వయోపరిమితి పెంపు... పెరగనున్న ప్రయోజనం

సింగరేణిలో వయోపరిమితి పెంపుతో వారసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి వ్యాప్తంగా 300 మందికి పైగా వారసులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది.

Updated : 18 Jun 2024 06:07 IST

యువ కార్మికులు

న్యూస్‌టుడే, గోదావరిఖని: సింగరేణిలో వయోపరిమితి పెంపుతో వారసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి వ్యాప్తంగా 300 మందికి పైగా వారసులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. 2018, మార్చి 9 నుంచి పెంచిన వయోపరిమితిని అమలు చేసేందుకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరణించిన, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ పొందిన కార్మికుల వారసులకు ఉద్యోగం వరించే అవకాశం లభించింది. 35 ఏళ్లు దాటిన వారిని అనర్హులుగా ప్రకటించడంతో వారికి ఉద్యోగం ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. దీంతో చాలా మంది ఉద్యోగానికి బదులు ఏకమొత్తం కింద రూ.25 లక్షలు తీసుకున్నారు. కొంత మంది కుమారులకు కాకుండా అర్హులైన ఇతరులను ఉద్యోగాల్లో పెట్టించారు. కేవలం ఒకే ఒక వారసుడు ఉన్న వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి అవకాశం కల్పించాలని యాజమాన్యంతో అనేకసార్లు చర్చించారు. కార్మిక సంఘాలు కూడా ఇదే విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి. ఇటీవల వారసత్వ ఉద్యోగ నియామక పత్రాలను హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా అందజేస్తున్న కార్యక్రమంలో పలువురు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అక్కడే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చిన మేరకు సోమవారం దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశారు.

300 మందికి పైగా లబ్ధి : ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా 300 మందికి పైగా వారసులు వయో పరిమితికి మించి వయసు ఉండటంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 35 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పించాలని కోరిన మేరకు యాజమాన్యం సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా సమయంలో రెండు సంవత్సరాల వరకు మెడికల్‌ బోర్డు నిర్వహించలేదు. అంతకంటే ముందు నుంచి కూడా ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. గని ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల వారసులు, మెడికల్‌ బోర్డు ద్వారా అనారోగ్య కారణాలతో మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ అర్హత 35 ఏళ్లుగా నిర్ణయించారు. దీంతో కొంత మందికి వర్తించలేదు. సింగరేణిలో 2018 నుంచి మెడికల్‌ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంతో ఉన్న కార్మికులు, ఉద్యోగులకు వారసత్వ ఉద్యోగం కల్పించుకునే హక్కును కల్పించారు. ఇప్పటి వరకు సుమారు 16 వేల మంది వరకు వారసులు ఈ ప్రక్రియ ద్వారా ఉద్యోగంలో చేరారు. కేవలం 35 ఏళ్లు దాటిన కొంత మంది వారసులకు మాత్రం అవకాశం లేకుండా పోయింది. తాజాగా విడుదల చేసిన వయో పరిమితి పెంపు ఆదేశాలతో 300 మందికి పైగా ప్రయోజనం చేకూరే అవకాశం ఏర్పడింది.

అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి

-బలరాం, సీఎండీ

కొత్తగా విడుదల చేసిన ఆదేశాల మేరకు అర్హులైన వారసులు వారి వారి గనులు, విభాగాల్లో దరఖాస్తు చేసుకోవాలి. 2018 మార్చి 9 నుంచి పెంచిన వయో పరిమితి 40 ఏళ్లు వర్తిస్తుంది. ఇది వరకే ఉద్యోగానికి బదులు ఏక మొత్తం డబ్బులు తీసుకున్న వారికి అవకాశం లేదు. కేవలం 35 ఏళ్ల వయో పరిమితి కారణంగా ఉద్యోగ నియామకం నిలిపివేసి, ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు