కొత్త వంతెన.. అయ్యేనా ఈ వంతున!

పేరు చెప్పగానే నెల్లూరు గుర్తొస్తుంది. దీనిపై నెల్లూరు-కోవూరు మధ్య 1954లో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరగా- దాని స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించారు.

Updated : 21 Jun 2024 06:10 IST

పాత పెన్నా వంతెన పక్కన..కొత్త వంతెన పనులు 

పెన్నానది పేరు చెప్పగానే నెల్లూరు గుర్తొస్తుంది. దీనిపై నెల్లూరు-కోవూరు మధ్య 1954లో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరగా- దాని స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. సుమారు రూ. 98.48 కోట్లు కేటాయించారు. జాతీయ రహదారి విభాగానికి ఈ పనులు అప్పగించగా- ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. 2021లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. 2022 ఫిబ్రవరిలో మొదలైనా.. ఆశించిన రీతిలో ముందుకు సాగకపోవడం చర్చనీయాంశమైంది. 

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే : పెన్నా నదిపై కొత్త వంతెనను 2021 నవంబరులోనే మంజూరు చేయగా- 24 శాతం లెస్‌కు దక్కించుకున్న ఓ సంస్థ.. నష్టం వస్తుందన్న ఆలోచనతో పనులు మొదలు పెట్టలేదని సమాచారం. దాంతో మరోసారి టెండర్లు పిలవగా.. ఇంకో సంస్థ ముందుకొచ్చింది. 2023 అక్టోబరులో దసరా మహోత్సవాల సందర్భంగా భూమిపూజ చేశారు. రూ. 98.48 కోట్ల నిధులతో రెండు వరుసల్లో, 680 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ నూతన వంతెన పనులు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ముందస్తు పనులు తప్ప ప్రధానమైనవి సాగలేదు. 

ఎన్ని అవాంతరాలో?

సోమశిల జలాల విడుదలతో.. పెన్నాలో ప్రవాహం ఉండి.. ఒకటీ, రెండుసార్లు పనులు ఆపాల్సి వచ్చింది. ప్రధాన పనులు చేపట్టాలంటే.. శెట్టిగుంట రోడ్డు కూడలి నుంచి ఉన్న దుకాణాలపైన కొన్ని నిర్మాణాలు తొలగించాల్సి వస్తుందని అధికారులు తేల్చారు. వంతెనకు దగ్గరగా, రైల్వే ట్రాక్‌ సమీపంలోని ఆక్రమణలు తొలగించడం సమస్యగా మారింది. దాదాపు 210 నివాసాలు తొలగించాలని అధికారులు లెక్కలు కట్టారు. ఇందుకోసం రూ. 7 కోట్ల నిధులు కేటాయించాల్సి వచ్చింది. రెవెన్యూ, జాతీయ రహదారులశాఖ సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసినా.. ఆక్రమణల తొలగింపు ఆగిపోతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొత్తంగా పనుల్లో జాప్యం జరుగుతోంది. 

ఎనిమిది నెలలు.. 70 శాతం పనులు

నిబంధనల ప్రకారం.. 2025 ఫిబ్రవరి 15 నాటికి నూతన వంతెనను పూర్తిచేసి.. జాతికి అంకితం చేయాల్సి ఉంది. ప్రస్తుత ఆటంకాలు అధిగమించకపోతే.. ఆ లోపు లక్ష్యం చేరుకోవడం కష్టమనే మాట వినిపిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం అందుకు ఎనిమిది నెలల గడువు ఉండగా.. 70 శాతం పనులు జరగాల్సి ఉంది. 

మా ప్రయత్నం.. తప్పక చేస్తాం

కొత్త వంతెన నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్న మాట వాస్తవమే. ప్రధానంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు ఆలస్యమవుతోంది. రెవెన్యూ అధికారులు సహకరించాల్సి ఉంది. నీటి విడుదలతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కలెక్టర్, ప్రజాప్రతినిధుల సహకారంతో అన్నింటినీ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. నిర్దేశిత గడువుకే పనులు పూర్తి చేసి.. వంతెన సిద్ధం చేస్తాం.  

- అనిల్‌కుమార్‌రెడ్డి, డీఈ, జాతీయ రహదారుల విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని