పాన్‌కార్డు ఉంటేనే పరిహారం

మత్స్యకారుల ప్రమాద బీమా పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విధించింది. ప్రతి సభ్యుడికి పాన్‌ కార్డుతో పాటు ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది.

Updated : 20 Jun 2024 05:00 IST

‘మత్స్య’ యోజనకు కొత్త మార్గదర్శకాలు

సూర్యాపేట పరిధిలోని చెరువులో చేపలు పడుతున్న మత్స్యకారులు(పాత చిత్రం) 
భానుపురి, న్యూస్‌టుడే: మత్స్యకారుల ప్రమాద బీమా పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విధించింది. ప్రతి సభ్యుడికి పాన్‌ కార్డుతో పాటు ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ప్రమాదవశాత్తు గాయపడిన, మరణించిన వారికి మత్స్యశాఖ నుంచే వచ్చే పరిహారం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాల్సి ఉంది. జిల్లాలోని చాలా మంది మత్స్యకారులకు పాన్‌ కార్డులు, ఆదాయ ధ్రువపత్రాలు లేవు. వీటిని వెంటనే పొందాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇలా చేయాలి..

జిల్లాలోని మత్స్యకారులు సంఘంలో సభ్యులై ఉండి, నామినీ ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు, చరవాణి నంబరుతోపాటు మత్స్య సంఘం సభ్యత్వం గుర్తింపుతో జీఏఐఎస్‌ సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా పాన్‌ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో 157 మత్స్య సహకార సంఘాలు ఉండగా.. ఇందులో 17,276 మంది సభ్యులున్నారు. ఇందులో సభ్యత్వం ఉంటే ప్రమాదానికి గురైన వారికి ప్రభుత్వం బీమా పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ ప్రీమియం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. సభ్యులందరికీ సామూహికంగా వర్తింపజేసే పీఎం ‘మత్స్య’ యోజనలో బీమా కంపెనీలు నిబంధనలను జఠిలం చేశాయి. మత్స్య యోజనలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు, ప్రమాదం జరిగితే రూ.25 వేలు ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించింది. 

 వీరికి ఇబ్బందులు..

మత్స్యకారులకు ప్రమాద బీమా బాగానే ఉన్నా కొత్త మార్గదర్శకాలు తలనొప్పిగా మారాయి. పాన్‌కార్డు ఉండాలంటే చేతి రాతతో సంతకం చేయాలి. కానీ, చాలా మంది నిరక్ష్యరాసులు కావడంతో వాటిని పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగోలా ఆదాయ ధ్రువపత్రం ఇచ్చేందుకు ముందుకొచ్చినా పాన్‌కార్డు నిబంధనతో వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాల్సి ఉంది. 


వెంటనే నమోదు చేసుకోవాలి..
- రూపేందర్‌ సింగ్, జిల్లా మత్స్యశాఖ అధికారి, సూర్యాపేట

జిల్లాలోని మత్స్యకారులు వెంటనే పాన్‌కార్డు తీసుకొని నమోదు చేసుకోవాలి. లేదంటే పరిహారం చెల్లింపు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వివరాలకు సభ్యులు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి. సంఘంలో సభ్యత్వానికి ఎవరైన డబ్బులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురావాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని