తవ్వకాల్లో అక్రమార్కులు.. చోద్యం చూస్తున్న అధికారులు!

అసైన్డు భూముల్లో అక్రమంగా మట్టి, మొరం తవ్వకాలు జరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రైతులకు ప్రభుత్వం వీటిని కేటాయించింది. అయితే సాగుకు యోగ్యంగా లేవని వృథాగా ఉంచడంతో  అక్రమార్కుల కన్ను వాటిపై పడింది.

Updated : 18 Jun 2024 06:14 IST

మాఢాపూర్‌ తవ్వకాలతో ఏర్పడిన గుంతలు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: అసైన్డు భూముల్లో అక్రమంగా మట్టి, మొరం తవ్వకాలు జరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రైతులకు ప్రభుత్వం వీటిని కేటాయించింది. అయితే సాగుకు యోగ్యంగా లేవని వృథాగా ఉంచడంతో  అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. అయినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. నర్సాపూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. మాఢాపూర్‌ సూర్యాతండాకు సమీపంలోని అసైన్డు భూముల్లో కొందరు దర్జాగా మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతూ టిప్పర్లలో హత్నూర మండలం మంగాపూర్‌ సమీపంలోని వెంచర్లకు తరలిస్తున్నారు. గతంలోనూ కొన్ని ఫౌంహౌజ్‌లకు మట్టిని ఇక్కడి నుంచే తరలించారు. ఎవరికి అవసరం ఉన్నా, ఇక్కడే తవ్వకాలు చేపడుతూ తరలించేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఉన్నా,  క్షేత్ర స్థాయికి వెళ్లేంత సమయం లేదంటూ తప్పించుకుంటున్నారు. పట్టణం శివార్లలోని హన్మంతాపూర్‌ సమీపంలోనూ అసైన్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు పునాదులు నింపేందుకు పొలాలకు ఇదే మట్టిని తరలిస్తున్నారు. రూ.లక్షలు ఆర్జిస్తున్నా నయాపైసా ప్రభుత్వానికి చెల్లించడం లేదు. నర్సాపూర్‌కు కూతవేటు దూరంలోనే రాత్రి, పగలు తవ్వకాలతో ఎత్తయిన గుట్టలు కరిగిపోతున్నాయి. ఈవిషయాన్ని ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని