పడేశారా? పడిపోయాయా?

అటవీ శాఖ ఆధ్వర్యంలో కలప తరలింపు వ్యవహారం సోమవారం నాటకీయ పరిణామాల మధ్య సాగింది. తరలించింది, దాన్ని అడ్డుకున్నదీ ఆ శాఖ సిబ్బందే కావటం గమనార్హం.

Updated : 18 Jun 2024 06:25 IST

వివాదానికి దారితీసిన కలప తరలింపు వ్యవహారం

టేకు కలప తరలించిన ట్రాక్టర్‌ ఇదే..  

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: అటవీ శాఖ ఆధ్వర్యంలో కలప తరలింపు వ్యవహారం సోమవారం నాటకీయ పరిణామాల మధ్య సాగింది. తరలించింది, దాన్ని అడ్డుకున్నదీ ఆ శాఖ సిబ్బందే కావటం గమనార్హం. నిబంధనలు పాటించకుండా కలపను తరలించటం వివాదానికి దారితీసింది. చిన్న టేకు దుంగను తీసుకెళ్లాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాలని చెప్పే అటవీ శాఖ యంత్రాంగమే పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించటం గమనార్హం.

ట్రాక్టర్‌ అప్పగింత..

ఇల్లెందు మండలం కొమరారం అటవీ రేంజ్‌ కార్యాలయం ఎదుట సోమవారం  తెల్లవారుజామున 5గంటలకు టేకు కలప లోడుతో వస్తున్న ఓ ట్రాక్టర్‌ను సెక్షన్‌ అధికారి సురేష్‌ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దీన్ని కాచనపల్లి అటవీ రేంజ్‌ పరిధిలోని మామకన్ను సెక్షన్‌ పెద్దతోగు బీట్ పరిధి నుంచి బీట్ అధికారి నిర్మల తీసుకొస్తున్నట్టు గుర్తించారు. పెద్దతోగు బీట్ పరిధిలో విండ్‌ఫాల్‌ (గాలివాన)ల కారణంగా పడిపోయిన టేకు చెట్లను డిపోకు తరలిస్తున్నట్టు బీట్‌ అధికారి తెలిపారు. తరలింపులో నిబంధనలు పాటించలేదంటూ కొమరారం అధికారులు అందించిన సమాచారంతో కాచనపల్లి డీఆర్వో సీతారాం ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆయన సమక్షంలో వివరాలు నమోదు చేసుకున్నారు. కలప ట్రాక్టర్‌ను ఇల్లెందు కలప డిపోలో అప్పగించారు.  కాగా కలప తరలింపుపై తనకు బీట్‌ అధికారి సమాచారం ఇవ్వలేదని డీఆర్‌వో సీతారాం చెబుతున్నారు. బీట్‌ అధికారి కలపను ఎక్కడ నుంచి తీసుకొచ్చారో పరిశీలించేందుకు ఆయా లొకేషన్లలో విచారణ జరుపుతామన్నారు. దీనిపై బీట్‌ అధికారి మాట్లాడుతూ అయిదేళ్ల క్రితం విధుల్లో చేరిన తనకు ఇన్‌వాయిస్‌పై పూర్తి స్థాయిలో అవగాహనలేదని, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చే సమయం లేదని చెబుతున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌డీవో వెంకన్నను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పూర్తి స్థాయిలో  విచారణ చేస్తామని ఇప్పటికే కలపకు సంబంధించిన లొకేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. 

అన్నీ అనుమానాలే..

  •  కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (ఏప్రిల్‌) ప్రతి రేంజ్‌   పరిధిలో కలపకు వరుస క్రమంలో నంబర్లు వేస్తారు. సోమవారం డిపోకు తరలిస్తున్నట్టు చెబుతున్న కలపపై వేసిన అంకెలు అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి.
  • ఒక్కో సంవత్సరం ఒక్కో రంగును కలపపై నంబర్లు వేసేందుకు వినియోగిస్తారు.  
  • ఈ ఏడాది వాడే పసుపు రంగుకు బదులు ఎర్ర రంగుతో అంకెలు ఉండటం గమనార్హం.
  • సుమారు రూ.4 లక్షల విలువైన కలపను తరలిస్తున్నప్పుడు ఇన్‌వాయిస్‌ లేదు. కలప వివరాలతో నమోదు చేయాల్సిన ఫారం సీ నిబంధన    బీట్ అధికారి పాటించలేదు. 
  •  గాలివానకు పడిపోయిన కలపకు సంబంధించిన వివరాల సమాచారం తమకు లేదని డీఆర్‌వో, కాచనపల్లి ఎఫ్‌ఆర్‌వో చెబుతున్నారు. క్షేత్ర సిబ్బందికి సమయం లేకుంటే కనీసం ఫోన్‌ ద్వారా అయినా సమాచారం ఇవ్వాలి.
  • లొకేషన్ల పరిశీలన జరగాల్సి ఉన్నా అలాంటి నిబంధన పాటించలేదు. 
  • అర్ధరాత్రి వేళలో తరలించడం వెనక ఉన్న ఆంతర్యం విచారణలోనే తేలాల్సి ఉంది. తరలింపు ప్రదేశం నుంచి ఇల్లెందుకు మూడు గంటల్లో చేరాల్సిన ట్రాక్టర్‌ తొమ్మిది గంటల సుదీర్ఘ ప్రయాణం, అనేక అవాంతరాలు దాటుకుని వస్తూ చివరకు    పట్టుబడటం కొసమెరుపు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని