ఉపాధ్యాయుల్లో అయోమయం

పదోన్నతులు, బదిలీల వ్యవహారం జిల్లాలోని ఉపాధ్యాయులతోనే కాదు జిల్లా విద్యాశాఖ అధికారులతోనూ దోబూచులాడుతోంది.

Updated : 19 Jun 2024 06:22 IST

వెలువడని పదోన్నతుల ఉత్తర్వులు
ఆశగా ఎదురుచూపులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

డీఈవో కార్యాలయంలో శాంపిల్‌ పదోన్నతుల జాబితాను పరిశీలిస్తున్న సిబ్బంది 

పదోన్నతులు, బదిలీల వ్యవహారం జిల్లాలోని ఉపాధ్యాయులతోనే కాదు జిల్లా విద్యాశాఖ అధికారులతోనూ దోబూచులాడుతోంది. నాలుగైదు రోజులుగా పదోన్నతులు కల్పిస్తూ పాఠశాలల్లో నియామక ఉత్తర్వులను వెలువరించడంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిని అసహనానికి గురి చేస్తున్నాయి. మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి.. ఇలా ఎప్పుడైనా ఉత్తర్వులు వెలువడుతున్నాయని సమాచారంతో ఉపాధ్యాయులు, అధికారులు వాటి కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. మరో వైపు సామాజిక మాధ్యమాల్లో కొందరు ఎవరికి వారే పదోన్నతుల ఉత్తర్వులు, కోర్టు కేసుల గురించి పోస్టింగ్‌లు పెడుతుండటంతో మిగిలిన వారిలో ఆందోళన నెలకొంటుంది. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖాకారి కార్యాలయంలో సిబ్బంది శాంపిల్‌ పదోన్నతుల జాబితాను పరిశీలించారు.

ప్రవేశాలు.. బోధనపై ప్రభావం...

పాఠశాలలు ప్రారంభ సమయంలోనే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపడుతుండటంతో జిల్లాలోని  సర్కారు బడుల్లో ప్రవేశాలు, బోధనపై ప్రభావం పడుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 967 మంది ఎస్జీటీలు పని చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో భాషా పండితులు 225 మంది, పీఈటీలు 60 మంది పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది పదోన్నతులు, బదిలీలపై ఇతర పాఠశాలలకు వెళ్లే అవకాశముంది. వారి దృష్టంతా ఈ ప్రక్రియపైనే ఉంది. మరో వైపు ఉన్నత పాఠశాలల్లో బదిలీ అయి రిలీవర్‌ లేక అలానే ఉండిపోయిన 225 మంది స్కూల్‌ అసిస్టెంట్లను రిలీవ్‌ చేయడంతో ఆయా పాఠశాలల్లో బోధనకు కొరత ఏర్పడింది. పాఠశాలల పునఃప్రారంభం సమయంలోనే ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉండటంతో ప్రవేశాలపై ప్రభావం పడుతోంది.

ఏ క్షణమైనా వస్తాయని..

ఏక్షణమైనా పదోన్నతుల నియామకాల ఉత్తర్వులు రాష్ట్ర విద్యాశాఖ నుంచి రావచ్చనే ఆదేశాలతో వాటిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన బృందం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రెండు, మూడు రోజులుగా పడిగాపులు కాస్తోంది. సోమవారం రాత్రంతా వారు కార్యాలయంలో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం వరకు నియామకాల ఉత్తర్వులు వస్తాయని ప్రచారం జరగడంతో ఉపాధ్యాయులు ఆశగా ఎదురుచూసినా ఫలితం లేదు. మంగళవారం అర్ధరాత్రి దాటాక వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. మరో వైపు ఉత్తర్వులు వచ్చే వరకు అనుమానమే అంటూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

బడిబాట అంతంతే...

జిల్లాలోని పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పెంచేందుకు ఈనెల 6 నుంచి బుధవారం వరకు బడి బాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. మొదట్లో ఈ కార్యక్రమం సజావుగా సాగినా చాలా ఏళ్ల అనంతరం పదోన్నతులు పొందుతున్న ఎస్జీటీలు ఆ విషయంపైనే మనసు నిలిపారు. ఉన్నత పాఠశాలల్లో కూడా భాషా పండితులు, పీఈటీల పరిస్థితి కూడా అదే. క్రమేపి బడిబాట అంతంత మాత్రంగానే మారింది. ఇదే షెడ్యూల్‌పైనే జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు దృష్టి సారించడం, వివరాలు సేకరించడంలో నిమగ్నం కావడంతో కార్యక్రమంపై పర్యవేక్షణ కొరవడింది. ఈసారి ఆశించిన మేరకు విద్యార్థుల ప్రవేశాలు జరగలేదనే చర్చ ఉపాధ్యాయుల్లోనే నెలకొంది. బుధవారంతో బడి బాట ముగుస్తుండగా, ఇప్పటి వరకు జిల్లాలో 300 మంది కొత్తగా ప్రవేశాలు పొందినట్లు సమాచారం. పదోన్నతులు, బదిలీల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని