చెంచు మహిళపై దాష్టీకం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లి గ్రామంలో ఓ చెంచు మహిళపై దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Updated : 20 Jun 2024 06:10 IST

విచక్షణారహితంగా దాడి.. ఆలస్యంగా వెలుగులోకి

కొల్లాపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మ 

కొల్లాపూర్‌ పట్టణం, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లి గ్రామంలో ఓ చెంచు మహిళపై దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బాధిత చెంచు మహిళ ఈశ్వరమ్మ భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కౌలుకు తీసుకున్నాడు. అదే పొలంలో భూమి యజమానులైన ఈశ్వరమ్మ, ఈదన్నతో కూలీ పని చేయిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తలు గొడవపడటంతో ఈశ్వరమ్మ తన తల్లి గారి ఊరు చుక్కాయపల్లికి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంకటేశ్‌ తల్లి గారి ఇంటి నుంచి ఈశ్వరమ్మను మొలచింతపల్లి గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు. వెంకటేశ్‌ తన భార్య శివమ్మ, బాధితురాలి బంధువు లక్ష్మమ్మ భర్త లింగస్వామితో కలిసి ఆమెపై తీవ్రంగా దాడి చేశారు. పది రోజుల కిందట దాడి జరగగా శరీరంపై కాల్చిన గాయాలున్నాయి. అప్పటి నుంచి ఇంట్లోనే పెట్టి గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీతో వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న ఈదన్న గ్రామస్థులతో కలిసి ఈదమ్మను పంపించమని కోరగా వెంకటేశ్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెళ్లి బాధితురాలిని ఇంటికి తీసుకొని రాగా దాష్టీకం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న ‘జాతీయ ఆదివాసి సాలిడార్టి సంస్థ’ కౌన్సిల్‌ సభ్యులు జయరాజు, రాములు, పోలీసులు, సఖి సభ్యులు సునిత, సరితతో గ్రామానికి వెళ్లి బాధితురాలిని కొల్లాపూర్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించినట్లు సఖి సభ్యులు తెలిపారు. బాధితురాలి భర్త ఈదన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్, ఎస్సై హృషికేష్‌ పేర్కొన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని