సద్వినియోగం దిశగా.. ‘నోబ్యాగ్‌డే’

ప్రతి నెలా మూడో శనివారం పిల్లలకు పాఠ్యాంశాల బోధన వద్దని ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా ఉల్లాసంగా గడిపేందుకు ప్రభుత్వం ‘నోబ్యాగ్‌డే’ పరిచయం చేసింది.

Updated : 20 Jun 2024 05:56 IST

కొడకండ్ల ప్రాథమిక పాఠశాలలో నో బ్యాగ్‌ డే నిర్వహణ (దాచిన చిత్రం)

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: ప్రతి నెలా మూడో శనివారం పిల్లలకు పాఠ్యాంశాల బోధన వద్దని ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా ఉల్లాసంగా గడిపేందుకు ప్రభుత్వం ‘నోబ్యాగ్‌డే’ పరిచయం చేసింది. వర్తమాన విద్యా సంవత్సరంలో శనివారం నుంచి మొదలైంది. ఈ విషయమై పలు కార్యక్రమాలు ప్రచారంలో ఉన్నా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి(ఎస్సీఈఆర్టీ) 102 పేజీల కరదీపికను విడుదల చేసింది.

కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే..

విద్యార్థికి పాఠాలు వినడం పరీక్షలు మదింపు తదితర మానసిక భారం తగ్గించి వారానికి ఒకరోజు పాఠ్యేతర అంశాలపై ఆసక్తి కలిగించి సహచర మిత్రుల మధ్య ఉల్లాసంగా గడపాలన్నది విద్యాశాఖ యోచన. పిల్లల హాజరు శాతం పెంపునకు దోహదపడుతోందని చెపుతున్నారు. పాఠ్యాంశాల పట్ల, సమాజం పట్ల తగు అవగాహన కల్పిస్తారు.

  • దీనిని సద్వినియోగం చేసుకునేందుకు తరగతుల వారీగా కార్యక్రమాలను రూపొందిస్తారు. వర్తమాన విద్యా సంవత్సరంలో పది నోబ్యాగ్‌ డేలు వస్తాయని అంచనా. వివిధ కుల వృత్తుల వారిని కలవడం, వారి జీవన స్థితిగతులు అధ్యయనం చేయడం, చిన్న చిన్న వ్యాపారులను కలవడం, రైతులతో ప్రధానంగా కూరగాయలు సాగుచేసే విధానంపై సంభాషిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించడం, తమ గ్రామ విశేషాలు తెలుసుకొని రికార్డు చేయడం, గ్రామంలో జనాభా గణన, వివిధ వృత్తుల వారి సంఖ్య, పలు సామాజిక వర్గాల జీవన విధానాల అధ్యయనం తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరణ తదితర విషయాలను వివరించింది. ఆహ్లాదకర ఆటలు నిర్వహించనున్నారు.
  •  ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు గ్రామంలో కలియతిరిగి సమాచార సేకరణ చేసే కృత్యాలను రూపొందిస్తారు. ప్రధాన రహదారులపై ఎలా నడవాలి, వాహనాలు నడిపేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. విద్యావంతులు లేదా విశేష ప్రతిభ ఉన్నవారు, రైతులతో ఇంటర్వ్యూలు చేయాలని, దీనివల్ల సమాచార మార్పిడికి అనుసరించాల్సిన విధానాలు తెలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

వినూత్న కార్యక్రమాలు నిర్వహించవచ్చు..

కరదీపిక గురించి తెలియగానే అంతర్జాలం నుంచి దిగుమతి చేసుకున్నాను. సద్వినియోగం చేసుకొని, వినూత్న కార్యక్రమాలను నిర్వహించి, నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తాం.

 రాజేందర్, కామారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని