కరుగుతున్న గుట్టలు!

ప్రకృతి సంపద అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించే భారీ ప్రాజెక్టులేవీ లేవు.

Updated : 19 Jun 2024 06:20 IST

అక్రమార్కులకు ఆదాయ వనరుగా ప్రకృతి సంపద

వెంకటాపూర్‌ గుట్టల్లో తవ్వకాలు జరిగిన ప్రాంతం

ప్రకృతి సంపద అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించే భారీ ప్రాజెక్టులేవీ లేవు. గనులశాఖ నుంచి ఎలాంటి అనుమతులివ్వలేదు. అయినా గుట్టల్లో నిరంతరం మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల రాయల్టీకి గండి పడుతోంది. గ్రానైట్, కంకర క్వారీల మాదిరిగానే మట్టి తవ్వకాలకు అనుమతులిచ్చేలా ప్రతిపాదన చేశారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చడం లేదు.

ఈనాడు డిజిటల్, సిరిసిల్ల

జిల్లాలో అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న మట్టి తవ్వకాలతో గుట్టలు కరిగిపోతున్నాయి. వేములవాడ మండలం అగ్రహారం, తెట్టెకుంట, చంద్రగిరి, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, సిరిసిల్ల పట్టణం రగుడు పరిధిలోని గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వుతూ పురపాలికలు, మండల కేంద్రాల్లో విస్తరిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు దూరాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.5 వేలపైనా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. సాధారణ రోజుల్లోనూ తక్కువగా రవాణా జరుగుతుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ గుట్టల్లో నిరంతరాయంగా సాగుతున్న తవ్వకాలతో అందులోని నెమళ్లు గ్రామాలకు వస్తున్నాయి. ఇటీవల పెద్దూరులోకి వచ్చిన నెమలి ఎండవేడిమిని తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు దప్పిక తీర్చడంతో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. తెట్టెకుంట, చంద్రగిరి గుట్టల్లో గతంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గుట్టపై పడిన వర్షపునీరు నిలిచేలా ఉపాధి హామీలో కాంటూరు కందకాలు తవ్వారు. మట్టి తవ్వకాలతో వీటి ఆనవాళ్లేవీ కానరావడం లేదు. ఇక్కడ మట్టి తరలింపునకు ప్రత్యేకంగా ప్రైవేట్‌ చెక్‌పోస్టును ఏర్పాటు చేసుకున్నారు.

అటకెక్కిన అనుమతుల ప్రక్రియ

మట్టి తవ్వకాలకు గతంలో మైనింగ్‌శాఖ ఆన్‌లైన్‌లో అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలు చేశారు. దీని కోసం జిల్లాల వారీగా ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలకు అనువైన స్థలాలను గుర్తించాలని ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. దీనికోసం వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పేజీని రూపొందించారు. అందులో భూమి డీజీపీఎస్‌ సర్వే చిత్రం, ఎమ్మార్వో నుంచి నిరభ్యంతర పత్రం, ఐటీ రిటర్న్‌లు, గనులశాఖ పాత బకాయిలు లేకుండా చూసుకోవాలి. వీటన్నింటితోపాటు రూ.లక్ష చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి అనుమతులు ఇచ్చాక రూ.4 లక్షలు చెల్లించాలి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలు వేటికైనా టన్నుకు ఇంత అని ఒక ధరను నిర్ణయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు అనుమతులు తీసుకునే క్రమంలోనే మట్టి వాడకాన్ని బట్టి సీనరేజీ రూపంలో ప్రభుత్వానికి డబ్బులు జమవుతాయి. తొలుత దీనిపై హడావుడి చేసినా తర్వాత దీని ఊసేలేకుండా పోయింది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

అక్రమ మట్టి తవ్వకాలపై దాడులు చేసి పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నాం. వారి నుంచి పెనాల్టీ వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్నాం. జిల్లాలో మట్టి తవ్వకాలకు ఎలాంటి లీజులు లేవు. మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. మాకు సిబ్బంది కొరతతో రెవెన్యూ, పోలీసుశాఖల సాయం తీసుకుంటాం.   - క్రాంతి కుమార్,
 జిల్లా గనులశాఖ సహాయ సంచాలకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని