ఆశలు ఆవిరి.. ఆగుతున్న ఊపిరి

రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సుద్దాల చిన్న సాయిలు ఒక ఏజెంటు వద్ద కంపెనీ వీసాకు రూ.1.50 లక్షలు కట్టించుకుని నెలలు గడిచినా పంపలేదు. ఇతనితో పాటు గ్రామంలో మరో ముగ్గురు బాధితులు ఏజెంటు చేతిలో ఇలా మోసపోయారు.

Updated : 20 Jun 2024 04:58 IST

గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో సామాన్యుల విలవిల
రామారెడ్డి, న్యూస్‌టుడే

రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సుద్దాల చిన్న సాయిలు ఒక ఏజెంటు వద్ద కంపెనీ వీసాకు రూ.1.50 లక్షలు కట్టించుకుని నెలలు గడిచినా పంపలేదు. ఇతనితో పాటు గ్రామంలో మరో ముగ్గురు బాధితులు ఏజెంటు చేతిలో ఇలా మోసపోయారు. గల్ఫ్‌కు వెళ్లి నాలుగు రూపాయలు సంపాదిద్దామని అనుకుంటే అప్పులు మిగిలాయి. వీటిని తీర్చే స్థోమత లేక సాయిలు ఈ నెల 17న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన పురం సిద్దిరాములును ఏడాది కిందట మస్కట్‌ దేశానికి కంపెనీ వీసా అని చెప్పి ఏజెంటు పంపించాడు. అక్కడికి వెళ్లాక కంపెనీ కనీస వసతి కల్పించకపోవడంతో 15 రోజుల్లోనే డబ్బులు లేక తిండిలేక ఆకలితో మృతి చెందాడు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

పోసానిపేట్‌లో ఏజెంటు ఇంటి ముందు ధర్నా చేస్తున్న
సిద్దిరాములు కుటుంబ సభ్యులు (పాత చిత్రం)

పుట్టిన గ్రామంలో ఉపాధి లేక గల్ఫ్‌ దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించుకుందామని లక్షలు కట్టి వెళ్తున్నారు. తమ కుటుంబాలను ఉన్నతస్థాయికి తీసుకువద్దామన్న కలలు కలగానే మిగిలిపోతున్నాయి. గల్ఫ్‌ దేశానికి వెళ్లాక, అక్కడ సరైన పనిలేక ఆకలితో, రోడ్లపై తిరుగుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా కార్మికులు ఎక్కువ సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్నారు. ఏజెంట్లు కంపెనీ వీసా, రూ.వేలల్లో జీతం అని నమ్మించి రూ.లక్షల్లో కట్టించుకుని ఏడారి దేశాలకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లాక చెప్పిన పని, జీతం ఉండకపోవడంతో సొంతగ్రామానికి తిరుగు పయనమవుతున్నారు. జిల్లాలో గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో సామాన్య ప్రజలు తరుచూ మోసపోతున్నారు. అప్పులు కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

రూ. లక్షల్లో వసూలు

నకిలీ ఏజెంట్లు రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. అనుమతులు లేకుండానే జిల్లాలో పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో యథేచ్ఛగా కన్సల్టెన్సీలు ప్రారంభిస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లిన వారిని చూసి ఆశతో అమాయకులు ఏజెంట్లను నమ్ముతున్నారు. తొలుత పాస్‌పోర్టు తీసుకొని డబ్బులు కట్టించుకుంటున్న ఏజెంట్లు ఆ తర్వాత వారి చుట్టూ తిప్పించుకుంటున్నారు. పనికి పంపుతున్నామని చెబుతూ టూరిస్ట్‌ వీసా అంటగడుతున్నారు. తీరా ఎడారి దేశానికి వెళ్లిన తర్వాత వాస్తవం గ్రహించి ఏమీచేయలేక బాధితులు స్వగ్రామానికి వస్తున్నారు. ప్రభుత్వం నకిలీ ఏజెంట్ల నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

బాధితులు ముందుకురావాలి

గల్ఫ్‌కు వెళ్లేవారు ఏజెంటు గురించి సరైన వివరాలు తెలుసుకోవాలి. ఒకవేళ మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. బాధితులు ముందుకురావడం లేదు. ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

 సీఐ రామన్, కామారెడ్డి గ్రామీణం

ప్రభుత్వం ఆదుకోవాలి

డబ్బులు కట్టినా గల్ఫ్‌కు ఏజెంటు పంపకపోవడంతో అప్పులు తీర్చే స్థోమత లేక నా భర్త సుద్దాల చిన్న సాయిలు ఉరేసుకొని మృతి చెందాడు. కూతురుని పోషించడానికి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. నాలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా నకిలీ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలి.

 మృతుడు సుద్దాల చిన్న సాయిలు భార్య దేవవ్వ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని