పార్టీకి చిక్కణ్ణ హాజరు వివరాలను సేకరించారు.

  • రేణుకాస్వామికి చెందిన సెల్‌ఫోన్‌ను సుమనహళ్లి వంతెన వద్ద కాలువలో పడేశారని గుర్తించారు. దాని కోసం ప్రస్తుతం శోధిస్తున్నారు. అక్కడికి సమీపంలోని సత్యఅనుగ్రహ లేఔట్‌ వద్ద ఆయన మృతదేహాన్ని పడివేశారు. ఈ వ్యవహారానికి సహకరించిన నిందితుడు వినయ్‌ను కాలువ వద్దకు తీసుకొచ్చి బెంగళూరు పాలికె పారిశుద్ధ్య కార్మికుల సాయంతో సెల్‌ఫోన్‌ కోసం సాయంత్రం వరకు గాలించినా ప్రయోజనం కనిపించలేదు.

ఎవరినీ రక్షించం..

పరమేశ్వర్‌

బెంగళూరు (సదాశివనగర) : నేరగాడు ఎవరైనా.. వారిని రక్షించే ప్రయత్నాన్ని ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చేయరని హోం మంత్రి డాక్టర్‌ పరమేశ్వర్‌ స్పష్టం చేశారు. హత్య కేసు ఆరోపణలతో అరెస్టయిన నటులు పవిత్రాగౌడ, దర్శన్‌లకు పోలీసులు ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదన్నారు. నిందితుల విషయంలో ఎవరూ మృదు ధోరణి అనుసరించరని తెలిపారు. దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో పోలీసులే స్పష్టం చేయవలసి ఉంటుందన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుందామని ప్రయత్నిస్తే ఇటువంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని ఆయన వివరించారు.


ప్రాణం వీడిన దర్శన్‌ అభిమాని

 

 భైరేశ్‌  

రామనగర, న్యూస్‌టుడే : తన అభిమాన నటుడు హత్య చేసిన ఆరోపణలపై అరెస్టు కావడంతో ఆవేదనకు లోనైన భైరేశ్‌ (38) అనే అభిమాని బలనవ్మరణానికి పాల్పడ్డాడు. చెన్నపట్టణ తాలూకా, మాళెదొడ్డి గ్రామానికి చెందిన అతను గత గురువారం నుంచి ఆహార, పానీయాలు తీసుకోవడం నిలిపి వేశాడు. సత్తువ లేక మురుగుకాలువలో పడి మళ్లీ పైకి లేవలేదు. సోమవారం ఉదయం అతని మృతదేహాన్ని వెలికి తీసి, మరణోత్తర పరీక్ష నిమిత్తం చెన్నపట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అటవీ శాఖ కేసు..

మైసూరు : మైసూరు జిల్లా టి.నరసీపురలోని తన ఫారంహౌస్‌లో అనుమతి లేకుండా ‘బార్‌హెడ్‌’ జాతి బాతులను పెంచుతున్న నటుడు దర్శన్‌పై అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విచారణకు హాజరు కావాలని ఐదుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో దర్శన్‌ (ఏ3), అతని ఫాంహౌస్‌ మేనేజరు నాగరాజ్‌ (ఏ2), భార్య విజయలక్ష్మి (ఏ1)లపై కేసు నమోదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని