‘భగీరథ’ ఇంటింటికీ చేరుతోందా?

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.వేల కోట్లు వెచ్చించింది.

Updated : 18 Jun 2024 06:14 IST

గ్రామాలలో ప్రత్యేక సర్వే

తుర్కపల్లిలో సర్వే చేస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి అర్బన్‌: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.వేల కోట్లు వెచ్చించింది. జిల్లాలో ప్రభుత్వం ఆశించిన మేర మిషన్‌ భగీరథ నీరు సరఫరా కాలేదు. పూర్తికాని పైప్‌లైన్ల కారణంగా కొన్నిచోట్ల, పైప్‌లైన్‌ల లీకేజీలతో మరికొన్ని చోట్ల అంతరాయం కల్గుతోంది. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో పథకం అమలు తీరుపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

వివరాల నమోదుకు యాప్‌

తాగునీటి సరఫరా ఎలా ఉంది? అనే అంశంపై పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తున్నారు. జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో ప్రైవేటు ఆపరేటర్లను సైతం నియమిస్తున్నారు. సర్వేలో భాగంగా గ్రామాల్లో పైప్‌లైన్‌లు సక్రమంగా ఉన్నాయా? ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు చేరుతోందా? ఎన్ని ఇళ్లకు కనెక్షన్లు ఉన్నాయి? ఇంకా ఎన్ని ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు సేకరించిన వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తున్నారు.

సరఫరా మెరుగే లక్ష్యంగా..

జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్కరికి వంద లీటర్ల చొప్పున ప్రతి ఇంటికీ నిత్యం 400 లీటర్ల నీటిని పంపిణీ చేయాలన్నది మిషన్‌ భగీరథ లక్ష్యం. క్షేత్రస్థాయిలో అమలులోని లోపాలు కొత్త ప్రభుత్వం దృష్టికి రావడంతో సర్వేకు ఆదేశించారు. సర్వే నివేదిక ఆధారంగా తాగునీటి సరఫరా మెరుగుకు కార్యాచరణ రూపొందించనున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. 

జిల్లాలో గ్రామ పంచాయతీలు: 647
కుటుంబాలు: 2,41,773
సర్వే పూర్తయిన కుటుంబాలు: 48,739 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని