అందినకాడికి దండుకో..

ఇది కేవలం ఒక పాఠశాలకు సంబంధించిన అంశం కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు, ట్యూషన్, బస్సు ఫీజులు, బూట్లు తదితరాల ధరలు అమాంతం పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు.

Published : 18 Jun 2024 08:35 IST

దుస్తులు, పుస్తకాల పేరిట ప్రైవేటు బడుల్లో వసూళ్లు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం: ఇది కేవలం ఒక పాఠశాలకు సంబంధించిన అంశం కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు, ట్యూషన్, బస్సు ఫీజులు, బూట్లు తదితరాల ధరలు అమాంతం పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. బయట మార్కెట్‌లో కొనుగోలు చేస్తామంటే కుదరదని నిబంధనలు పెడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో పుస్తకాలు, ఏకరూప దుస్తులు విక్రయించొద్దని స్పష్టం చేసింది. జిల్లా అధికారులు సైతం ప్రకటనలు విడుదల చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ధరల్లో భారీగా  తేడా..

బయట మార్కెట్లో దొరికే వస్తువుల ధరలకు పాఠశాలల్లో లభించే వాటికి వ్యత్యాసం భారీగా ఉంటోంది. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు పుస్తకాలు, టై, బెల్టులు, బూట్లు, ఏకరూప దుస్తులు, బ్యాడ్జీలు, గుర్తింపు కార్డులు, బ్యాగులు, కవర్లు, పెన్నులు, పెన్సిళ్లు తదితర సామగ్రి కొనుగోలుకు రూ.4,500 నుంచి రూ.13 వేల వరకు ఖర్చవుతోంది. కొన్ని పాఠశాలల్లోనే విక్రయాలు జరుపుతుండగా మరికొన్ని చోట్ల ప్రత్యేక విక్రయశాలలు, పుస్తక విక్రయ కేంద్రాలతో ఒప్పందం చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. 

రూ.వేలల్లో  ఫీజులు.. 

ఏకరూప, ప్రత్యేక వారాల్లో వేసే దుస్తులు మొదలైన సామగ్రికి రూ.వేలు వసూలు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు ధరల్లో రూ.500 నుంచి రూ.4,000 వరకు వ్యత్యాసం ఉంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో విక్రయించే పాఠ్యపుస్తకాలు ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రాథమిక స్థాయితో పోల్చుకుంటే ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఖర్చు కాస్త తక్కువగా అవుతోంది. ప్రాథమికోన్నత స్థాయిలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను తప్పనిసరి చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ తరగతుల వారికి ఐఐటీ, నీట్‌ తరగతుల పేరుతో మరింత దండుకుంటున్నారు. నిజానికి ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాల పుస్తకాలనే బోధించాలి. కానీ ఏడో తరగతి వరకు పాఠశాలకు సంబంధించిన సిలబస్‌తోనే తరగతులు కొనసాగిస్తున్నారు.

జీవో నం.1కి తిలోదకాలు

విద్యాశాఖలో జీవో నం.1కి ప్రాముఖ్యం ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి విక్రయాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. బహిరంగ మార్కెటులో దొరికే పుస్తకాలు అమ్మాలని.. దుస్తులు, ఇతర సామగ్రి అమ్మరాదని స్పష్టమైన నిబంధనలున్నాయి. ఒకవేళ పుస్తకాలు అమ్మితే బహిరంగ మార్కెటు కంటే ఎక్కువ ధరకు ఎట్టి పరిస్థితులలోనూ విక్రయించవద్దని ఉత్తర్వు చెబుతోంది. ఐతే ఈ జీవోకు ప్రైవేటు పాఠశాలలు తిలోదకాలిచ్చాయి. బయటి మార్కెట్లో దొరకని పుస్తకాలు, ఇతర సామగ్రిని ఎంచుకొని దోపిడీకి పాల్పడుతున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న పాఠ్య పుస్తకాలు రెండో తరగతికి సంబంధించినవి. న్యాల్‌కల్‌ రోడ్డు సమీపంలోని ప్రైవేటు పాఠశాలలోని ఓ గదిలో పెట్టి యథేచ్ఛగా విక్రయిస్తున్నారని, బడిలో చదివే విద్యార్థులంతా ఆ పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేస్తుందని విద్యార్థి తండ్రి సోమవారం ‘న్యూస్‌టుడే’కు ఫిర్యాదు చేశారు. రెండో తరగతి చదివే తమ బాబుకి ఐదు పుస్తకాలిచ్చి రూ.2149 వసూలు చేస్తున్నారని వాపోయారు. బయట ఎక్కడా ఇవి దొరకవని, ఇక్కడే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం

దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్‌

పాఠశాల ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో పుస్తకాలు, ఇతరత్రా వస్తువులు విక్రయించరాదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదు. రాతపూర్వకంగా బడుల్లో జరుగుతున్న వ్యాపారంపై ఫిర్యాదు చేస్తే తప్పనిసరి కఠిన చర్యలు తీసుకుంటాం.

జిల్లాలో మొత్తం ప్రైవేటు పాఠశాలలు  :472

చదువుతున్న విద్యార్థులు : 1,55,004 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని