దర్శన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

చిత్రదుర్గలోని తన అభిమాని రేణుకాస్వామి (28)ని అపహరించి.. హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్‌ విచారణను పోలీసులు తీవ్రం చేశారు. ఇప్పటి వరకు ప్రశ్నలతోనే సరిపెట్టగా.. ఇప్పుడు తమదైన శైలిలో పోలీసులు విచారణ కొనసాగించారు.

Updated : 19 Jun 2024 09:27 IST

సాంత్వన : నటుడు దర్శన్‌ ముఠా చేతిలో హతమైన రేణుకాస్వామి కుటుంబ సభ్యులను
మంగళవారం చిత్ర దుర్గంలో పరామర్శిస్తున్న హోం మంత్రి డాక్టర్‌ పరమేశ్వర్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : చిత్రదుర్గలోని తన అభిమాని రేణుకాస్వామి (28)ని అపహరించి.. హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్‌ విచారణను పోలీసులు తీవ్రం చేశారు. ఇప్పటి వరకు ప్రశ్నలతోనే సరిపెట్టగా.. ఇప్పుడు తమదైన శైలిలో పోలీసులు విచారణ కొనసాగించారు. తన అభిమానులు ఠాణా వద్దకు వస్తారని, ఎందరో నాయకులు తెలుసంటూ బీరాలు పలికిన ఆయన మాటలను పోలీసులు పట్టించుకోలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి ఇది సినిమా కాదని, నిజజీవితమని హితవు పలికారు. అప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో విచారణ శైలిని మార్చారు. అక్కడితో ఆ కథానాయకుడు తప్పించుకోవడం కుదరదని తెలుసుకున్నాడు. నటి పవిత్రాగౌడను విడిచి పెట్టాలని కోరిన దర్శన్‌.. ఇపుడా డిమాండు పక్కనపెట్టాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 17.. వారిలో సగం మందితో దర్శన్‌కు ముఖ పరిచయం కూడా లేదు. తనకు తెలియకుండానే బాడుగ కారులో రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చిన డ్రైవరు రవి ఈ ఉచ్చులో ఇరుక్కుపోయాడు. మిగిలిన వారిలో ఎక్కువ మంది బాధితుడ్ని వేధించి, చిత్రహింస పెట్టడం, మృతదేహాన్ని తరలించడంలో కీలక పాత్రను పోషించినవారే. గురువారం నాటికి కేసు విచారణను ఒక కొలిక్కి తీసుకువచ్చే దిశగా పోలీసులు విచారణను కొనసాగించారు.

హత్య తరువాత..

రేణుకాస్వామిని ఈ నెల 8న సాయంత్రం హత్య చేసిన తరువాత సాక్ష్యాలను చెరిపివేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీస్‌ అధికారులు వివరించారు. రాజరాజేశ్వరినగరలోని ఒక దుస్తుల దుకాణంలో కొత్త వస్త్రాలు కొనుగోలు చేశారు. హంతకుల్లో ఇద్దరు లక్ష్మణ, నాగరాజు స్థానికంగా ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర గుడికి వెళ్లారు. శవాన్ని పడేశాక ఇతర నిందితులు తమ ఇళ్లకు వెళ్లిపోయారని అధికారుల దర్యాప్తులో తేలింది.

కొత్త చట్టం వస్తోంది

భారతీయ సురక్షా సంహిత పేరిట కొత్త శిక్షా స్మృతి జులై ఒకటి నుంచి అమలులోకి రానుంది. హత్య, అత్యాచారం, సాక్ష్యాల తారుమారు, నేరాన్ని గుట్టుగా ఉంచడం తదితర కేసుల్లో శిక్ష, జరిమానాల స్థాయి పెరగనున్నాయి. డిజిటల్‌ సాక్ష్యాలను న్యాయస్థానాలు ఇకపై పరిగణనలోకి తీసుకోనున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులకు ఇప్పటికే పలు డిజిటల్‌ ఆధారాలు లభించాయి. ఈ చట్టం అమలులోకి వస్తే దర్శన్, ప్రజ్వల్‌ తదితరులకు శిక్షా ప్రమాణం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

నన్నూ బెదిరించారు

నటుడు దర్శన్‌ తనను ‘తగరం’ అంటూ దూషణలకు పాల్పడ్డారని నిర్మాత ఉమాపతి ఆరోపించారు. దర్శన్‌ తనను దూషించిన ఆడియోను ఇప్పుడు తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. నాకు ఎదురు వస్తే నువ్వు భౌతికంగా ఉండవని కూడా ఆయన హెచ్చరించారని ఉమాపతి మంగళవారం బెంగళూరులో ఆరోపించారు. ప్రతిసారీ తనదే పైచేయి అనుకుంటే ఇలాగే జరుగుతుందని దర్శన్‌ను ఉద్దేశించి పోస్టు చేశారు. కేసు విచారణ తీరుతెన్నులు ప్రతి ఒక్కరికీ తెలిసేలా, పారద్శనకతను కాపాడేలా వీడియో తీయించడం, దాన్ని పోలీసు వెబ్‌సైట్‌లో ఉంచవలసిన అవసరం ఉందని నట దర్శకుడు ఉపేంద్ర పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, రేణుకాస్వామి భార్యకు పుట్టబోయే బిడ్డకు చక్కని భవిష్యత్తు కల్పించే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ‘కిచ్చ’ సుదీప్‌ పిలుపునిచ్చారు.

సోదరుడు ఏడీ?

ఒకప్పుడు దర్శన్‌ అనగానే ఆయన సోదరుడు దినకర్‌ గుర్తుకు వచ్చేవాడు. తన సోదరుడ్ని పోలీసులు అరెస్టు చేసినా.. ఆయన ఇప్పుడు బయటకు రాలేదు. తల్లిని, సోదరుడ్ని, ఇతర కుటుంబ సభ్యులను దర్శన్‌ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆయన దూరమయ్యారని సమాచారం. భార్య విజయలక్ష్మిపై పలుసార్లు చేయి చేసుకుని, దూషించినా, భర్త తరఫున వాదించేందుకు ఆమే ప్రస్తుతం న్యాయవాదిని ఏర్పాటు చేయడం కొసమెరుపు!


వేగంగా పోలీస్‌ కదలిక

విలేకరులతో మాట్లాడుతున్న పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : పోలీసులు సకాలంలో.. వేగంగా స్పందించడంతోనే చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసు నిందితులు కటకటాల వెనక్కి వెళ్లారని నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ వెల్లడించారు. సరైన సమయంలో వేగంగా నిర్ణయం తీసుకోకుంటే దర్యాప్తు దారితప్పేదని మంగళవారం ఇక్కడ విలేకరులకు వివరించారు. ఈ కేసులో నటుడు దర్శన్‌తో పాటు 17 మందిని అరెస్టు చేశామన్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సాక్ష్యాలను సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. బెంగళూరు, మైసూరు, చిత్రదుర్గలో దర్యాప్తు సాగిస్తున్నామని తెలిపారు.

రేణుకాస్వామి హత్యకు ముందు ఆర్‌ఆర్‌నగరలో ఓ బార్‌లో దర్శన్‌ బృందం మందు విందు చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ పార్టీకి హాజరైన సినీనటుడు చిక్కణ్ణకు ఇప్పటికే తాఖీదులివ్వగా మరో నటుడు యశస్‌ సూర్యను విచారించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆ పార్టీకి సూర్య హాజరైనట్లు అధికారులు వివరించారు. ఆ పార్టీ ముగిసిన తరువాత హత్యకు కేంద్రమైన పట్టణగెరె షెడ్‌కు దర్శన్‌తో కలసి వారు వెళ్లారా? అనే వివరాలు రాబట్టనున్నారు. షెడ్‌ యజమాని జయణ్ణను విచారించారు. ఆ షెడ్‌ను కిశోర్‌ అనే వ్యక్తికి అద్దెకిచ్చినట్లు జయణ్ణ వివరించాడు. మరోవైపు దర్శన్‌కు చెందిన వ్యవసాయక్షేత్ర మేనేజరు శ్రీధర్‌ (35) అనుమానాస్పదంగా మరణించాడనే విషయం చర్చకు తావిస్తోంది. ఆయన ఆనేకల్‌లో ఏప్రిల్‌ 17న విషం తాగి చనిపోయాడని గుర్తించారు. ఆ ఘటనకు బాధ్యులెవరనే కోణంలో తాజాగా దర్యాప్తు మొదలు కావడం దర్శన్‌కు సంకటప్రాయమే.

సినీనటుడు దర్శన్‌ సెల్‌ఫోన్లో నగరంలోని ప్రముఖ రౌడీషీటర్ల ఫోన్‌ నెంబర్లు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దర్శన్‌ ఎక్కడికి వెళ్లినా ఈ ముఠా వెంటవెళ్లి, అభిమానులను పోగు చేసేవారని, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే బెదిరించేవారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని